సీసీఎల్ నికర లాభం రూ.27 కోట్లు
షేరుకు రూ.2.50 తుది డివిడెండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌స్టాంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం బాగా క్షీణించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం రూ.40 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పరిమితమయింది. టర్నోవరు రూ.251 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.249 కోట్లకు పరిమితమయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా పరిమితిని పెంచాలని మంగళవారం సమావేశమైన బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎఫ్‌ఐఐల వాటా పరిమితి 24 శాతముంది. దీనిని 40 శాతం వరకూ అనుమతించేలా బోర్డు నిర్ణయం తీసుకుంది. 2016–17 సంవత్సరానికిగాను ఒక్కో షేరుపై రూ.2.50 తుది డివిడెండు చెల్లించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కాళహస్తి సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు 2018 జూలై నాటికి ప్రారంభిస్తామని సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 5,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటు కోసం సుమారు రూ.325 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. 100 ఎకరాలను కంపెనీ కొనుగోలు చేసింది. ఇందులో 25 ఎకరాల్లో సెజ్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా మరో 100 మందికి ఉపాధి లభించనుంది. ఫ్రీజ్ డ్రైడ్ ఇన్‌స్టాంట్ కాఫీని ఇక్కడ తయారు చేస్తారు. ప్రధానంగా యూఎస్, యూరప్ మార్కెట్లకు కాఫీని ఎగుమతి చేయనున్నారు.