
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నష్టాలు గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో భారీగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.214 కోట్ల నికర లాభం వచ్చిందని, అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.4,860 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కెనరా బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు దాదాపు మూడు రెట్లు పెరిగాయని పేర్కొంది. ఈ కేటాయింపులు రూ.2,924 కోట్ల నుంచి 200 శాతం వృద్ధితో రూ.8,763 కోట్లకు చేరాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.12,889 కోట్ల నుంచి రూ.11,555 కోట్లకు తగ్గిందని వివరించింది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,122 కోట్ల నికర లాభం రాగా, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.4,222 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కెనరా బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.48,942 కోట్ల నుంచి రూ.48,195 కోట్లకు తగ్గిందని పేర్కొంది.
తగ్గిన రుణ నాణ్యత..
బ్యాంక్ రుణ నాణ్యత తగ్గింది. గత ఏడాది మార్చినాటికి రూ.34,202 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.47,468 కోట్లకు పెరిగాయని కెనరా బ్యాంక్ పేర్కొంది. నికర మొండి బకాయిలు రూ.21,649 కోట్ల నుంచి రూ.28,542 కోట్లకు పెరిగాయని వివరించింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 9.63 శాతం నుంచి 11.84 శాతానికి, నికర మొండి బకాయిలు 6.33 శాతం నుంచి 7.48 శాతానికి పెరిగాయని వివరించింది.
మొండి బకాయిల విషయంలో తమ అంచనాలకు, ఆర్‌బీఐ మదింపునకు తేడా రూ.3,249 కోట్లుగా ఉందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.34,202 కోట్లుగా మొండి బకాయిలు ఉండగలవని తాము నివేదించామని, ఆర్‌బీఐ మాత్రం రూ.37,451 కోట్ల మొండి బకాయిలు ఉండొచ్చని మదింపు చేసిందని వివరించింది.
నికర మొండి బకాయిల విషయంలో తమకు, ఆర్‌బీఐ మదింపునకు తేడా రూ.1,847 కోట్లని తెలిపింది. రూ.21,649 కోట్ల నికర మొండి బకాయిలు ఉండొచ్చని నివేదించామని, ఆర్‌బీఐ మదింపు రూ.23,496 కోట్లని పేర్కొంది. ఫలితంగా రూ.1,401 కోట్ల కేటాయింపులు జరపాల్సి వచ్చిందని తెలిపింది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేర్ 0.9 శాతం నష్టపోయి రూ.246 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment