15 ఏళ్ల పాత కేసులు వెనక్కి
♦ రూ.5 లక్షలలోపు ఎక్సైజ్ ఎగవేత
♦ కేసులపై సీబీఈసీ కీలక నిర్ణయం
♦ పన్ను వివాదాల తగ్గింపు దిశలో అడుగు
న్యూఢిల్లీ: పన్ను వివాదాల సత్వర పరిష్కారం దిశలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల క్రితం నుంచీ అపరిష్కృతంగా ఉన్న రూ. 5 లక్షల లోపు సెంట్రల్ ఎక్సైజ్ ఎగవేత కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కేసులను ప్రాసిక్యూషన్ నుంచి ఉపసంహరించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తగిన స్థాయి అధికారి హైకోర్డులో పిటిషన్ దాఖలు చేయడానికి వీలు కల్పిస్తూ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఈసీ) ఒక ప్రకటనలో తెలిపింది. పన్ను వివాదాలను తగ్గించుకోవాలన్న ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్లు, చీఫ్ కమిషనర్లకు పంపిన ఉత్తర్వుల్లో సీబీఈసీ పేర్కొంది.
కారణాలు చూస్తే...
♦ చివరకు కేసులు తేలే విషయం ఎలా ఉన్నా... అంతకుమించి ఆయా కేసుల విషయంలో ప్రాసిక్యూషన్‌కు వ్యయాలు భారంగా ఉండడం సీబీఈసీ నిర్ణయానికి ఒక కారణం.
♦ దీనితోపాటు ఈ కేసులను పరిశీలిస్తున్న అధికారులను ఖజానాకు ఆదాయం తెచ్చే ఇతర బాధ్యతల్లోకి మళ్లిస్తే... తక్షణం కొంత ఫలితం ఉంటుందన్న అభిప్రాయం కూడా కారణమే.
♦ ఇలాంటి సుదీర్ఘ అపరిష్కృత కేసుల ఉపసంహరణ... తయారీ రంగానికి ఒక సానుకూల సంకేతం పంపుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ ప్రతిష్టాత్మక మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయానికి దోహదపడే వీలుందన్నది ఒక విశ్లేషణ.
♦ సెంట్రల్ ఎక్సైజ్‌లో ప్రాసిక్యూషన్, అరెస్ట్‌కు ప్రస్తుత పరిమితి కోటి రూపాయలు.
నల్లధనానికి ఆభరణాల రంగమూ కారణమే: సీబీఈసీ చైర్మన్
న్యూఢిల్లీ: నల్లధనం సమస్యకు ఆభరణాల రంగమూ కారణమేనని కేంద్రీయ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) చైర్మన్ నజీబ్ షా వ్యాఖ్యానించారు. జ్యుయలరీ రంగంపై రెండేళ్ల క్రితమే ఎక్సైజ్ సుంకం విధించినా ఆ తర్వాత ఉపసంహరించామని, దాన్నే తాజాగా మళ్లీ విధించడం జరిగిందన్నారు. పన్ను పరిధిలో ఉండాల్సిన రంగాల్లో ఇది కూడా ఒకటని అంతా కచ్చితంగా ఏకీభవిస్తారని షా చెప్పారు.