CCL Products
-
తెలుగు కాఫీ కంపెనీ కొత్త రికార్డు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ తయారీలో ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బిలియన్ డాలర్ (రూ.8,200 కోట్లు) కంపెనీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల కేంద్రంగా 1995లో ప్రారంభమైన ఈ కంపెనీ 100కుపైగా దేశాల్లో కస్టమర్లను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు, వియత్నాం, స్విట్జర్లాండ్‌లో ఒక్కొక్క ప్లాంటు ఉంది. ఏటా 55,000 టన్నుల కాఫీని తయారు చేయగలిగే సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 1,000కిపైగా కప్పుల సీసీఎల్ కాఫీని కస్టమర్లు ఆస్వాదిస్తున్నారు. అనతికాలంలోనే కాఫీ రిటైల్‌లో భారత్‌లో టాప్–3 స్థానానికి ఎగబాకినట్టు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఫౌండర్, చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. అయిదేళ్లలో 2 బిలియన్ డాలర్ కంపెనీగా అవతరిస్తామన్నారు. కాఫీ రుచులు 1,000కిపైగా.. సీసీఎల్ ప్రొడక్ట్స్ 1,000కిపైగా రుచుల్లో కాఫీని తయారు చేస్తోంది. వీటిలో ఫంక్షనల్ కాఫీ, కోల్డ్ బ్రూ ఇన్స్టంట్, మైక్రోగ్రౌండ్ ఇన్ఫ్యూజ్డ్, స్పెషాలిటీ ఇన్స్టంట్ కాఫీ ఉన్నాయని కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్ తెలిపారు. ‘ఈ స్థాయి ఉత్పత్తులతో దేశీయ మార్కెట్లో కాంటినెంటల్ పేరుతో సొంత బ్రాండ్స్‌ను పరిచయం చేయడానికి, స్థిరమైన బిజినెస్ టు కన్సూమర్ కంపెనీగా రూపొందించడానికి విశ్వాసాన్ని ఇచ్చింది. బీటూసీని పటిష్టం చేయడానికి లాఫ్బెర్గ్స్ గ్రూప్ నుంచి ఆరు బ్రాండ్లను దక్కించుకున్నాం. ఎఫ్ఎంసీజీ కంపెనీగా నిలవాలన్నది మా కల. ఇందులో భాగంగా గ్రీన్‌బర్డ్ పేరుతో మొక్కల ఆధారిత ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించాం’ అని వివరించారు. ఏపీలో మరో ప్లాంటు.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న కాంటినెంటల్ కాఫీ పార్కులో సీసీఎల్ కొత్తగా ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. 22 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు కంపెనీ ఈడీ మోహన్‌కృష్ణ వెల్లడించారు. వార్షిక తయారీ సామర్థ్యం 16,000 మెట్రిక్ టన్నులు. 2024 మార్చిలోగా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. -
రూ. 407 కోట్లతో సీసీఎల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ వియత్నాం తయారీ కేంద్రంలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 6,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ఫెసిలిటీని నెలకొల్పనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.407 కోట్లు. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర డివిడెండ్ రూ.3 చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఫలితాల్లో కంపెనీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24.9 శాతం ఎగసి రూ.73 కోట్లు సాధించింది. ఎబిటా 9 శాతం పెరిగి రూ.101 కోట్లుగా ఉంది. టర్నోవర్ 26.5 శాతం అధికమై రూ.535 కోట్లు నమోదు చేసింది. -
కాఫీ బోర్డులోకి శ్రీశాంత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక భారత కాఫీ బోర్డు సభ్యుడిగా సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎండీ చల్లా శ్రీశాంత్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇన్స్టాంట్ కాఫీ తయారీదార్ల తరఫున సభ్యుడిగా బోర్డు ఆయనను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా అయిదుగురికి బోర్డులో స్థానం దక్కడ విశేషం. ‘ఏపీలో కాఫీ సాగుపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు దీనినిబట్టి అర్థం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటే భారత్‌లో కాఫీ ఉత్పత్తి రెండింతలు అవుతుంది’ అని శ్రీశాంత్ ఈ సందర్భంగా తెలిపారు. -
కాంటినెంటల్ కాఫీ కొత్త రుచులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ దిస్ పేరుతో నాలుగు రకాల త్రీ ఇన్ వన్ ప్రీమిక్స్ కాఫీ రుచులను ప్రవేశపెట్టింది. 22 గ్రాముల ప్యాక్ ధర రూ.20గా కంపెనీ నిర్ణయించింది. అయిదు ప్యాక్‌లు కొంటే ఒకటి ఉచితం. త్వరగా కాఫీ తయారు చేసుకునేలా ప్రీమిక్స్ రకాలకు రూపకల్పన చేశామని కంపెనీ కంజ్యూమర్ మార్కెటింగ్ హెడ్ ప్రీతమ్ పట్నాయక్ తెలిపారు. సీసీఎల్ ప్రొడక్ట్స్ కాంటినెంటల్ బ్రాండ్‌లో భారత్‌తోపాటు 90కిపైగా దేశాలకు కాఫీని సరఫరా చేస్తోంది. -
సెకనుకు 1,000 కప్పుల కాఫీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ లేబుల్ ఇన్స్టాంట్ కాఫీ తయారీలో ఉన్న ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ భారత్‌పై ఫోకస్ చేసింది. దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇన్స్టాంట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, కాఫీ ప్రీమిక్స్ శ్రేణిలో నూతన ఉత్పాదనలను విడుదల చేసింది. రూ.1తో మొదలుకుని విభిన్న ప్యాక్‌లలో వీటిని ప్రవేశపెట్టింది. దక్షిణాదిన పెద్ద ఎత్తున విస్తరించిన తర్వాత 2021 నాటికి దేశవ్యాప్తంగా అడుగుపెడతామని సీసీఎల్ ప్రొడక్టŠస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘భారత్‌లో కాఫీ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 75%. కంపెనీ సొంత బ్రాండ్.. కాంటినెంటల్ కాఫీ ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. సంస్థ ఆదాయంలో భారత్ వాటా 7 శాతమే. రెండేళ్లలో దీనిని రెండింతలకు తీసుకువెళతాం’ అని వివరించారు. సినీ నటి నిత్యా మీనన్‌ను కాంటినెంటల్ కాఫీ బ్రాండ్ ప్రచారకర్తగా నియమించారు. నూతన ఉత్పత్తులతో మోహన్ కృష్ణ, శ్రీశాంత్, రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్ (ఎడమ నుంచి కుడికి). కాఫీ రుచులు 1,000కి పైమాటే.. సీసీఎల్ ప్రస్తుతం 90 దేశాల్లోని కంపెనీలకు 250కిపైగా బ్రాండ్లలో ప్రాసెస్డ్ కాఫీని సరఫరా చేస్తోంది. రెండు మూడేళ్లలో మరో 10 దేశాల్లో అడుగు పెట్టడం ద్వారా 100 మార్కును దాటాలన్నది లక్ష్యమని కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్ తెలిపారు. 1,000కిపైగా రుచుల్లో కాఫీని తయారు చేయగల సామర్థ్యం సంస్థకు ఉందన్నారు. సీసీఎల్ తయారు చేసిన కాఫీతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 1,000 కప్పుల కాఫీ వినియోగం అవుతోందని చెప్పారు. దశాబ్దాలపాటు సంస్థకు ఉన్న అనుభవం, ప్రపంచ కాఫీ రంగంలో సాధించిన విజయంతో ఇక భారత వినియోగదార్లకు చేరువ అవుతామని సంస్థ డైరెక్టర్ బి.మోహన్ కృష్ణ తెలిపారు. పోటీ కంపెనీల కంటే దీటుగా ఉత్పత్తులను తయారు చేశామన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి నెల ఒక లక్ష కప్పుల కాఫీని కస్టమర్లకు ఉచితంగా అందించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 50,000 ఔట్లెట్లకు చేరువయ్యామని, డిసెంబరుకల్లా ఒక లక్ష స్టోర్లలో కాంటినెంటల్ కాఫీ లభ్యమవుతుందని ఆయన వివరించారు. రూ.140 కోట్ల పెట్టుబడి..: కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 35,000 టన్నులు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాలతోపాటు స్విట్జర్లాండ్, వియత్నాంలో ప్లాంట్లున్నాయి. చిత్తూరు జిల్లాలోని సెజ్‌లో నెలకొల్పిన ప్లాంటులో ఇటీవలే ఉత్పత్తి ప్రారంభమైంది. సెజ్ కోసం రూ.350 కోట్లు వెచ్చించినట్టు సీసీఎల్ సీఈవో ప్రవీణ్ జైపూరియార్ వెల్లడించారు. వియత్నాం ప్లాంటు సామర్థ్యం పెంపు, చిత్తూరు కేంద్రంలో ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక టర్నోవరులో ఏటా 15–20% వృద్ధి ఆశిస్తున్నట్టు సీసీఎల్ సీవోవో కేవీఎల్ఎన్ శర్మ తెలిపారు. సీసీఎల్‌కు భారత్‌లో 1,000, విదేశాల్లో 250 మంది ఉద్యోగులున్నారని చెప్పారు. -
సీసీఎల్ నికర లాభం రూ.27 కోట్లు
షేరుకు రూ.2.50 తుది డివిడెండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం బాగా క్షీణించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం రూ.40 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పరిమితమయింది. టర్నోవరు రూ.251 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.249 కోట్లకు పరిమితమయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా పరిమితిని పెంచాలని మంగళవారం సమావేశమైన బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎఫ్ఐఐల వాటా పరిమితి 24 శాతముంది. దీనిని 40 శాతం వరకూ అనుమతించేలా బోర్డు నిర్ణయం తీసుకుంది. 2016–17 సంవత్సరానికిగాను ఒక్కో షేరుపై రూ.2.50 తుది డివిడెండు చెల్లించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కాళహస్తి సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు 2018 జూలై నాటికి ప్రారంభిస్తామని సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 5,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటు కోసం సుమారు రూ.325 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. 100 ఎకరాలను కంపెనీ కొనుగోలు చేసింది. ఇందులో 25 ఎకరాల్లో సెజ్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా మరో 100 మందికి ఉపాధి లభించనుంది. ఫ్రీజ్ డ్రైడ్ ఇన్స్టాంట్ కాఫీని ఇక్కడ తయారు చేస్తారు. ప్రధానంగా యూఎస్, యూరప్ మార్కెట్లకు కాఫీని ఎగుమతి చేయనున్నారు. -
సీసీఎల్ ప్రోడక్ట్్స లాభం రూ.37 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సీసీఎల్ ప్రోడక్ట్స్ నికర లాభం రూ. 37 కోట్లుగా (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 22 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 216 కోట్ల నుంచి రూ. 264 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ. 880 కోట్ల నుంచి రూ. 932 కోట్లకు, లాభం రూ. 94 కోట్ల నుంచి రూ. 122 కోట్లకు పెరిగింది. అటు రూ. 2 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 1 చొప్పున తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. ఇది మధ్యంతర డివిడెండు రూ. 1.50కు అదనంగా ఉంటుందని వివరించింది. -
సీసీఎల్ ప్రొడక్ట్స్ లాభం రూ.26 కోట్లు
లాభం రూ.26 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ కాఫీ తయారీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.213 కోట్ల టర్నోవర్‌పై రూ.26 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.241 కోట్ల టర్నోవర్‌పై రూ.26 కోట్ల నికర లాభం పొందింది. డిసెంబరుతో ముగిసిన 9 నెలల కాలంలో రూ.668 కోట్ల టర్నోవర్‌పై రూ.85 కోట్ల నికర లాభం నమోదు చేసింది. 2013-14, 2014-15కుగాను కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ ఇన్స్టాంట్ కాఫీతోపాటు యూఎస్ఏ, కెనడా, రష్యా, సీఐఎస్, తూర్పు దేశాలకు ఉత్తమ ఎగుమతిదారుగా అవార్డులను అందుకున్నట్టు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. -
50 శాతం పెరిగిన సీసీఎల్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ కాఫీ విక్రయ సంస్థ సీసీఎల్ ప్రొడక్ట్స్ 2015-16 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే 50 శాతం వృద్ధితో రూ.30 కోట్లకు పెరిగింది. టర్నోవరు రూ.175 కోట్ల నుంచి రూ.220 కోట్లకు చేరింది. 2014-15 సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై కంపెనీ రూ.1.50 డివిడెండు ప్రకటించింది.