తెలుగు నేలపై...కాఫీ ఘుమఘుమలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాఫీ అనగానే మన దేశంలో తొలుత గుర్తొచ్చేది కర్ణాటక. ఇంతటి పేరు ప్రఖ్యాతులు మనమూ సాధించొచ్చు. అంతలా అవకాశాలు తెలుగు నేల పైనా ఉన్నాయని అం టున్నారు భారత కాఫీ బోర్డు సభ్యులు, సీసీఎల్ ప్రొడక్ట్స్(కాంటినెంటల్ కాఫీ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్. ప్రైవేటు లేబుల్ విభాగంలో ఇన్‌స్టంట్ కాఫీ విక్రయాల్లో సీసీఎల్‌ను ప్రపంచంలో తొలి స్థానంలో నిలబెట్టిన ఘనత ఆయనకే సొంతం. కాఫీ బోర్డు సభ్యుడిగా ఆరోసారి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో అవకాశాలు, కాఫీ రంగంలో వ్యాపారాంశాలను సాక్షి బిజినెస్ బ్యూరోతో పంచుకున్నారు.
అవి ఆయన మాటల్లోనే.. అనువైన ప్రాంతం..
కాఫీ పండించేందుకు విశాఖపట్నం ఏజెన్సీలో మరో లక్ష హెక్టార్లకుపైగా అనువైన స్థలం ఉంది. నీడపడే ప్రాంతంలో పండడంతో ఇక్కడి కాఫీ చాలా రుచికరమైంది. రైతులు ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నారు. కాఫీ బోర్డు లెక్కల ప్రకారం భారత్‌లో తొలి స్థానంలో ఉన్న కర్నాటకలో కాఫీ పంట 2013-14లో 2.27 లక్షల టన్నులుండొచ్చని అంచనా. ఇందులో ఎంత కాదన్నా 50-60 శాతం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పండించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వ్యాపార అవకాశాలను కొత్త ప్రభుత్వానికి తెలియజేస్తాను. కాఫీ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తాను. ప్రస్తుతం 58,131 హెక్టార్లలో కాఫీ తోటలు ఈ ప్రాంతంలో విస్తరించాయి. 7 వేల టన్నుల కాఫీ మాత్రమే పండుతోంది. కాఫీ మొక్కల మధ్య ఏలకులు, మిరియాల వంటివీ సాగు చేయవచ్చు.
ఔత్సాహికులను ప్రోత్సహించాలి..
కాఫీ పండించేందుకు ముందుకు వచ్చేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. పూర్తిగా లీజు పద్దతిన ఒక్కొక్కరికి కనీసం 25 ఎకరాలు కేటాయించాలి. ఇందుకోసం ప్రభుత్వం ఓపెన్ ఆఫర్‌ను పత్రికా ముఖంగా ప్రకటించాలి. సహకార సేద్యమూ చేయవచ్చు. కొలంబియాలో రైతు సమాఖ్య సాగు చేపట్టినా నియంత్రణ పూర్తిగా అక్కడి ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అదే విధానాన్ని ఇక్కడా అమలు చేయవచ్చు. ఇక కాఫీ పండించేందుకు చెట్లను తొలగించాల్సిన అవసరమే లేదు. కాబట్టి అటవీ సంపదకు వచ్చే నష్టమేమీ లేదు. కాఫీ అనేది తోటల కిందకు వస్తుంది. స్థల కేటాయింపులో గరిష్ట నిబంధన వర్తించదు. రాష్ట్రంలో గిరిజనులు మాత్రమే కాఫీ పండించాలన్న ప్రచారం ఉంది. ఇందులో నిజం లేదు. ఎవరైనా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు.
ఏదైనా సాధ్యం చేస్తారు..
తెలుగు రైతులకు ఏదైనా సాధ్యమే. పత్తి, మిర్చి, పసుపు ఇలా చాలా పంటల్లో మనవారు సత్తా చాటారు. కాఫీ విషయంలోనూ కొత్త రికార్డులను నమోదు చేస్తారు. కావాల్సిందల్లా ప్రభుత్వ సహకారమే. స్థలం కేటాయిస్తే చాలు. ఇక కాఫీ ధర అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి ఉంటుంది. ధర విషయంలో మోసానికి తావు లేదు. అర్ధరాత్రి అయినా సరుకు అమ్ముడుపోతుంది. మార్కెటింగ్ అంటారా సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎలాగూ ఉంది. పంటను మేమే కొనుగోలు చేస్తాం. సాంకేతిక సహకారం కాఫీ బోర్డు ఇస్తుంది. బ్యాంకు నుంచి రుణం సులువుగా వస్తుంది. సాధారణంగా మూడేళ్లలో పంట చేతికొస్తుంది. ఏ ప్రాంతంలో చూసినా కాఫీ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నవారే.
ఆదాయంతోపాటు ఉపాధి..
లక్ష హెక్టార్లంటే ఎంత కాదన్నా అయిదు లక్షల మందికిపైగా కొత్తగా ఉపాధి లభిస్తుంది. రైతు కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ప్రభుత్వానికి దీర్ఘకాలంలో కాఫీ ఎగుమతుల ఆదాయం సమకూరుతుంది. కాఫీ ఉత్పత్తి విషయంలో వియత్నాం 20 ఏళ్ల క్రితం ఏమీ లేదు. నేడు ప్రపంచంలో రెండో స్థానానికి ఎగబాకింది. భారత్‌లో 2012-13లో 3.18 లక్షల టన్నుల కాఫీ పండింది. 2013-14లో ఇది 3.47 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. 10 లక్షల టన్నులు పండించ గలిగేంతగా అవకాశాలున్నాయి. ఏజెన్సీలో కాఫీ విస్తరించాలంటే ప్రభుత్వమే చొరవ చూపాలి.