న్యూఢిల్లీ : వరుసగా మూడు నెలల పతనం అనంతరం ఏప్రిల్ నెలలో ప్యాసెంజర్ కార్ల అమ్మకాలు పెరిగాయి. 1.87శాతం వృద్దిని కార్ల అమ్మకాలు నమోదుచేశాయి. భారత ఆటోమోబైల్ తయారీదారుల సొసైటీ(ఎస్ఐఏమ్) విడుదల చేసిన గణాంకాల్లో దేశీయ కార్ల అమ్మకాలు ఏప్రిల్ లో 1,62,566 యూనిట్లగా రికార్డు అయ్యాయి. గతేడాది ఇదే నెలల్లో ఈ అమ్మకాలు 1,59,588 యూనిట్లగా ఉన్నాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మారుతీ బాలెనో, రెనాల్డ్ క్విడ్ లతో ఈ అమ్మకాలు పెరిగినట్టు ఎస్ఐఎమ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాధుర్ తెలిపారు.అయితే గ్రామీణ ప్రాంతాల్లో కార్ల అమ్మకాలు ఇంకా తక్కువగానే నమోదవుతున్నాయని చెప్పారు. మొత్తం ప్యాసెంజర్ వాహన రంగం 11శాతం వృద్ధిలో ఉందని, యుటిలిటీ వెహికిల్స్ హ్యుందాయ్ క్రిటా, మారుతీ విటారా బ్రీజా, మహింద్రా కేయూవీ100 ఈ వృద్ధికి దోహదంచేశాయని మాథుర్ తెలిపారు.అదేవిధంగా కమర్షియల్ వాహనాల అమ్మకాలు కూడా ఏప్రిల్ నెలలో 17.36 శాతం వృద్ధితో 53,853యూనిట్లగా నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఏప్రిల్ లో ప్యాసెంజర్ వాహన అమ్మకాలు 11.04శాతం వృద్ధిని నమోదుచేసి, 2,42,060 యూనిట్లగా రికార్డు అయ్యాయి. గతేడాది ఈ నెలలో ఈ అమ్మకాలు 2,17,989గా ఉన్నాయి. యుటిలిటీ వెహికిల్స్ 42.82శాతం వృద్ధిని నమోదుచేశాయి. మారుతీ సుజుకీకి ఏప్రిల్ లో 2.72శాతం వృద్ధితో 86,481యూనిట్ల దేశీయ అమ్మకాలు జరిగాయి. అయితే దాని ప్రత్యర్థి హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు పడిపోయాయి. 10.52శాతం అమ్మకాలు కిందకి జారి, కేవలం 34,425 యూనిట్లనే నమోదుచేశాయి. అదేవిధంగా ఏప్రిల్ నెలలో టూవీలర్స్ అమ్మకాలు కూడా 21.23శాతం పెరుగుదలతో 15,60,339యూనిట్ల అమ్మకాలు జరిగాయి. 2016 ఏప్రిల్ నెలలో అన్ని విభాగాల్లో నమోదైన ఈ వృద్ధి భారత ఆటోమోటివ్ పరిశ్రమలో పాజిటివ్ ట్రెండ్ ను సూచిస్తుందని ఆటోమోబైల్ నిపుణులంటున్నారు. త్వరలోనే డీజిల్ వెహికిల్స్ సమస్యలు కూడా పరిష్కారం కాగలవని ఆశిస్తున్నారు.
ఏప్రిల్ లో కార్ల అమ్మకాలు రయ్.. రయ్..
Published Mon, May 9 2016 4:43 PM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM
Advertisement
Advertisement