కొత్తగా అరకు ఇన్స్టెంట్ కాఫీ
♦ రూ.5 ప్యాక్‌లో అందుబాటులోకి
♦ బ్లెండెడ్ కాఫీ కూడా..
♦ మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాల్లో జీసీసీ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ కాఫీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న అరకు కాఫీ మరో అడుగు ముందుకేస్తోంది. ఇకపై ఇన్‌స్టెంట్ కాఫీగానూ మార్కెట్లోకి రాబోతోంది. తొలిదశలో రూ.5 సాచెట్లలో అందుబాటులోకి తీసుకురావడానికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం బెంగళూరులో ఉన్న ఓ తయారీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రయోగాత్మకంగా ఈ ఏడాది కనీసం మూడు టన్నుల కాఫీ గింజలను పొడి చేసి ఇన్‌స్టెంట్ కాఫీ సాచెట్లుగా తయారు చేయించాలని చూస్తోంది.
ఇప్పటిదాకా బ్రూ, నెస్లే, సీసీఎల్ వంటి సంస్థలే ఇన్‌స్టెంట్ కాఫీని మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఇకపై అరకు ఇన్స్టెంట్ కాఫీ కూడా రంగప్రవేశం చేయనుంది. జీసీసీ ఈ ఏడాది ఆఖరుకల్లా ఈ అరకు ఇన్‌స్టెంట్ కాఫీని మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ‘ఇప్పటికే అరకు కాఫీకి ఆదరణ బాగుండడంతో వినియోగదార్లు ఇన్‌స్టెంట్ కాఫీని కూడా అడుగుతున్నారు. వీరి అభిరుచికి అనుగుణంగా ఇన్‌స్టెంట్ కాఫీని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాం. ఇది కూడా మాకు లాభదాయకంగా ఉంటుంది.. ఆదరణ బాగుంటుందని భావిస్తున్నాం’ అని జీసీసీ ఎండీ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు.
వైశాఖి బ్లెండెడ్ కాఫీ: జీసీసీ వైశాఖి బ్లెండెడ్ కాఫీ పేరిట మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాత కాఫీ ఎక్స్‌పర్ట్ సోనాలినీ మీనన్ సహకారం తీసుకుంటోంది. ఈ బ్లెండెడ్ కాఫీకి ఓ ప్రత్యేకత ఉంది. విశాఖ ఏజెన్సీలో ఏడు మండలాల్లో కాఫీ పంట సాగవుతోంది. ఒక్కో ప్రాంతంలో నేల స్వభావాన్ని బట్టి కాఫీ రుచి మారుతుంది.
దీన్ని గుర్తించిన జీసీసీ ఇకపై ఆయా ప్రాంతాల పేరిట వివిధ రుచుల (ఫ్లేవర్స్)తో వేర్వేరుగా కాఫీ ప్రియులకు పరిచయం చేయనుంది. ఉదాహరణకు చింతపల్లి, పాడేరు మండలాల్లో పండిన కాఫీని వైశాఖి బ్లెండెడ్ కాఫీగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. దేశంలో మరే సంస్థ ఇప్పటిదాకా స్థానిక రుచులు (లోకల్ ఫ్లేవర్స్)తో మార్కెట్లోకి తీసుకురాలేదని జీసీసీ ఎండీ రవిప్రకాష్ చెప్పారు.