ముంబై: ఆర్థిక వ్యవస్థలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయని, దీంతో రుణాల పంపిణీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు యాక్సిస్ బ్యాంకు ఎండీ అమితాబ్ చౌదరి అన్నారు. ఒకవైపు అధిక ఎన్‌పీఏల సమస్య నుంచి బ్యాంకులు బయటపడుతూ, రుణాల జారీ నిదానించిన సమయంలోనే ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ‘‘ఆర్థిక రంగంలో ఏర్పడుతున్న పరిణామాలతో ఒత్తిళ్లకు సంబంధించి కొత్త సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో మేము జాగ్రత్తగా ఉన్నాం’’ అని అమితాబ్ చౌదరి ముంబైలో మీడియాతో అన్నారు. కొత్త విభాగాల్లో ఒత్తిళ్ల గురించి చౌదరి మాట్లాడుతూ... రియల్ ఎస్టేట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఈ రెండు విభాగాలు తమకు ఆందోళన కలిగిస్తున్నట్టు చెప్పారు.
అయితే, వీటిల్లో చాలా కంపెనీలు మంచి స్థితిలోనే ఉన్నట్టు ఆ వెంటనే ఆయన పేర్కొన్నారు. ‘‘మేం మరీ రిస్క్ చేయదలుచుకోవడం (కన్జర్వేటివ్) లేదు. మా రిస్క్ నిర్వహణ విధానాలు సరిగ్గా ఉండాలనుకుంటున్నాం’’ అని చౌదరి వివరించారు. అయితే, యాక్సిస్ బ్యాంకు తన ప్రధాన వ్యాపారమైన రిస్క్ తీసుకుని, రుణాలను ఇవ్వడాన్ని బాగా తగ్గించుకుంటుందని భావించొద్దంటూ స్పష్టతనిచ్చారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఒత్తిళ్ల గురించి మాట్లాడుతూ... ఏడాది అవుతున్నా ఇంత వరకు పరిష్కారం లభించలేదని, కొన్ని కంపెనీలు మంచిగానే పనిచేస్తున్నందున ఈ విషయంలో సూక్ష్మ పరిశీలన అవసరమన్నారు. ఇది వ్యవస్థాపరమైన అంశంగా మారుతుందని తాను భావించడం లేదని, ఇబ్బందులను అధిగమించేందుకు వ్యవస్థకు సమయం పడుతుందన్నారు. కొన్ని కంపెనీలకు త్వరితంగా ఈక్విటీ నిధుల అవసరం ఉందని పేర్కొన్నారు. బ్యాంకు సొంతంగా రుణాల జారీకే ప్రాధాన్యమిస్తుందని, అదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీ పోర్ట్‌ఫోలియో కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment