coffee board
-
కాఫీ బోర్డుకు రూ.1,510 కోట్లు మంజూరు చేయండి
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): కేంద్ర కాఫీబోర్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని గురువారం ఆమె కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా ఫైనాన్స్ కమిటీ సూచన మేరకు కేటాయించాల్సిన రూ.1,510 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేసి, కేంద్ర కాఫీ బోర్డును బలోపేతం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ మాధవి తెలిపారు. కాఫీ రైతులకు మేలు కలిగేలా కాఫీబోర్డులో ఖాళీగా ఉన్న 152 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరానని వివరించారు. -
కాఫీ బోర్డులోకి శ్రీశాంత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక భారత కాఫీ బోర్డు సభ్యుడిగా సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎండీ చల్లా శ్రీశాంత్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇన్స్టాంట్ కాఫీ తయారీదార్ల తరఫున సభ్యుడిగా బోర్డు ఆయనను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా అయిదుగురికి బోర్డులో స్థానం దక్కడ విశేషం. ‘ఏపీలో కాఫీ సాగుపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు దీనినిబట్టి అర్థం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటే భారత్‌లో కాఫీ ఉత్పత్తి రెండింతలు అవుతుంది’ అని శ్రీశాంత్ ఈ సందర్భంగా తెలిపారు. -
కాఫీ బోర్డు సభ్యురాలిగా ఎంపీ మాధవి
సాక్షి, న్యూఢిల్లీ: కాఫీ బోర్డు సభ్యురాలిగా వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాఫీ బోర్డును పునర్నియమిస్తూ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో సభ్యులుగా ఎంపీ ప్రతాప్ సిన్హా, రాజ్యసభ సభ్యుడు ఎన్.చంద్రశేఖరన్ కూడా ఉన్నారు. కాఫీ సాగు చేసే రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల విభాగంలో ఏపీ గిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శి కాంతిలాల్‌దండే, కాఫీ పండించే వారి విభాగంలో విశాఖ జిల్లా దోమంగికి చెందిన విశ్వనాథం, కొత్తపాడేరుకు చెందిన కురుస ఉమామహేశ్వరరావు, వాణిజ్య విభాగంలో విశాఖ జిల్లా కిన్నెర్లకు చెందిన జయతు ప్రభాకర్‌రావు, ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తిదారుల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీశాంత్‌లను వాణిజ్య శాఖ సభ్యులుగా నియమించింది. -
ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
దట్టంగా పొగమంచు రాత్రి వేళల్లో చలిగాలులు పాడేరు : ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మినుములూరు కాఫీబోర్డు వద్ద కొన్ని రోజులుగా 20 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 20వ తేదీన 16 డిగ్రీలు, 21న 16, 22న 16, 23న 15, 24న 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచు తీవ్రత కూడా అధికంగా ఉంది. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో ఉదయం 9 గంటల వరకు వాహనచోదకులు లైట్లు వేసుకొని ప్రయాణించాల్సి వస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ, పాడేరు, లంబసింగి, చింతపల్లి, సప్పర్ల, దారకొండ ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఉంది. నవంబర్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే పరిస్థితి ఉందని కాఫీబోర్డు అధికారులు పేర్కొంటున్నారు. -
తెలుగు నేలపై...కాఫీ ఘుమఘుమలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాఫీ అనగానే మన దేశంలో తొలుత గుర్తొచ్చేది కర్ణాటక. ఇంతటి పేరు ప్రఖ్యాతులు మనమూ సాధించొచ్చు. అంతలా అవకాశాలు తెలుగు నేల పైనా ఉన్నాయని అం టున్నారు భారత కాఫీ బోర్డు సభ్యులు, సీసీఎల్ ప్రొడక్ట్స్(కాంటినెంటల్ కాఫీ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్. ప్రైవేటు లేబుల్ విభాగంలో ఇన్స్టంట్ కాఫీ విక్రయాల్లో సీసీఎల్‌ను ప్రపంచంలో తొలి స్థానంలో నిలబెట్టిన ఘనత ఆయనకే సొంతం. కాఫీ బోర్డు సభ్యుడిగా ఆరోసారి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో అవకాశాలు, కాఫీ రంగంలో వ్యాపారాంశాలను సాక్షి బిజినెస్ బ్యూరోతో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. అనువైన ప్రాంతం.. కాఫీ పండించేందుకు విశాఖపట్నం ఏజెన్సీలో మరో లక్ష హెక్టార్లకుపైగా అనువైన స్థలం ఉంది. నీడపడే ప్రాంతంలో పండడంతో ఇక్కడి కాఫీ చాలా రుచికరమైంది. రైతులు ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నారు. కాఫీ బోర్డు లెక్కల ప్రకారం భారత్‌లో తొలి స్థానంలో ఉన్న కర్నాటకలో కాఫీ పంట 2013-14లో 2.27 లక్షల టన్నులుండొచ్చని అంచనా. ఇందులో ఎంత కాదన్నా 50-60 శాతం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పండించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వ్యాపార అవకాశాలను కొత్త ప్రభుత్వానికి తెలియజేస్తాను. కాఫీ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తాను. ప్రస్తుతం 58,131 హెక్టార్లలో కాఫీ తోటలు ఈ ప్రాంతంలో విస్తరించాయి. 7 వేల టన్నుల కాఫీ మాత్రమే పండుతోంది. కాఫీ మొక్కల మధ్య ఏలకులు, మిరియాల వంటివీ సాగు చేయవచ్చు. ఔత్సాహికులను ప్రోత్సహించాలి.. కాఫీ పండించేందుకు ముందుకు వచ్చేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. పూర్తిగా లీజు పద్దతిన ఒక్కొక్కరికి కనీసం 25 ఎకరాలు కేటాయించాలి. ఇందుకోసం ప్రభుత్వం ఓపెన్ ఆఫర్‌ను పత్రికా ముఖంగా ప్రకటించాలి. సహకార సేద్యమూ చేయవచ్చు. కొలంబియాలో రైతు సమాఖ్య సాగు చేపట్టినా నియంత్రణ పూర్తిగా అక్కడి ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అదే విధానాన్ని ఇక్కడా అమలు చేయవచ్చు. ఇక కాఫీ పండించేందుకు చెట్లను తొలగించాల్సిన అవసరమే లేదు. కాబట్టి అటవీ సంపదకు వచ్చే నష్టమేమీ లేదు. కాఫీ అనేది తోటల కిందకు వస్తుంది. స్థల కేటాయింపులో గరిష్ట నిబంధన వర్తించదు. రాష్ట్రంలో గిరిజనులు మాత్రమే కాఫీ పండించాలన్న ప్రచారం ఉంది. ఇందులో నిజం లేదు. ఎవరైనా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఏదైనా సాధ్యం చేస్తారు.. తెలుగు రైతులకు ఏదైనా సాధ్యమే. పత్తి, మిర్చి, పసుపు ఇలా చాలా పంటల్లో మనవారు సత్తా చాటారు. కాఫీ విషయంలోనూ కొత్త రికార్డులను నమోదు చేస్తారు. కావాల్సిందల్లా ప్రభుత్వ సహకారమే. స్థలం కేటాయిస్తే చాలు. ఇక కాఫీ ధర అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి ఉంటుంది. ధర విషయంలో మోసానికి తావు లేదు. అర్ధరాత్రి అయినా సరుకు అమ్ముడుపోతుంది. మార్కెటింగ్ అంటారా సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎలాగూ ఉంది. పంటను మేమే కొనుగోలు చేస్తాం. సాంకేతిక సహకారం కాఫీ బోర్డు ఇస్తుంది. బ్యాంకు నుంచి రుణం సులువుగా వస్తుంది. సాధారణంగా మూడేళ్లలో పంట చేతికొస్తుంది. ఏ ప్రాంతంలో చూసినా కాఫీ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నవారే. ఆదాయంతోపాటు ఉపాధి.. లక్ష హెక్టార్లంటే ఎంత కాదన్నా అయిదు లక్షల మందికిపైగా కొత్తగా ఉపాధి లభిస్తుంది. రైతు కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ప్రభుత్వానికి దీర్ఘకాలంలో కాఫీ ఎగుమతుల ఆదాయం సమకూరుతుంది. కాఫీ ఉత్పత్తి విషయంలో వియత్నాం 20 ఏళ్ల క్రితం ఏమీ లేదు. నేడు ప్రపంచంలో రెండో స్థానానికి ఎగబాకింది. భారత్‌లో 2012-13లో 3.18 లక్షల టన్నుల కాఫీ పండింది. 2013-14లో ఇది 3.47 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. 10 లక్షల టన్నులు పండించ గలిగేంతగా అవకాశాలున్నాయి. ఏజెన్సీలో కాఫీ విస్తరించాలంటే ప్రభుత్వమే చొరవ చూపాలి.