ఆఫ్రికాలో సీసీఎల్ ప్లాంట్ | CCL Plant in Africa | Sakshi
Sakshi News home page

ఆఫ్రికాలో సీసీఎల్ ప్లాంట్

Published Wed, Oct 29 2014 4:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

ఆఫ్రికాలో సీసీఎల్ ప్లాంట్

ఆఫ్రికాలో సీసీఎల్ ప్లాంట్

2014-15లో రూ.900 కోట్లకు టర్నోవర్
సీసీఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేంద్రప్రసాద్

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌స్టంట్ కాఫీ తయారీ సంస్థ సీసీఎల్ ప్రొడక్ట్స్ ఆఫ్రికాలో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో ఏటా 1,000 టన్నుల ఇన్‌స్టంట్ కాఫీని కంపెనీ విక్రయిస్తోంది. 2 వేల టన్నులకు అమ్మకాలు చేరితే ప్లాంటు నెలకొల్పుతామని సీసీఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇందుకు రెండు మూడేళ్లు పట్టొచ్చని అన్నారు.

ఇక అమెరికాలో ప్యాకేజింగ్ యూనిట్ స్థాపిస్తామని చెప్పారు. వియత్నాం ప్లాంటు వార్షిక సామర్థ్యం 10 వేల టన్నులు. రెండేళ్లలో రెండింతలు చేస్తామన్నారు. భారత్‌లో విస్తరిస్తున్నామని, ఎఫ్‌ఎంసీజీ రంగ సంస్థలతో చర్చిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ లేబుల్‌లో 70కిపైగా రకాల కాఫీని 100కు పైగా దేశాల్లో కంపెనీ విక్రయిస్తోంది. గుంటూరు జిల్లా దుగ్గిరాలతోపాటు వియత్నాం, స్విట్జర్లాండ్‌లో ప్లాంట్లున్నాయి.  కాఫీ బోర్డు మాజీ చైర ్మన్ జీవీ కృష్ణారావును అదనపు డెరైక్టర్‌గా సీసీఎల్ బోర్డు నియమించింది.
 
30 శాతంపైగా వృద్ధి..
సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో సీసీఎల్ ప్రొడక్ట్స్ రూ.247 కోట్ల టర్నోవర్‌పై రూ.26 కోట్ల నికర లాభం ఆర్జించింది. 9 వేల టన్నుల ఎగుమతులతో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో రూ.423 కోట్ల టర్నోవర్‌పై రూ.46 కోట్ల నికర లాభం పొందింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30 శాతంపైగా వృద్ధితో 2014-15లో రూ.900 కోట్ల టర్నోవర్ దాటతామని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

దేశీయ మార్కెట్లో సొంత బ్రాండ్, ప్రైవేట్ లేబుల్ విక్రయాల ద్వారా ఈ ఏడాది రూ.60 కోట్లు, 2015-16లో రూ.100 కోట్లు అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. కాఫీ బోర్డు సభ్యుడు కూడా అయిన రాజేంద్రప్రసాద్ విశాఖ మన్యం కాఫీ గురించి మాట్లాడుతూ.. ఏజెన్సీలో కాఫీ ఉత్పత్తిని పెంచాలని బోర్డుతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. డిసెంబర్‌లో కాఫీ బోర్డు సమావేశం వైజాగ్‌లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 2014-15లో భారత్‌లో 3.3 లక్షల టన్నుల కాఫీ ఉత్పత్తి నమోదు కావొచ్చని బోర్డు అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement