సెకనుకు 1,000 కప్పుల కాఫీ..! | CCL New Brands Launched Instant Coffee | Sakshi
Sakshi News home page

సెకనుకు 1,000 కప్పుల కాఫీ..!

Published Wed, Aug 14 2019 11:16 AM | Last Updated on Wed, Aug 14 2019 11:16 AM

CCL New Brands Launched Instant Coffee - Sakshi

బ్రాండ్‌ అంబాసిడర్‌ నిత్యా మీనన్‌తో చల్లా శ్రీశాంత్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రైవేట్‌ లేబుల్‌ ఇన్‌స్టాంట్‌ కాఫీ తయారీలో ఉన్న ప్రపంచ దిగ్గజం సీసీఎల్‌ ప్రొడక్ట్స్ భారత్‌పై ఫోకస్‌ చేసింది. దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇన్‌స్టాంట్‌ కాఫీ, ఫిల్టర్‌ కాఫీ, కాఫీ ప్రీమిక్స్‌ శ్రేణిలో నూతన ఉత్పాదనలను విడుదల చేసింది. రూ.1తో మొదలుకుని విభిన్న ప్యాక్‌లలో వీటిని ప్రవేశపెట్టింది. దక్షిణాదిన పెద్ద ఎత్తున విస్తరించిన తర్వాత 2021 నాటికి దేశవ్యాప్తంగా అడుగుపెడతామని సీసీఎల్‌ ప్రొడక్టŠస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ చల్లా రాజేంద్ర ప్రసాద్‌ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘భారత్‌లో కాఫీ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల వాటా  75%. కంపెనీ సొంత బ్రాండ్‌.. కాంటినెంటల్‌ కాఫీ ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. సంస్థ ఆదాయంలో భారత్‌ వాటా 7 శాతమే. రెండేళ్లలో దీనిని రెండింతలకు తీసుకువెళతాం’ అని వివరించారు. సినీ నటి నిత్యా మీనన్‌ను కాంటినెంటల్‌ కాఫీ బ్రాండ్‌ ప్రచారకర్తగా నియమించారు. 

నూతన ఉత్పత్తులతో మోహన్‌ కృష్ణ, శ్రీశాంత్, రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్‌ (ఎడమ నుంచి కుడికి).
కాఫీ రుచులు 1,000కి పైమాటే..
సీసీఎల్‌ ప్రస్తుతం 90 దేశాల్లోని కంపెనీలకు 250కిపైగా బ్రాండ్లలో ప్రాసెస్డ్‌ కాఫీని సరఫరా చేస్తోంది. రెండు మూడేళ్లలో మరో 10 దేశాల్లో అడుగు పెట్టడం ద్వారా 100 మార్కును దాటాలన్నది లక్ష్యమని కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్‌ తెలిపారు. 1,000కిపైగా రుచుల్లో కాఫీని తయారు చేయగల సామర్థ్యం సంస్థకు ఉందన్నారు. సీసీఎల్‌ తయారు చేసిన కాఫీతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 1,000 కప్పుల కాఫీ వినియోగం అవుతోందని చెప్పారు. దశాబ్దాలపాటు సంస్థకు ఉన్న అనుభవం, ప్రపంచ కాఫీ రంగంలో సాధించిన విజయంతో ఇక భారత వినియోగదార్లకు చేరువ అవుతామని సంస్థ డైరెక్టర్‌ బి.మోహన్‌ కృష్ణ తెలిపారు. పోటీ కంపెనీల కంటే దీటుగా ఉత్పత్తులను తయారు చేశామన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి నెల ఒక లక్ష కప్పుల కాఫీని కస్టమర్లకు ఉచితంగా అందించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 50,000 ఔట్‌లెట్లకు చేరువయ్యామని, డిసెంబరుకల్లా ఒక లక్ష స్టోర్లలో కాంటినెంటల్‌ కాఫీ లభ్యమవుతుందని ఆయన వివరించారు. 

రూ.140 కోట్ల పెట్టుబడి..: కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 35,000 టన్నులు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాలతోపాటు స్విట్జర్లాండ్, వియత్నాంలో ప్లాంట్లున్నాయి. చిత్తూరు జిల్లాలోని సెజ్‌లో నెలకొల్పిన ప్లాంటులో ఇటీవలే ఉత్పత్తి ప్రారంభమైంది. సెజ్‌ కోసం రూ.350 కోట్లు వెచ్చించినట్టు సీసీఎల్‌ సీఈవో ప్రవీణ్‌ జైపూరియార్‌ వెల్లడించారు. వియత్నాం ప్లాంటు సామర్థ్యం పెంపు, చిత్తూరు కేంద్రంలో ప్యాకేజింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక టర్నోవరులో ఏటా 15–20% వృద్ధి ఆశిస్తున్నట్టు సీసీఎల్‌ సీవోవో కేవీఎల్‌ఎన్‌ శర్మ తెలిపారు. సీసీఎల్‌కు భారత్‌లో 1,000, విదేశాల్లో 250 మంది ఉద్యోగులున్నారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement