Instant coffee
-
మళ్లీ అరకు ఇన్స్టెంట్ కాఫీ రెడీ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ కాఫీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న అరకు కాఫీ నుంచి ఇన్స్టెంట్ సాచెట్స్ మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్ల విరామం అనంతరం ఇన్స్టెంట్ కాఫీ సాచెట్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సర్వం సిద్ధంచేసింది. ఇప్పటికే 40 టన్నుల కాఫీ పండ్లు సేకరించి ప్రాసెసింగ్‌కు అప్పగించింది. సంక్రాంతి పండుగకు ఘుమఘుమలాడే అరకు ఇన్స్టెంట్ కాఫీ తాగేలా మార్కెట్లోకి తీసుకురానుంది. అరకు ఇన్స్టెంట్ కాఫీని 2018లో మార్కెట్లోకి తీసుకొచ్చిన జీసీసీ లాభాలబాటలో పయనించింది. మార్కెట్లోకి వచ్చిన కొద్ది నెలల్లో బ్రాండ్‌గా దూసుకెళ్లిన అరకు కాఫీకి మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఇన్స్టెంట్ కాఫీ ప్రక్రియ చేపట్టే బెంగళూరుకు చెందిన వాహన్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు డబ్బులు చెల్లించకపోవడం, అధికారులతో విభేదాలు, కోవిడ్ కారణంగా 2019 మొదట్లోనే సరఫరాకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఇన్స్టెంట్ కాఫీ ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగా జీసీసీ ఎండీగా సురేష్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సదరు సంస్థతో పలుమార్లు చర్చలు జరిపారు. వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడంతో తిరిగి ఇన్స్టెంట్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. తొలివిడతగా 40 టన్నుల సేకరణ రెండు రోజుల్లో ఇన్స్టెంట్ కాఫీ ప్రక్రియ ప్రారంభించేందుకు జీసీసీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే గిరిజనుల నుంచి పదిశాతం కన్నా తక్కువ తేమ ఉన్న నాణ్యమైన 40 టన్నుల కాఫీ పండ్లను సేకరించింది. దీనివల్ల మంచి రుచితోపాటు సువాసన కూడా కాఫీకి తోడవుతుంది. ఈ పండ్లని రోస్టింగ్, ఇతర ప్రక్రియలతో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్‌గా మార్చనున్నారు. 2 గ్రాములు, 10 గ్రాముల ప్యాకెట్లతోపాటు 50, 100 గ్రాముల టిన్స్ కూడా మార్కెట్లోకి తీసుకురావాలని జీసీసీ ఏర్పాట్లు చేసింది. రూ.3, రూ.12 చొప్పున సాచెట్స్ అమ్మకపు ధరలుగా నిర్ణయించింది. తొలివిడతగా గిరిజనుల నుంచి సేకరించిన 40 టన్నులతో ఇన్స్టెంట్ కాఫీ పొడిని మార్కెట్లోకి తీసుకురానుంది. ఎప్పటికప్పుడు తాజాగా అందిస్తాం ఎప్పటికప్పుడు నాణ్యమైన ఇన్స్టెంట్ కాఫీని వినియోగదారులకు అందించేందుకు సిద్ధమయ్యాం. రెండు రోజుల్లో ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. జనవరి 10 తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త ఇన్స్టెంట్ కాఫీ సాచెట్స్ వచ్చేలా తయారీ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించాం. మిగిలిన కంపెనీ బ్రాండ్ల సాచెట్స్‌లో చూపించే పరిమాణం కంటే తక్కువ కాఫీ పొడి ఉంటుంది. కానీ, అరకు ఇన్స్టెంట్ కాఫీ సాచెట్స్ మాత్రం ఎంత పరిమాణం చెప్పామో.. అంతే ఉండేలా కచ్చితత్వంతో అందిస్తాం. గిరిజనులకు లాభాలను అందించేలా జీసీసీ ప్రతి నిర్ణయం తీసుకుంటోంది. జి.సురేష్‌కుమార్, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ -
చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇన్స్టాంట్ కాఫీ రంగంలో ఆయన చేసిన కృషికిగాను ఇంటర్నేషనల్ ఇన్స్టాంట్ కాఫీ ఆర్గనైజేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వరించింది. ఇటీవల జర్మనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. 1,500 టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్రారంభమైన సీసీఎల్ ప్రస్థానం నేడు 35,000 టన్నుల స్థాయికి చేరింది. 90కి పైగా దేశాల్లోని క్లయింట్లకు కంపెనీ కాఫీ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. -
సెకనుకు 1,000 కప్పుల కాఫీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ లేబుల్ ఇన్స్టాంట్ కాఫీ తయారీలో ఉన్న ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ భారత్‌పై ఫోకస్ చేసింది. దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇన్స్టాంట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, కాఫీ ప్రీమిక్స్ శ్రేణిలో నూతన ఉత్పాదనలను విడుదల చేసింది. రూ.1తో మొదలుకుని విభిన్న ప్యాక్‌లలో వీటిని ప్రవేశపెట్టింది. దక్షిణాదిన పెద్ద ఎత్తున విస్తరించిన తర్వాత 2021 నాటికి దేశవ్యాప్తంగా అడుగుపెడతామని సీసీఎల్ ప్రొడక్టŠస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘భారత్‌లో కాఫీ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 75%. కంపెనీ సొంత బ్రాండ్.. కాంటినెంటల్ కాఫీ ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. సంస్థ ఆదాయంలో భారత్ వాటా 7 శాతమే. రెండేళ్లలో దీనిని రెండింతలకు తీసుకువెళతాం’ అని వివరించారు. సినీ నటి నిత్యా మీనన్‌ను కాంటినెంటల్ కాఫీ బ్రాండ్ ప్రచారకర్తగా నియమించారు. నూతన ఉత్పత్తులతో మోహన్ కృష్ణ, శ్రీశాంత్, రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్ (ఎడమ నుంచి కుడికి). కాఫీ రుచులు 1,000కి పైమాటే.. సీసీఎల్ ప్రస్తుతం 90 దేశాల్లోని కంపెనీలకు 250కిపైగా బ్రాండ్లలో ప్రాసెస్డ్ కాఫీని సరఫరా చేస్తోంది. రెండు మూడేళ్లలో మరో 10 దేశాల్లో అడుగు పెట్టడం ద్వారా 100 మార్కును దాటాలన్నది లక్ష్యమని కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్ తెలిపారు. 1,000కిపైగా రుచుల్లో కాఫీని తయారు చేయగల సామర్థ్యం సంస్థకు ఉందన్నారు. సీసీఎల్ తయారు చేసిన కాఫీతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 1,000 కప్పుల కాఫీ వినియోగం అవుతోందని చెప్పారు. దశాబ్దాలపాటు సంస్థకు ఉన్న అనుభవం, ప్రపంచ కాఫీ రంగంలో సాధించిన విజయంతో ఇక భారత వినియోగదార్లకు చేరువ అవుతామని సంస్థ డైరెక్టర్ బి.మోహన్ కృష్ణ తెలిపారు. పోటీ కంపెనీల కంటే దీటుగా ఉత్పత్తులను తయారు చేశామన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి నెల ఒక లక్ష కప్పుల కాఫీని కస్టమర్లకు ఉచితంగా అందించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 50,000 ఔట్లెట్లకు చేరువయ్యామని, డిసెంబరుకల్లా ఒక లక్ష స్టోర్లలో కాంటినెంటల్ కాఫీ లభ్యమవుతుందని ఆయన వివరించారు. రూ.140 కోట్ల పెట్టుబడి..: కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 35,000 టన్నులు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాలతోపాటు స్విట్జర్లాండ్, వియత్నాంలో ప్లాంట్లున్నాయి. చిత్తూరు జిల్లాలోని సెజ్‌లో నెలకొల్పిన ప్లాంటులో ఇటీవలే ఉత్పత్తి ప్రారంభమైంది. సెజ్ కోసం రూ.350 కోట్లు వెచ్చించినట్టు సీసీఎల్ సీఈవో ప్రవీణ్ జైపూరియార్ వెల్లడించారు. వియత్నాం ప్లాంటు సామర్థ్యం పెంపు, చిత్తూరు కేంద్రంలో ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక టర్నోవరులో ఏటా 15–20% వృద్ధి ఆశిస్తున్నట్టు సీసీఎల్ సీవోవో కేవీఎల్ఎన్ శర్మ తెలిపారు. సీసీఎల్‌కు భారత్‌లో 1,000, విదేశాల్లో 250 మంది ఉద్యోగులున్నారని చెప్పారు. -
అయిదేళ్లలో రూ.1,500 కోట్ల టర్నోవర్
►ఆగస్టుకల్లా చిత్తూరు ప్లాంటు సిద్ధం ►ఇక దేశవ్యాప్తంగా కాంటినెంటల్ కాఫీ ►సీసీఎల్ ఫౌండర్ చల్లా రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ కాఫీ ఉత్పత్తిలో ప్రైవేట్ లేబుల్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న సీసీఎల్ ప్రొడక్ట్స్ 2022 నాటికి రూ.1,500 కోట్లకుపైగా టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2016–17లో కంపెనీ రూ.984 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లు దాటుతామని సీసీఎల్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు చల్లా రాజేంద్ర ప్రసాద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సొంత బ్రాండ్ అయిన కాంటినెంటల్ కాఫీ ఉత్పత్తుల విక్రయం ద్వారా భారత్‌లో అయిదేళ్లలో రూ.100 కోట్లు ఆర్జించాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు. దేశీయ మార్కెట్ నుంచి ఆదాయం ప్రస్తుతం 5 శాతం ఉందని వివరించారు. ఇప్పటికే ప్రముఖ ఔట్లెట్లలో కాంటినెంటల్ కాఫీ విక్రయిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని దుకాణాల ద్వారా మార్కెట్ చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సామర్థ్యం 50,000 టన్నులకు..: సీసీఎల్‌కు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంటు ఉంది. వియత్నాం ప్లాంటు సామర్థ్యం 10,000 టన్నులు. స్విట్జర్లాండు ప్లాంటులో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. రెండు మూడేళ్లలో వియత్నాం ప్లాంటు కెపాసిటీని రెట్టింపు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. యూనిట్లన్నీ పూర్తి స్థాయిలో నడుస్తుండడంతో కంపెనీ విస్తరణ చేపట్టింది. చిత్తూరు జిల్లాలో నెలకొల్పుతున్న అత్యాధునిక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు 2018 ఆగస్టు నాటికి మొదలు కానున్నాయి. ఈ కేంద్రం వార్షిక సామర్థ్యం 5,000 టన్నులు. దీనికోసం కంపెనీ రూ.325 కోట్ల దాకా పెట్టుబడి పెడుతోంది. 50 శాతం బ్యాంకు రుణం ద్వారా, మిగిలిన 50 శాతం అంతర్గత వనరుల ద్వారా సమకూరుస్తోంది. 2022 కల్లా సీసీఎల్ తయారీ సామర్థ్యాన్ని 50,000 టన్నులకు చేరుస్తామని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇందుకు మరో ప్లాంటు అవసరమవుతుందని చెప్పారు. ఉత్తర అమెరికాపై ఆశలు.. సీసీఎల్ ప్రస్తుతం 20 రకాల కాఫీ రుచులను తయారు చేస్తోంది. వీటిని సొంత బ్రాండ్‌తోపాటు 50 కంపెనీలకు 200లకుపైగా బ్రాండ్లలో సరఫరా చేస్తోంది. 80 కంటే ఎక్కువ దేశాల్లో ఇవి అమ్ముడవుతున్నాయి. ఆదాయంలో యూరప్ నుంచి 30 శాతం, జపాన్, ఆస్ట్రేలియా 30 శాతం, సీఐఎస్ దేశాల నుంచి 20 శాతం సమకూరుతోంది. ‘ఉత్తర అమెరికా వాటా ఇప్పుడు 4 శాతం మాత్రమే ఉంది. రానున్న రోజుల్లో చవక కాఫీ దిగుమతులకు యూఎస్ చెక్ పెట్టనుంది. ఈ చర్య సీసీఎల్‌కు కలిసి వస్తుంది. దీంతో వచ్చే అయిదేళ్లలో ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి 20 శాతం టర్నోవర్ ఆశిస్తున్నాం. గ్రీన్ కాఫీ ధర ఆధారంగానే ఉత్పత్తుల ధర నిర్ణయిస్తున్నాం. దీనికి తగ్గట్టుగా కొనుగోలుదార్లతో ఒప్పందాలు ఉంటాయి. ముడి సరుకు ధర ఒడిదుడుకులకు లోనైనా సీసీఎల్‌పై ప్రభావం చూపదు’ అని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. -
కొత్తగా అరకు ఇన్స్టెంట్ కాఫీ
♦ రూ.5 ప్యాక్‌లో అందుబాటులోకి ♦ బ్లెండెడ్ కాఫీ కూడా.. ♦ మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాల్లో జీసీసీ సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ కాఫీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న అరకు కాఫీ మరో అడుగు ముందుకేస్తోంది. ఇకపై ఇన్స్టెంట్ కాఫీగానూ మార్కెట్లోకి రాబోతోంది. తొలిదశలో రూ.5 సాచెట్లలో అందుబాటులోకి తీసుకురావడానికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం బెంగళూరులో ఉన్న ఓ తయారీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రయోగాత్మకంగా ఈ ఏడాది కనీసం మూడు టన్నుల కాఫీ గింజలను పొడి చేసి ఇన్స్టెంట్ కాఫీ సాచెట్లుగా తయారు చేయించాలని చూస్తోంది. ఇప్పటిదాకా బ్రూ, నెస్లే, సీసీఎల్ వంటి సంస్థలే ఇన్స్టెంట్ కాఫీని మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఇకపై అరకు ఇన్స్టెంట్ కాఫీ కూడా రంగప్రవేశం చేయనుంది. జీసీసీ ఈ ఏడాది ఆఖరుకల్లా ఈ అరకు ఇన్స్టెంట్ కాఫీని మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ‘ఇప్పటికే అరకు కాఫీకి ఆదరణ బాగుండడంతో వినియోగదార్లు ఇన్స్టెంట్ కాఫీని కూడా అడుగుతున్నారు. వీరి అభిరుచికి అనుగుణంగా ఇన్స్టెంట్ కాఫీని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాం. ఇది కూడా మాకు లాభదాయకంగా ఉంటుంది.. ఆదరణ బాగుంటుందని భావిస్తున్నాం’ అని జీసీసీ ఎండీ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు. వైశాఖి బ్లెండెడ్ కాఫీ: జీసీసీ వైశాఖి బ్లెండెడ్ కాఫీ పేరిట మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాత కాఫీ ఎక్స్పర్ట్ సోనాలినీ మీనన్ సహకారం తీసుకుంటోంది. ఈ బ్లెండెడ్ కాఫీకి ఓ ప్రత్యేకత ఉంది. విశాఖ ఏజెన్సీలో ఏడు మండలాల్లో కాఫీ పంట సాగవుతోంది. ఒక్కో ప్రాంతంలో నేల స్వభావాన్ని బట్టి కాఫీ రుచి మారుతుంది. దీన్ని గుర్తించిన జీసీసీ ఇకపై ఆయా ప్రాంతాల పేరిట వివిధ రుచుల (ఫ్లేవర్స్)తో వేర్వేరుగా కాఫీ ప్రియులకు పరిచయం చేయనుంది. ఉదాహరణకు చింతపల్లి, పాడేరు మండలాల్లో పండిన కాఫీని వైశాఖి బ్లెండెడ్ కాఫీగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. దేశంలో మరే సంస్థ ఇప్పటిదాకా స్థానిక రుచులు (లోకల్ ఫ్లేవర్స్)తో మార్కెట్లోకి తీసుకురాలేదని జీసీసీ ఎండీ రవిప్రకాష్ చెప్పారు. -
సీసీఎల్ ప్రొడక్ట్స్ లాభం రూ.26 కోట్లు
లాభం రూ.26 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ కాఫీ తయారీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.213 కోట్ల టర్నోవర్‌పై రూ.26 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.241 కోట్ల టర్నోవర్‌పై రూ.26 కోట్ల నికర లాభం పొందింది. డిసెంబరుతో ముగిసిన 9 నెలల కాలంలో రూ.668 కోట్ల టర్నోవర్‌పై రూ.85 కోట్ల నికర లాభం నమోదు చేసింది. 2013-14, 2014-15కుగాను కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ ఇన్స్టాంట్ కాఫీతోపాటు యూఎస్ఏ, కెనడా, రష్యా, సీఐఎస్, తూర్పు దేశాలకు ఉత్తమ ఎగుమతిదారుగా అవార్డులను అందుకున్నట్టు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. -
ఆఫ్రికాలో సీసీఎల్ ప్లాంట్
2014-15లో రూ.900 కోట్లకు టర్నోవర్ సీసీఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ తయారీ సంస్థ సీసీఎల్ ప్రొడక్ట్స్ ఆఫ్రికాలో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో ఏటా 1,000 టన్నుల ఇన్స్టంట్ కాఫీని కంపెనీ విక్రయిస్తోంది. 2 వేల టన్నులకు అమ్మకాలు చేరితే ప్లాంటు నెలకొల్పుతామని సీసీఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇందుకు రెండు మూడేళ్లు పట్టొచ్చని అన్నారు. ఇక అమెరికాలో ప్యాకేజింగ్ యూనిట్ స్థాపిస్తామని చెప్పారు. వియత్నాం ప్లాంటు వార్షిక సామర్థ్యం 10 వేల టన్నులు. రెండేళ్లలో రెండింతలు చేస్తామన్నారు. భారత్‌లో విస్తరిస్తున్నామని, ఎఫ్ఎంసీజీ రంగ సంస్థలతో చర్చిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ లేబుల్‌లో 70కిపైగా రకాల కాఫీని 100కు పైగా దేశాల్లో కంపెనీ విక్రయిస్తోంది. గుంటూరు జిల్లా దుగ్గిరాలతోపాటు వియత్నాం, స్విట్జర్లాండ్‌లో ప్లాంట్లున్నాయి. కాఫీ బోర్డు మాజీ చైర ్మన్ జీవీ కృష్ణారావును అదనపు డెరైక్టర్‌గా సీసీఎల్ బోర్డు నియమించింది. 30 శాతంపైగా వృద్ధి.. సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో సీసీఎల్ ప్రొడక్ట్స్ రూ.247 కోట్ల టర్నోవర్‌పై రూ.26 కోట్ల నికర లాభం ఆర్జించింది. 9 వేల టన్నుల ఎగుమతులతో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో రూ.423 కోట్ల టర్నోవర్‌పై రూ.46 కోట్ల నికర లాభం పొందింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30 శాతంపైగా వృద్ధితో 2014-15లో రూ.900 కోట్ల టర్నోవర్ దాటతామని రాజేంద్రప్రసాద్ తెలిపారు. దేశీయ మార్కెట్లో సొంత బ్రాండ్, ప్రైవేట్ లేబుల్ విక్రయాల ద్వారా ఈ ఏడాది రూ.60 కోట్లు, 2015-16లో రూ.100 కోట్లు అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. కాఫీ బోర్డు సభ్యుడు కూడా అయిన రాజేంద్రప్రసాద్ విశాఖ మన్యం కాఫీ గురించి మాట్లాడుతూ.. ఏజెన్సీలో కాఫీ ఉత్పత్తిని పెంచాలని బోర్డుతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. డిసెంబర్లో కాఫీ బోర్డు సమావేశం వైజాగ్‌లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 2014-15లో భారత్‌లో 3.3 లక్షల టన్నుల కాఫీ ఉత్పత్తి నమోదు కావొచ్చని బోర్డు అంచనా. -
తెలుగు నేలపై...కాఫీ ఘుమఘుమలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాఫీ అనగానే మన దేశంలో తొలుత గుర్తొచ్చేది కర్ణాటక. ఇంతటి పేరు ప్రఖ్యాతులు మనమూ సాధించొచ్చు. అంతలా అవకాశాలు తెలుగు నేల పైనా ఉన్నాయని అం టున్నారు భారత కాఫీ బోర్డు సభ్యులు, సీసీఎల్ ప్రొడక్ట్స్(కాంటినెంటల్ కాఫీ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్. ప్రైవేటు లేబుల్ విభాగంలో ఇన్స్టంట్ కాఫీ విక్రయాల్లో సీసీఎల్‌ను ప్రపంచంలో తొలి స్థానంలో నిలబెట్టిన ఘనత ఆయనకే సొంతం. కాఫీ బోర్డు సభ్యుడిగా ఆరోసారి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో అవకాశాలు, కాఫీ రంగంలో వ్యాపారాంశాలను సాక్షి బిజినెస్ బ్యూరోతో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. అనువైన ప్రాంతం.. కాఫీ పండించేందుకు విశాఖపట్నం ఏజెన్సీలో మరో లక్ష హెక్టార్లకుపైగా అనువైన స్థలం ఉంది. నీడపడే ప్రాంతంలో పండడంతో ఇక్కడి కాఫీ చాలా రుచికరమైంది. రైతులు ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నారు. కాఫీ బోర్డు లెక్కల ప్రకారం భారత్‌లో తొలి స్థానంలో ఉన్న కర్నాటకలో కాఫీ పంట 2013-14లో 2.27 లక్షల టన్నులుండొచ్చని అంచనా. ఇందులో ఎంత కాదన్నా 50-60 శాతం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పండించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వ్యాపార అవకాశాలను కొత్త ప్రభుత్వానికి తెలియజేస్తాను. కాఫీ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తాను. ప్రస్తుతం 58,131 హెక్టార్లలో కాఫీ తోటలు ఈ ప్రాంతంలో విస్తరించాయి. 7 వేల టన్నుల కాఫీ మాత్రమే పండుతోంది. కాఫీ మొక్కల మధ్య ఏలకులు, మిరియాల వంటివీ సాగు చేయవచ్చు. ఔత్సాహికులను ప్రోత్సహించాలి.. కాఫీ పండించేందుకు ముందుకు వచ్చేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. పూర్తిగా లీజు పద్దతిన ఒక్కొక్కరికి కనీసం 25 ఎకరాలు కేటాయించాలి. ఇందుకోసం ప్రభుత్వం ఓపెన్ ఆఫర్‌ను పత్రికా ముఖంగా ప్రకటించాలి. సహకార సేద్యమూ చేయవచ్చు. కొలంబియాలో రైతు సమాఖ్య సాగు చేపట్టినా నియంత్రణ పూర్తిగా అక్కడి ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అదే విధానాన్ని ఇక్కడా అమలు చేయవచ్చు. ఇక కాఫీ పండించేందుకు చెట్లను తొలగించాల్సిన అవసరమే లేదు. కాబట్టి అటవీ సంపదకు వచ్చే నష్టమేమీ లేదు. కాఫీ అనేది తోటల కిందకు వస్తుంది. స్థల కేటాయింపులో గరిష్ట నిబంధన వర్తించదు. రాష్ట్రంలో గిరిజనులు మాత్రమే కాఫీ పండించాలన్న ప్రచారం ఉంది. ఇందులో నిజం లేదు. ఎవరైనా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఏదైనా సాధ్యం చేస్తారు.. తెలుగు రైతులకు ఏదైనా సాధ్యమే. పత్తి, మిర్చి, పసుపు ఇలా చాలా పంటల్లో మనవారు సత్తా చాటారు. కాఫీ విషయంలోనూ కొత్త రికార్డులను నమోదు చేస్తారు. కావాల్సిందల్లా ప్రభుత్వ సహకారమే. స్థలం కేటాయిస్తే చాలు. ఇక కాఫీ ధర అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి ఉంటుంది. ధర విషయంలో మోసానికి తావు లేదు. అర్ధరాత్రి అయినా సరుకు అమ్ముడుపోతుంది. మార్కెటింగ్ అంటారా సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎలాగూ ఉంది. పంటను మేమే కొనుగోలు చేస్తాం. సాంకేతిక సహకారం కాఫీ బోర్డు ఇస్తుంది. బ్యాంకు నుంచి రుణం సులువుగా వస్తుంది. సాధారణంగా మూడేళ్లలో పంట చేతికొస్తుంది. ఏ ప్రాంతంలో చూసినా కాఫీ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నవారే. ఆదాయంతోపాటు ఉపాధి.. లక్ష హెక్టార్లంటే ఎంత కాదన్నా అయిదు లక్షల మందికిపైగా కొత్తగా ఉపాధి లభిస్తుంది. రైతు కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ప్రభుత్వానికి దీర్ఘకాలంలో కాఫీ ఎగుమతుల ఆదాయం సమకూరుతుంది. కాఫీ ఉత్పత్తి విషయంలో వియత్నాం 20 ఏళ్ల క్రితం ఏమీ లేదు. నేడు ప్రపంచంలో రెండో స్థానానికి ఎగబాకింది. భారత్‌లో 2012-13లో 3.18 లక్షల టన్నుల కాఫీ పండింది. 2013-14లో ఇది 3.47 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. 10 లక్షల టన్నులు పండించ గలిగేంతగా అవకాశాలున్నాయి. ఏజెన్సీలో కాఫీ విస్తరించాలంటే ప్రభుత్వమే చొరవ చూపాలి.