గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు దీర్ఘకాలంగా వేచిచూస్తున్న ఇండస్ టవర్స్‌తో విలీన అంశం మరోసారి వాయిదా పడటంతో టెలికం రంగ మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్‌ఫ్రాటెల్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం..
కెనరా బ్యాంక్
గత ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో పీఎస్‌యూ కెనరా బ్యాంక్ రూ. 3259 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2108-19) క్యూ4లో రూ. 552 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. పన్నుకు ముందు నష్టం సైతం రూ. 2550 కోట్ల నుంచి రూ. 3335 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) తగ్గడం, ఉద్యోగ వ్యయాలు పెరగడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎన్‌ఐఐ 9 శాతం తక్కువగా రూ. 3319 కోట్లను తాకింది. ఉద్యోగ వ్యయాలు రెట్టింపై రూ. 2175 కోట్లను తాకగా.. ఇతర ఆదాయం 19 శాతం పుంజుకుని రూ. 2175 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో వరుసగా రెండో రోజు కెనరా బ్యాంక్ కౌంటర్ బలహీనపడింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 104 వద్ద ట్రేడవుతోంది. బుధవారం సైతం ఈ షేరు 4 శాతం తిరోగమించి రూ. 110 దిగువన స్థిరపడింది.
భారతీ ఇన్‌ఫ్రాటెల్
ఇండస్ టవర్స్‌తో విలీనానికి ఇంతక్రితం నిర్ణయించిన జూన్ 24 గడువును తాజాగా రెండు నెలలు పొడిగిస్తున్నట్లు భారతీ ఇన్‌ఫ్రాటెల్ పేర్కొంది. బుధవారం సమావేశమైన బోర్డు ఆగస్ట్ 31వరకూ విలీన గడువును పొడిగించేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. నిజానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇండస్ టవర్స్ విలీన అంశానికి గడువును ఈ 24 వరకూ పొడిగిస్తున్నట్లు ఏప్రిల్ 24న భారతీ ఇన్‌ఫ్రాటెల్ తెలియజేసింది. టెలికం టవర్ల కంపెనీ ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్ ఐడియాకు సైతం 11.15 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 222 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 218 వరకూ జారింది. కాగా.. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజాగా భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేరుకి అండర్‌వెయిట్ రేటింగ్‌ను ఇచ్చింది. రూ. 175 టార్గెట్ ధరను సైతం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment