హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌స్టంట్ కాఫీ తయారీలో ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బిలియన్ డాలర్ (రూ.8,200 కోట్లు) కంపెనీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల కేంద్రంగా 1995లో ప్రారంభమైన ఈ కంపెనీ 100కుపైగా దేశాల్లో కస్టమర్లను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు, వియత్నాం, స్విట్జర్లాండ్‌లో ఒక్కొక్క ప్లాంటు ఉంది.
ఏటా 55,000 టన్నుల కాఫీని తయారు చేయగలిగే సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 1,000కిపైగా కప్పుల సీసీఎల్ కాఫీని కస్టమర్లు ఆస్వాదిస్తున్నారు. అనతికాలంలోనే కాఫీ రిటైల్‌లో భారత్‌లో టాప్–3 స్థానానికి ఎగబాకినట్టు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఫౌండర్, చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. అయిదేళ్లలో 2 బిలియన్ డాలర్ కంపెనీగా అవతరిస్తామన్నారు.
కాఫీ రుచులు 1,000కిపైగా..
సీసీఎల్ ప్రొడక్ట్స్ 1,000కిపైగా రుచుల్లో కాఫీని తయారు చేస్తోంది. వీటిలో ఫంక్షనల్ కాఫీ, కోల్డ్ బ్రూ ఇన్‌స్టంట్, మైక్రోగ్రౌండ్ ఇన్‌ఫ్యూజ్డ్, స్పెషాలిటీ ఇన్‌స్టంట్ కాఫీ ఉన్నాయని కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్ తెలిపారు. ‘ఈ స్థాయి ఉత్పత్తులతో దేశీయ మార్కెట్లో కాంటినెంటల్ పేరుతో సొంత బ్రాండ్స్‌ను పరిచయం చేయడానికి, స్థిరమైన బిజినెస్ టు కన్సూమర్ కంపెనీగా రూపొందించడానికి విశ్వాసాన్ని ఇచ్చింది. బీటూసీని పటిష్టం చేయడానికి లాఫ్‌బెర్గ్స్ గ్రూప్ నుంచి ఆరు బ్రాండ్లను దక్కించుకున్నాం. ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా నిలవాలన్నది మా కల. ఇందులో భాగంగా గ్రీన్‌బర్డ్ పేరుతో మొక్కల ఆధారిత ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించాం’ అని వివరించారు.
ఏపీలో మరో ప్లాంటు..
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న కాంటినెంటల్ కాఫీ పార్కులో సీసీఎల్ కొత్తగా ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. 22 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు కంపెనీ ఈడీ మోహన్‌కృష్ణ వెల్లడించారు. వార్షిక తయారీ సామర్థ్యం 16,000 మెట్రిక్ టన్నులు. 2024 మార్చిలోగా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment