పేటీఎంలోకి రూ.9,079 కోట్లు
♦ జపాన్ సాఫ్ట్‌బ్యాంకు నుంచి సమీకరణ
♦ పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలకు ఊతం
♦ 50 కోట్ల కస్టమర్ల లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ చెల్లింపులు, ఈ కామర్స్ సంస్థ పేటీఎం, పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాల ఆరంభంతో దేశీయ మార్కెట్లో తన దూకుడును మరింత పెంచనుంది. ఈ సంస్థ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు నుంచి తాజాగా 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9.079 కోట్లు) సమీకరించింది. ఈ నెల 23 నుంచి పేమెంట్స్ బ్యాంకు సేవలను ప్రారంభించనున్న ఈ సంస్థ తన కార్యకలాపాల విస్తృతికి తాజా నిధులు తోడ్పడనున్నాయి. దేశీయంగా ఓ స్టార్టప్‌లో పెట్టిన భారీ పెట్టుబడుల మొత్తం ఇది. డిజిటల్ సేవల విస్తృతిని ప్రోత్సహించాలన్న భారత ప్రభుత్వం విధానానికి అనుగుణంగా... కోట్లాది మంది వినియోగదారులు, విక్రయదారులకు డిజిటల్ అనుసంధానాన్ని కల్పించడం ద్వారా మొబైల్ చెల్లింపులు సహా ఆర్థిక సేవల విస్తృతికి కట్టుబడి ఉన్నామని సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు చైర్మన్, సీఈవో మసయోషిసన్ పేర్కొన్నారు.
ఇందులో భాగంగా పేటీఎంకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. దేశీయంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్న ప్రణాళికతో ఉన్న సాఫ్ట్‌బ్యాంకు స్నాప్‌డీల్, ఓలా, హౌసింగ్ డాట్ కామ్ తదితర కంపెనీల్లో 2 బిలియన్ డాలర్లను ఇప్పటి వరకూ ఇన్వెస్ట్ చేసింది. వీటిలో అధిక భాగం చేదు ఫలితాలనే మిగిల్చాయి. వీటిలో గణనీయమైన పెట్టుబడులను నష్టాల కింద కోల్పోవడం గమనార్హం. తీవ్ర నష్టాల్లో ఉన్న స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్టులో విలీనం చేసే ప్రయత్నాల్లోనూ ఉన్న విషయం తెలిసిందే. అయితే, చైనాలో అలీబాబా గ్రూపు ఆర్థిక సేవల విషయంలో సాధించిన గొప్ప విజయం తరహాలోనే పేటీఎం కార్యకలాపాలూ ఉండడంతో ఈ సంస్థపై సాఫ్ట్‌బ్యాంకు ఎక్కువ అంచనాలను పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పేటీఎం చైనా చిప్ మేకర్ మీడియాటెక్ నుంచి 6 కోట్ల డాలర్ల(రూ.380కోట్లు)ను గతేడాది సమీకరించింది.
మూడేళ్లలో రూ.10,000 కోట్లు...
సాఫ్ట్‌బ్యాంకు తాజా పెట్టుబడులు తమ బృందం (పేటీఎం) నిర్వహణ, విధానానికి లభించిన గొప్ప ఆమోదనీయంగా పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ అభివర్ణించారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 50 కోట్ల మంది భారతీయులను ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు రూ.10,000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు పేటీఎం విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొంది. దీన్నిబట్టి ఆర్థిక సేవలు అంతగా అందుబాటులో లేని కస్టమర్లను భారీగా చేరుకునే వ్యూహాలతో పేటీఎం ఉన్నట్టు తెలుస్తోంది.
అలాగే, వెల్త్ మేనేజ్‌మెంట్, డిపాజిట్ల సేకరణ, రుణాల జారీ తదితర సేవలు అందించే ప్రణాళికలతోనూ ఉంది. పేమెంట్స్ బ్యాంకులు సొంతంగా రుణాలు ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించడం లేదు. అయితే, పేటీఎం ఐసీఐసీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, క్యాపిటల్ ఫస్ట్ తదితర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తన వేదికగా కస్టమర్లకు ఆయా సంస్థలతో రుణాలు అందించే యోచనలో ఉంది. పేటీఎం వ్యాలెట్‌కు ప్రస్తుతం 22 కోట్ల మం ది కస్టమర్లు ఉన్నారు. పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాల నేపథ్యంలో ఈ కామర్స్ కార్యకలాపాల కోసం పేటీఎం ఇటీవలే పేటీఎంమాల్ పేరుతో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది.