Amitabh Choudhary
-
యాక్సిస్ గూటిలో సిటీ రిటైల్
న్యూఢిల్లీ/ముంబై: విదేశీ సంస్థ సిటీబ్యాంకు రిటైల్ బిజినెస్ కొనుగోలు పూర్తయినట్లు ప్రయివేట్ రంగ దేశీ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. దేశీయంగా సంస్థాగత క్లయింట్ల బిజినెస్‌ను మినహాయించిన డీల్ ప్రకారం తుదిగా రూ. 11,603 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. గతేడాది మార్చిలో యాక్సిస్ తొలిసారిగా కొనుగోలు అంశాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా 2.4 మిలియన్ సిటీ కస్టమర్లను యాక్సిస్ పొందింది. డీల్ కుదిరే సమయానికి ఈ సంఖ్య 3 మిలియన్లుగా నమోదైనట్లు యాక్సిస్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌధురి తెలియజేశారు. తమ ఖాతాదారులుగా మారిన సిటీ కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, చెక్ బుక్కులు, ప్రొడక్టు లబ్ధి తదితరాలు యథావిధిగా కొనసాగనున్నట్లు వివరించారు. మొత్తం 8.6 మిలియన్ కార్డులతో నాలుగో పెద్ద క్రెడిట్ కార్డుల సంస్థగా నిలుస్తున్న యాక్సిస్ మరో 2.5 మిలియన్ క్రెడిట్ కార్డులను జత చేసుకుంది. తద్వారా మూడో ర్యాంకుకు చేరింది. రూ. 4 లక్షల కోట్ల రిటైల్ బుక్ కలిగిన యాక్సిస్ సిటీబ్యాంక్ ఇండియాకు చెందిన 3 మిలియన్ కస్టమర్లతోపాటు.. 18 పట్టణాలలోగల 7 కార్యాలయాలు, 21 బ్రాంచీలు, 499 ఏటీఎంలను సొంతం చేసుకుంది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంమేరకు సిటీ బ్రాండును 18 నెలలపాటు యాక్సిస్ బ్యాంక్ వినియోగించుకోనుంది. -
బీసీసీఐ మాజీ సంయుక్త కార్యదర్శి హఠాన్మరణం
Amitabh Choudhary: భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందారు. ఆయన వయస్సు 58 ఏళ్లు. అమితాబ్ చౌదరి స్వస్థలం ఝార్ఖండ్‌లోని రాంచి. కాగా అశోక్‌నగర్‌లో ఉన్న తన నివాసంలో అమితాబ్ మంగళవారం ఉదయం అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు రావడంతోనే అమితాబ్ మరణించినట్లు సదరు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా అమితాబ్ చౌదరి గతంలో ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్(జేపీఎస్సీ) చైర్మన్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి సంతాపం అమితాబ్ చౌదర్ ఆకస్మిక మరణం పట్ల ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. ‘‘జేపీఎస్సీ చైర్మన్ అమితాబ్ చౌదరీ జీ మరణించారన్న విషాదకర వార్త తెలిసింది. ఐపీఎస్ అధికారి అయిన ఆయన రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి’’ అని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యం ప్రసాదించాలంటూ సంతాపం ప్రకటించారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా.. ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి అయిన అమితాబ్ చౌదరి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఝార్ఖండ్‌లో ఐజీపీ ర్యాంకులో పనిచేశారు. కాగా జేపీఎస్ చైర్మన్‌గా రాంచిలో మెరుగైన క్రికెట్ స్టేడియంలు నిర్మించడంలో... మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించారు. గతంలో బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగానూ పనిచేశారు. అయితే, 2005 నాటి జింబాబ్వే టూర్ మాత్రం ఆయన కెరీర్లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అప్పటి కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఆనాటి టీమిండియా కోచ్ గ్రెగ్ చాపెల్ మధ్య తలెత్తిన విభేదాలు వివాదానికి దారితీశాయి. చదవండి: విరాట్ కోహ్లి ఫామ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన గంగూలీ -
యాక్సిస్ బ్యాంకుకు 15వేలమంది గుడ్‌బై
ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగస్థుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా యాక్సిస్ బ్యాంక్‌లో 15వేల మంది ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ వర్గాల ప్రకారం..ఎక్కువగా సీనియర్, మధ్య స్థాయి, వినియాగదారులకు సేవలందించే శాఖకు సంబంధించిన ఉద్యోగులే కంపెనీని వీడుతున్నారు. బ్యాంకులో ఇటీవల తీసుకొచ్చిన నిర్మాణాత్మక, కార్యనిర్వాహక సంస్కరణలు ఈ రాజీనామాలకు దోహదం చేసినట్టుగా భావిస్తున్నారు. బ్యాంక్‌కు సుదీర్ఘకాలం సేవలందించిన సీఈవో శిఖా శర్మ రాజీనామా తర్వాత కొత్త ఎండీ, సీఈవోగా అమితాబ్ చౌదరి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. నూతన మేనేజ్మెంట్ సరికొత్త సంస్కరణలకు నాంది పలికిన విషయం తెలిసిందే. కొత్తగా నైపుణ్యాలను స్వీకరించేవారు అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని, స్వీకరించని వారే సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా రాజీనామాలు పరంపర కొనసాగుతున్నప్పటికి ఈ ఆర్థిక సంవత్సరంలో 28వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నామని, రాబోయే రెండేళ్లలో 30 వేల మందిని నియమించుకోనున్నామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్‌లో 72 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది. కొత్త ఉద్యోగాల వల్ల బ్యాంకింగ్ సేవలు మరింత మెరుగయ్యాయని యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రాజేష్ దహియా అన్నారు. ఆయన స్పందిస్తూ..వృద్ది, ఆదాయ పురోగతి, స్థిరత్వం అంశాలలో పురోగతి సాధించే విధంగా తమ ప్రణాళిక ఉంటుందని, తమ ఉద్యోగులే నిజమైన ఆస్థి అని తెలిపారు. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) వల్ల కొత్త నైపుణ్యాలను అలవర్చుకున్న వారికి ఎలాంటి నష్టం లేదని, ప్రతిభను మెరుగుపర్చుకోని వారికి ఉద్వాసన తప్పదని తెలిపారు. -
రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటాం
ముంబై: ఆర్థిక వ్యవస్థలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయని, దీంతో రుణాల పంపిణీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు యాక్సిస్ బ్యాంకు ఎండీ అమితాబ్ చౌదరి అన్నారు. ఒకవైపు అధిక ఎన్పీఏల సమస్య నుంచి బ్యాంకులు బయటపడుతూ, రుణాల జారీ నిదానించిన సమయంలోనే ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ‘‘ఆర్థిక రంగంలో ఏర్పడుతున్న పరిణామాలతో ఒత్తిళ్లకు సంబంధించి కొత్త సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో మేము జాగ్రత్తగా ఉన్నాం’’ అని అమితాబ్ చౌదరి ముంబైలో మీడియాతో అన్నారు. కొత్త విభాగాల్లో ఒత్తిళ్ల గురించి చౌదరి మాట్లాడుతూ... రియల్ ఎస్టేట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఈ రెండు విభాగాలు తమకు ఆందోళన కలిగిస్తున్నట్టు చెప్పారు. అయితే, వీటిల్లో చాలా కంపెనీలు మంచి స్థితిలోనే ఉన్నట్టు ఆ వెంటనే ఆయన పేర్కొన్నారు. ‘‘మేం మరీ రిస్క్ చేయదలుచుకోవడం (కన్జర్వేటివ్) లేదు. మా రిస్క్ నిర్వహణ విధానాలు సరిగ్గా ఉండాలనుకుంటున్నాం’’ అని చౌదరి వివరించారు. అయితే, యాక్సిస్ బ్యాంకు తన ప్రధాన వ్యాపారమైన రిస్క్ తీసుకుని, రుణాలను ఇవ్వడాన్ని బాగా తగ్గించుకుంటుందని భావించొద్దంటూ స్పష్టతనిచ్చారు. ఎన్బీఎఫ్సీ రంగంలో ఒత్తిళ్ల గురించి మాట్లాడుతూ... ఏడాది అవుతున్నా ఇంత వరకు పరిష్కారం లభించలేదని, కొన్ని కంపెనీలు మంచిగానే పనిచేస్తున్నందున ఈ విషయంలో సూక్ష్మ పరిశీలన అవసరమన్నారు. ఇది వ్యవస్థాపరమైన అంశంగా మారుతుందని తాను భావించడం లేదని, ఇబ్బందులను అధిగమించేందుకు వ్యవస్థకు సమయం పడుతుందన్నారు. కొన్ని కంపెనీలకు త్వరితంగా ఈక్విటీ నిధుల అవసరం ఉందని పేర్కొన్నారు. బ్యాంకు సొంతంగా రుణాల జారీకే ప్రాధాన్యమిస్తుందని, అదే సమయంలో ఎన్బీఎఫ్సీ పోర్ట్‌ఫోలియో కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తుందని చెప్పారు. -
‘అతనికి ఈ-మెయిల్స్ రాయడమే పని’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిపాలన కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్‌పై బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు అమితాబ్ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. జస్టిస్ లోధా సూచించిన సిఫారసులను అమలు చేయడంలో వినోద్ రాయ్ పూర్తిగా విఫలమయ్యాడని అమితాబ్ విమర్శించారు. చాలాకాలంగా అమితాబ్‌తో పాటు కోశాధికారి అనిరుధ్ చౌదురిని పక్కనబెట్టిన సీఓఏ కీలక అంశాలను వీళ్లతో చర్చించడం లేదు. అదే సమయంలో వీరిని తొలగించాలని సుప్రీంకోర్టుకు రాయ్ విజ్ఞప్తి చేయడం కూడా అమితాబ్ చౌదరికి ఆగ్రహం తెప్పించింది.. ఈ నేపథ్యంలో రాయ్ తీసుకున్న నిర్ణయాలపై అమితాబ్ చౌదరి బహిరంగంగా విమర్శలు చేసేందుకు పూనుకున్నాడు. ‘రాయ్ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చా. దురదృష్టమేమిటంటే ఏడాదిన్నరగా అతను ఈ మెయిల్స్ రాయడానికే పరిమితమయ్యాడు. అంతకుమించి అతను సాధించిందేమీ లేదు. సిఫారసులు అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా వాటిని ఇంతవరకు అమలు చేయలేకపోయాడు. లోధా సిఫారుసులు అమలు విషయంలో రాయ్ బృందం పూర్తిగా విఫలమైంది. ఆఫీస్ బేర్లర్లను తొలిగించడానికి రాయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అతని వైఫల్యాన్ని మేం ప్రశ్నిస్తామనే భయం మొదలైంది. నియామకాలు జరపడంలో రాయ్ బిజీగా ఉన్నారు. ఇక మిగతా విషయాలేమి పట్టించుకుంటారు’ అని అమితాబ్ చౌదరి విమర్శించారు. బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించేందుకు అవసరమైన తుది తీర్పును వెల్లడించడంలో సుప్రీంకోర్టు కాలాయపన చేస్తుందని ఇటీవల రాయ్ చేసిన విమర్శలపై కూడా అమితాబ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అత్యున్నత న్యాయస్థానం గురించి రాయ్ అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వంలో పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ధ్వజమెత్తారు.