వాహనం కొన్న వ్యక్తిపైనే ఒకశాతం పన్ను బాదుడు!
రూ.10 లక్షలపైబడిన కొనుగోళ్లపై స్పష్టత
న్యూఢిల్లీ: ఇకపై రూ.10 లక్షల పైబడిన వాహనం కొనుగోలుచేసిన వినియోగదారుడు... 1% అదనపు పన్ను భారాన్ని భరించాల్సి ఉంటుంది. నిజానికి రూ.10 లక్షలు పైబడిన వాహనం కొనుగోలుపై 2016-17 బడ్జెట్ ఒక శాతం పన్ను ప్రతిపాదనను చేసింది. అయితే ఈ పన్నును కొనుగోలుదారుడు భరించాలా...? లేక అమ్మకందారు భరించాలా? అన్న అంశంపై అస్పష్టత నెలకొంది. దీనికి సంబంధించి గురువారం ఆమోదం పొందిన ఫైనాన్స్‌బిల్లు-2016లో ఆర్థికమంత్రి జైట్లీ ఒక సవరణ ద్వారా స్పష్టతనిచ్చారు. రూ. 10 లక్షలు దాటిన డివిడెండ్ ఆదాయానికి సంబంధించి కంపెనీలు చెల్లించే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నుతోపాటు సదరు ఆదాయం పొందిన వ్యక్తి కూడా అదనపు డివిడెండ్ పన్ను 10 శాతం మేర చెల్లించాల్సి ఉంటుందని తాజా సవరణలో వివరించారు.