కాఫీపొడితో ఎకోఫ్రెండ్లీ కప్పులు!
జర్మనీః వ్యర్థాలనుంచీ ఉపయోగాలను సృష్టించడం ఆధునిక కాలంలో అత్యవసరంగా మారింది. పనికిరాని పదార్థాలనుంచీ విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాహనాలు, ఇతర వస్తువులు తయారు చేయడం చూస్తూనే ఉన్నాం. వాతావరణానికి హాని కలిగించేవే కాక, ఇతర వస్తువులను సైతం రీ సైకిల్ చేసి ఉపయోగించడంవల్ల కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, వస్తు ఉత్పత్తిలో పెట్టుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాడేసిన కాఫీ పొడితో అందమైన కాఫీ కప్పు, సాసర్లను తయారు చేసి పర్యావరణానికి మరింత సహకరించవచ్చంటున్నారు జర్మనీ ఉత్పత్తిదారులు. తమ ఉత్పత్తులు పగిలిపోకుండా ధృఢంగా ఉండటంతోపాటు, కొద్దిపాటి తాజా కాఫీ పరిమళంతోపాటు మంచి అనుభవాలను అందిస్తాయంటున్నారు.
వాడిన కాఫీ పొడిని సౌందర్య సాధనంగానూ, వస్తువులను శుభ్రపరిచేందుకు, మొక్కల్లో ఎరువుగా వేసేందుకు వినియోగించడం తెలుసు. కానీ జర్మన్ కంపెనీ 'కాఫీఫామ్'.. కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాడేసి, ఎండిన కాఫీపొడిని బయోపాలిమర్ తో కలపి అందమైన కప్పులు, సాసర్ల తయారీ చేపడుతోంది. మనం తాగే ప్రతి కప్పు కాఫీకి సుమారు రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిని వాడుతుంటాం. అలా ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది అలవాటుగా తాగే కాఫీ తయారీ అనంతరం.. పొడి వృధాగా పోతోందన్న జర్మనీ డిజైనర్ జూలియన్ లేచ్నర్ ఆలోచనలే కప్పు, సాసర్ల రూపం దాల్చాయి. ఇటలీ నగరం బొల్జానా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో లేచ్చర్ కు ఈ కొత్త ఆలోచన వచ్చింది. యూనివర్శిటీ విద్యార్థులు, స్నేహితులు ప్రతి తరగతి ముందు, తర్వాత, మీటింగ్ సమయాల్లో, ఒత్తడి కలిగినపుడు ఇలా తరచుగా కాఫీ తాగే అలవాటు లేచ్చర్ దృష్టిలో పడింది. అలా వాడిన కాఫీ పొడి అంతా ఏమైపోతోంది అన్న కోణంలో ఆలోచన కలిగిందే తడవుగా అతడి ప్రయత్నం ప్రారంభమైంది. కాఫీ పొడితో ఘన పదార్థాలను ఎలా తయారు చేయవచ్చు అన్న దిశగా ప్రొఫెసర్లతో చర్చించిన లేచ్చర్ సృష్టి.. పర్యావరణ అనుకూలమైన కప్పు సాసర్ల తయారీ దిశాగా కార్యరూపం దాల్చింది. అయితే ఈ ప్రయోగం ఫలించడానికి అతడికి కొన్ని సంవత్సరాలు పట్టింది.
ప్రాధమికంగా కాఫీ పొడితో పంచదారను మిళితం చేసి ఘనపదార్థంగా తయారు చేసేందుకు ప్రయత్నించానని, అయితే అలా తయారైన కప్పులు కేవలం మూడుసార్లు ఉపయోగించిన తర్వాత పడేయాల్సిన పరిస్థితి ఉందని, దాంతో మన్నికైన కప్పుల తయారీ దిశగా జర్మన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకుల సహకారంతో అనేక ప్రయోగాలు చేసిన అనంతరం చివరికి బయోపాలిమర్ల మిళితంతో దృఢమైన కప్పుల తయారీ సాధ్యమైందని లేచ్చర్ వెల్లడించాడు. వాణిజ్యపరంగా విజయవంతమవ్వడంతో ప్రస్తుతం ఈ కొత్త 'కాఫీఫామ్' కప్పుసాసర్లను యూరప్ లోని పది దుకాణాలతోపాటు, కంపెనీ ఆన్ లైన్ విక్రయాలు కూడా జరుపుతోంది. ఇప్పుడు ఆన్లైన్ లో వ్యక్తిగత ఆర్డర్లతోపాటు, సౌదీ అరేబియాలోని ఓ కేఫ్, టొరొంటోతోపాటు ఓస్లో నోబెల్ శాంతి బహుమతి మ్యూజియం వారి దుకాణాల్లో అమ్మేందుకు సైతం ఆర్డర్లు రావడం ఎంతో ఆనందాన్ని నింపిందని లేచ్చర్ తన కంపెనీ విజయాలను వివరించాడు. ప్రస్తుతం చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో కప్పుల తయారీకోసం ప్రత్యేకంగా వికలాంగులకు అవకాశం ఇస్తున్నామని, త్వరలో కాఫీఫామ్ పెద్ద ఎత్తున ఉత్పత్తులు ప్రారంభించి ట్రావెల్ మగ్గులను కూడ ఉత్పత్తి చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపాడు.