Jetsetgo Aviation
-
20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్..
ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు ఈ రోజు ఆకాశంలో సగం అన్నట్టు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా పారిశ్రామిక వేత్తలుగా వ్యాపార సామ్రాజ్యాలను సృష్టిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'కనికా టేక్రీవాల్'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సృష్టించిన సామ్రాజ్యం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 1990లో భోపాల్‌లోని మార్వాడీ కుటుంబంలో జన్మించిన కనికా టేక్రీవాల్.. స్కూల్ ఏజికేషన్ మొత్తం లారెన్స్, లవ్‌డేల్ పాఠశాలల్లో పూర్తి చేసి, కోవెంట్రీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత 2012లో జెట్‌సెట్‌గో (JetSetGo) సంస్థ స్థాపించి అతి తక్కువ సమయంలో సక్సెస్ సాధించి.. అతి చిన్న వయసులోనే కంపెనీని సక్సెస్‌పుల్‌గా నడిపిస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. చదువుకునే రోజుల్లో క్యాన్సర్ భారిన పడిన కనికా టేక్రీవాల్ ఆ సమయంలో తనను తాను మోటివేట్ చేసుకోవడానికి మంచి బుక్స్ చదివింది. క్యాన్సర్ వ్యాధితో పోరాడి మళ్ళీ సైక్లింగ్ ట్రాక్‌లో పడిన 'లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్' (Lance Armstrong) జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తనకు తానే ధైర్యం తెచ్చుకుని జెట్‌సెట్‌గో స్టార్ట్ చేసింది. 2012లో కంపెనీ ప్రారంభించిన తరువాత దేశంలోనే గుర్తింపు పొందిన సంస్థగా ఎదిగి 6000 విమానాలను విజయవంతంగా నడుపుతూ ఏవియేషన్ స్టార్టప్ రంగంలో తనదైన ముద్ర వేసింది. ఇందులో చార్టడ్ ఫ్లైట్స్, హెలికాఫ్టర్ కూడా ఉన్నట్లు సమాచారం. నేడు వ్యాపార రంగంలో తనదైన రీతిలో ఎదుగుతూ.. 33 సంవత్సరాల వయసులో 10 సొంత ప్రైవేట్ జెట్లను కలిగి.. సుమారు రూ. 420 కోట్లకు అధినేతగా నిలిచింది. ఇదీ చదవండి: మస్క్, జుకర్‌బర్గ్ ఎలాంటి వారంటే! చెన్నై నుంచి వెళ్లిన తరువాత.. 20 సంవత్సరాల వయసులో క్యాన్సర్ భారిన పడి రెండేళ్ల కాలంలో కోలుకుని, సంస్థ ప్రారంభించి, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తూ.. 33 ఏళ్ల వయసులో రూ. 420 కోట్లు సంపాదించగలిగిందంటే.. దాని వెనుక కనికా టేక్రీవాల్ కృషి అన్యన్య సామాన్యమనే చెప్పాలి. ఇది ఎంతోమంది యువతకు మార్గదర్శం కావాలి. -
జెట్‌సెట్‌గో భారీ డీల్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ విమాన సర్వీసుల రంగంలో ఉన్న జెట్‌సెట్‌గో భారీ డీల్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా 280 హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటోంది. హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024 వేదికగా ఎలెక్ట్రా, ఏరో, హారిజన్ ఎయిర్‌క్రాఫ్ట్, ఓవర్‌ఎయిర్‌తో జెట్‌సెట్‌గో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. డీల్ విలువ సుమారు రూ.10,790 కోట్లు. హారిజన్ తయారీ 50 కెవోరైట్ ఎక్స్7 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటోల్) ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటున్నట్టు సమాచారం. మరో 50 ఎక్స్7 ఈవీటోల్స్ తీసుకునే అవకాశమూ ఉంది. నగరాల్లో ఎయిర్ట్యాక్సీలుగా, విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు, వివిధ ప్రదేశాలకు, నగరాల మధ్య, నగరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లేందుకు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వినియోగించవచ్చని జెట్‌సెట్‌గో శుక్రవారం వెల్లడించింది. ‘ఈ మూడు కంపెనీలతో భాగస్వామ్యం భారత్‌కు బ్లోన్ లిఫ్ట్, ఫ్యాన్ ఇన్ వింగ్ లిఫ్ట్ సిస్టమ్స్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, సూపర్–క్వైట్ ఆప్టిమల్ స్పీడ్ టిల్ట్ రోటర్స్ వంటి ప్రత్యేక సాంకేతికతలను పరిచయం చేస్తుంది’ అని జెట్‌సెట్‌గో ఫౌండర్, సీఈవో కనిక టేక్రివాల్ తెలిపారు. -
ఆకాశమంత: రూ. 5600 పెట్టుబడితో.. 500 మిలియన్ల టర్నోవర్ స్థాయికి..
మనదేశంలోని విమానయాన సంస్థల్లో అత్యంత పెద్దదైన సంస్థ జెట్‌సెట్‌గో. దీనిని స్థాపించింది ఓ మహిళ. పేరు కనికా టేక్రీవాల్. పదేళ్ల కిందట స్థాపించిన ఆ సంస్థ ఇప్పుడు ఐదు వందల మిలియన్ల టర్నోవర్‌తో నడుస్తోంది. ఐదేళ్ల కిందట ఫోర్బ్స్ అండర్ థర్టీ విభాగంలో ఆసియాలో ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ కనికా టేక్రీవాల్. కనికా టేక్రీవాల్ది భోపాల్‌కు చెందిన మార్వారీ వ్యాపార కుటుంబం. ఈ కుటుంబానికి దేశవ్యాప్తంగా మారుతీ డీలర్షిప్ ఉంది. కనిక తండ్రి అనిల్ టేక్రీవాల్ ఉమ్మడి కుటుంబం భాగాలు పంచుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. తల్లి సునీత గృహిణి. కనిక ఆమె తమ్ముడు కనిష్క్... ఇదీ వాళ్ల చిన్న కుటుంబం. మంచి చదువు కోసం అనే కారణం గా సొంతూరికి 17 వందల కిలోమీటర్ల దూరాన ఉన్న ఊటీకి వచ్చి పడిందామె బాల్యం. పదవ తరగతి తర్వాత తిరిగి భోపాల్‌కి వెళ్లి పన్నెండు వరకు అక్కడే చదివింది. ఆ తర్వాత ముంబయిలోని బీడీ సోమాని ఇన్స్టిట్యూట్లో విజువల్ కమ్యూనికేషన్ అండ్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ‘ముంబయి తనకు జీవించడం నేర్పించింది’ అంటోంది కనిక కాలేజ్ రోజులను తలుచుకుంటూ. కారు నుంచి బస్సుకు ‘‘గ్రాడ్యుయేషన్‌కి ముంబయిలో హాస్టల్లో ఉన్నప్పుడు మా నాన్న నాకు పాకెట్ మనీ చాలా తక్కువగా కచ్చితంగా లెక్కపెట్టినట్లు ఇచ్చేవారు. చేతిలో డబ్బు ఎక్కువ ఉంటే వ్యసనాలకు అలవాటు పడతానని నాన్న భయం. ఈ నేపథ్యంలో ముంబయి నగరం నాకు జీవించడం నేర్పించింది. అప్పటివరకు నేను చూసిన జీవితంలో నేను బయటకు వెళ్లడానికి ఇంట్లో నుంచి కాలు బయటపెడితే ఏ కారు అడుగుతానోనని మా డ్రైవర్లు నా చుట్టూ మూగేవాళ్లు. హాస్టల్లో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి సిటీబస్‌లో ప్రయాణించడం మొదలుపెట్టాను. నాన్న నెలకు ఒక సినిమాకు డబ్బిస్తే మేము నాలుగు సినిమాలు చూడాలి కదా మరి. అందుకే ఆ పొదుపు. కొన్నాళ్లకు అది కూడా కాదని నెలకు మూడు వందల రూపాయలకు పార్ట్‌టైమ్ వర్క్ మొదలుపెట్టాను. జీవితంలో అత్యంత సంతోషం అప్పుడు కలిగింది. సొంత సంపాదన ఇచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. ఆ డబ్బును ఖర్చు చేయబుద్ధి కాలేదు. అందుకే మా అమ్మకిచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి యూకేకి వెళ్లాను. ఎంబీఏ చేస్తూ ఏరోస్పేస్ రీసోర్సెస్లో ఉద్యోగం చేశాను. క్యాన్సర్ పరీక్ష పీజీతోపాటు చదువులో పరీక్షలన్నీ పూర్తయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లు ఎందుకో తెలియదు కానీ అమ్మానాన్నల దగ్గర ఉందామనిపించింది. నా ఎదురుగా మరో పరీక్ష ఉందని ఇండియాకి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పటికే నన్ను క్యాన్సర్ పీడిస్తోంది. ట్రీట్మెంట్ సమయమంతా మోటివేషనల్ బుక్స్ చదవడానికే కేటాయించాను. లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవితం నాకు స్ఫూర్తినిచ్చింది. ఒక సైక్లిస్ట్ క్యాన్సర్‌తో పోరాడి తిరిగి ట్రాక్‌లో పోటీపడడం నాకు ధైర్యాన్నిచ్చింది. నన్ను నేను దృఢంగా మార్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. పన్నెండు కీమో థెరపీలు, రేడియేషన్ల తర్వాత మామూలయ్యాను. అప్పటికి నా వయసు 23. ఆ తర్వాత ఏడాది అంటే 2012లో జెట్‌సెట్‌గో ప్రారంభించాను. ఆరోగ్యరీత్యా ఇంతపెద్ద వెంచర్‌ను తలకెత్తుకోవడానికి ఎవరూ ప్రోత్సహించలేదు. ‘ఏమీ చేయకుండా ఊరుకోవడం ఇష్టం లేకపోతే బేకరీ పెట్టి కప్‌కేక్స్ చేసుకోవచ్చు కదా’ అని నిరుత్సాహపరిచిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనమేం చేయాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఆ అవకాశం ఇతరులకు ఇవ్వకూడదు. సామాన్యులకూ సాధ్యమే! జెట్‌సెట్‌గోలో నా తొలి పెట్టుబడి 5,600 మాత్రమే. ఆ డబ్బుతో యాప్ తయారు చేసుకున్నాను. చార్టెడ్ ఫ్లయిట్స్‌ను బుక్ చేసుకోగలిగిన యాప్ అది. రెండేళ్ల పాటు క్లయింట్ల నుంచి అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవడంతోపాటు వెండర్స్ నుంచి హైర్ చేసి వ్యాపారం నిర్వహించాను. అద్దె హెలికాప్టర్లతో మొదలైన వ్యాపారం 2020కి ఎనిమిది సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 200 మంది ఉద్యోగులు, 15 కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. మా సర్వీస్ ద్వారా 2020–21 ఆరువేల ఫ్లైట్లతో లక్ష మంది ప్రయాణించారు. మా క్లయింట్లలో సాధారణంగా కార్పొరేట్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులే ఉంటారు. ఢిల్లీ – ముంబయి, ముంబయి – బెంగళూరు, హైదరాబాద్ – ఢిల్లీలకు ప్రయాణించేవాళ్లు ఎక్కువ. మా క్లయింట్ అవసరాన్ని బట్టి ఆరు సీట్ల చార్టర్ ఫ్లైట్ నుంచి 18 సీట్ల ఫ్లయిట్ వరకు అందించగలుగుతాం. మెడికల్ ఎమర్జెన్సీలు కూడా ఉంటాయి. మనదేశంలో ఉన్న ప్రైవేట్ చార్టర్ కంపెనీలలో మాది బెస్ట్ ప్రైవేట్ చార్టర్. ఈ స్థాయికి చేరిన తర్వాత ముంబయిలో ఓ ప్రయోగం చేశాం. హెలికాప్టర్లో ప్రయాణించాలనే సరదా చాలామందిలో ఉంటుంది. కానీ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడానికి అంత ఖర్చు చేసి చార్టర్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. హెలికాప్టర్లో విహరించాలనే సరదా బలంగా ఉంటుంది. అలాంటి వాళ్ల కోసమే ఈ షటిల్ సర్వీస్ ప్రయోగం. నగరంలో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లి రావచ్చన్నమాట. అది కూడా ఊబెర్ సర్వీస్‌లో ముంబయిలో ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లి వచ్చిన ఖర్చులోనే. దూరాన్ని బట్టి కనీసం వెయ్యి నుంచి గరిష్టంగా రెండున్నర వేల రూపాయలుగా నిర్ణయించాం. మాది ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ అన్నమాట. భవిష్యత్తులో ఇది బాగా పాపులర్ అవుతుందని కచ్చితంగా చెప్పగలను’’ అంటోంది కనిక. ఆ హక్కు నాకు లేదు ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయం ఏమిటంటే... కోవిడ్ సమయంలో ఉద్యోగులను తగ్గించడం కానీ, జీతాల్లో కోత విధించడం కానీ చేయలేదు. నేను మా ఉద్యోగుల కు సంస్థ లాభాల్లో భాగస్వామ్యం ఎప్పుడూ ఇవ్వలేదు. కాబట్టి మా నష్టాలను వాళ్లను కొంత పంచుకోమని అడగడం అనైతికం. యజమానిగా నేను నష్టంలో ఉన్న కారణంగా ఉద్యోగుల జీతంలో కోత విధించే హక్కు నాకు ఉండదు. – కనికా టేక్రీవాల్, జెట్‌సెట్‌గో ఫౌండర్ -
వేడుకలకూ విమానంలో షికారు..
♦ జెట్‌సెట్‌గో ఏవియేషన్ సీఈవో కనిక టేక్రివాల్ ♦ ప్రత్యేక విమానాలకు పెరుగుతున్న క్రేజ్ ♦ విదేశాలు చుట్టి వస్తున్న యువ జంటలు ♦ ఈ ఏడాది 14 జెట్స్ కొంటున్నాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారం, విహారం, వేడుక.. సందర్భం ఏదైతేనేం ప్రత్యేక విమానాల్లో విహరించడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అనుకూల సమయానికితోడు ప్రైవసీ ఉంటుందన్నది కస్టమర్ల భావన. అంతేకాదు ప్రయాణ ఖర్చులూ ఇతర విమానాల మాదిరిగానే ఉంటున్నాయి. ఇంకేం ఒక్క క్లిక్‌తో ప్రత్యేక విమానంలో దూసుకెళ్తున్నారని అంటున్నారు జెట్‌సెట్‌గో ఏవియేషన్ సర్వీసెస్ సీఈవో కనిక టేక్రివాల్. రేడియో క్యాబ్స్ మాదిరిగా జెట్‌సెట్‌గో.ఇన్ వెబ్సైట్ ద్వారా విమాన సర్వీసులను అందిస్తున్న ఈ సంస్థ భారత్‌లో ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లను ఒక వేదికపైకి తొలిసారిగా తీసుకొచ్చింది. మార్కెట్ తీరుతెన్నులు, కంపెనీ విస్తరణపై సాక్షి బిజినెస్ బ్యూరోకు ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఇవీ.. ప్రత్యేక విమానాల అవసరం ఏ విధంగా పెరుగుతోంది? వ్యాపారస్తులైనా, మరొకరైన తక్కువ సమయంలో మరో నగరానికి చేరుకోవాలంటే ప్రత్యేక విమానాలు బెటర్. భారత్‌లోని నగరాలే కాదు యూఎస్, దుబాయ్, హాంకాంగ్, ఆఫ్రికా తదితర దేశాలను చిన్న విమానాల్లో ఇక్కడి నుంచి చుట్టివస్తున్నారు. అలాగే ఒక విమానంలో తమవారితో మాత్రమే ప్రయాణించడంలో ఉన్న సంతృప్తి అంతా ఇంతా కాదు. పెళ్లికి వచ్చిన బంధువులకు జాయ్ రైడ్స్ చేయించడం, కొత్త జంటలు హనీమూన్‌కు విదేశాలు లేదా దేశీయంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లడం, ఫొటో షూట్స్ కోసం విమానాల్లో చక్కర్లు కొట్టడం ఫ్యాషన్ అయిపోయింది. కుటుంబ సభ్యులతో పక్షులు, జంతువులూ ప్రయాణించడం విశే షం. కంపెనీ ఆఫర్ చేస్తున్న చార్జీల వివరాలు చెప్పండి? దూరాన్నిబట్టి మాత్రమే చార్జీ చేస్తున్నాం. పౌర విమానయాన రంగంలో ఉన్న సంస్థలు సమయాన్నిబట్టి చార్జీ చేస్తాయి. అంటే రేపో ఎల్లుండో టికెట్ కావాల్సి వస్తే కస్టమర్‌కు తడిసిమోపెడు కావాల్సిందే. పూర్తి విమాన బుకింగ్‌తోపాటు ఒక విమానంలో పలువురు ప్రయాణించేలా విడిగా టికెట్లను విక్రయిస్తున్నాం. జెట్ స్టీల్ పేరుతో రూ.4 వేల నుంచే ఒక్కో టికెట్‌ను అందుబాటులోకి తెచ్చాం. అలాగే గంటకు రూ.40 వేలతో 4 సీట్లున్న చిన్న విమానాన్ని బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-తిరుపతి, బెంగళూరు-చెన్నై తదితర రూట్లలో గంటలో ప్రయాణించొచ్చు. 17 సీట్లున్న విమానమైతే రూ.4 లక్షలు ఖర్చు అవుతుంది. రోజుకు ఎన్ని బుకింగ్స్ నమోదు చేస్తున్నారు? 2014 మార్చిలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ ఏడాది మొత్తం 300 బుకింగ్స్ అయ్యాయి. 2015లో ఈ సంఖ్య 1,100లకు పైమాటే. ఇప్పుడు రోజుకు 6 బుకింగ్స్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏడాది కాలానికిగాను కంపెనీ చేతిలో రూ.130 కోట్ల విలువైన ఆర్డర్ బుక్ ఉంది. ఇప్పటి వరకు రూ.60 కోట్ల వ్యాపారం చేశాం. వేడుకలకు, సమావేశాలకు పెద్ద విమానాల బుకింగ్ సేవలను అందిస్తున్నాం. ప్రముఖ ఎయిర్‌లైన్స్‌తో చేతులు కలిపాం. ఎమర్జెన్సీ మెడికల్ ఫ్లైట్స్ కోసం రోజుకు ఒక బుకింగ్ వస్తోంది. హైదరాబాద్ నుంచి వారంలో 8 బుకింగ్స్ అవుతున్నాయి. సొంతంగా విమానాలు కొనుగోలు చేసే ఆలోచన ఉందా? ప్రస్తుతం కంపెనీ చేతిలో 10 సీట్లున్న హాకర్ బీచ్‌క్రాఫ్ట్ విమానముంది. ఈ ఏడాది డిసెంబరుకల్లా మరో 14 జెట్స్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. క్రికెటర్ యువరాజ్ సింగ్, వ్యాపారవేత్త పునీత్ దాల్మియా కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఇక వివిధ కంపెనీలు, వ్యక్తులకు చెందిన 120 ఎయిర్‌క్రాఫ్ట్స్ మా వద్ద రిజిష్టర్ అయి ఉన్నాయి. వీటిలో 35 హెలికాప్టర్లున్నాయి. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులను (అంబులెన్సు) 8 విమానాలు అందిస్తున్నాయి. రూ.5 వేలతో కంపెనీని పెట్టాం. 8 మంది సిబ్బందితో మొదలై ఇప్పుడు 50 మంది వరకు ఉన్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, దుబాయి, లండన్, న్యూయార్క్‌లో ఆఫీసులున్నాయి. త్వరలో హైదరాబాద్, విజయవాడలో కార్యాలయాలు ప్రారంభిస్తాం. అయిదేళ్లలో మూడు రెట్ల వ్యాపారం నమోదవుతుందని ఆశిస్తున్నాం.