సగానికి తగ్గిన బీవోబీ లాభాలు
న్యూఢిల్లీ: మొండి బాకీలు పెద్దగా మారనప్పటికీ.. అధిక కేటాయిం పులు జరపాల్సి రావడంతో జూన్ త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) నికర లాభం దాదాపు 52 శాతం క్షీణించి రూ. 203 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది రూ.424 కోట్లు. మరోవైపు, మొత్తం ఆదాయం మాత్రం రూ. 11,878 కోట్ల నుంచి రూ. 12,104 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 11.15 సాతం నుంచి 11.40 శాతానికి చేరగా, నికర నిరర్ధక ఆస్తులు మాత్రం 5.73 శాతం నుంచి 5.17 శాతానికి తగ్గాయి. జూన్ త్రైమాసికంలో ప్రొవిజనింగ్ కింద బీవోబీ రూ. 2,157 కోట్లు పక్కన పెట్టింది. క్రితం క్యూ1లో ఈ మొత్తం రూ. 1,986 కోట్లు. బీఎస్‌ఈలో బీవోబీ షేరు 3.91 శాతం క్షీణించి రూ. 142.55 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్ ఫలితాలు ఓబీసీ నష్టం రూ. 486 కోట్లు
ఆదాయంలో క్షీణత, మొండి బాకీలకు అధిక కేటాయింపుల మూలంగా ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) క్యూ1లో రూ. 486 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత జూన్ త్రైమాసికంలో లాభం రూ. 101 కోట్లు. ఇక ఆదాయం రూ. 5,398 కోట్ల నుంచి రూ. 5,204 కోట్లకు తగ్గింది. స్థూల ఎన్‌పీఏలు 11.45 శాతం నుంచి 14.83 శాతానికి, నికర ఎన్‌పీఏలు 8.11 శాతం నుంచి 9.56 శాతానికి పెరిగాయి.
అలహాబాద్ లాభం రూ. 29 కోట్లు
అలహాబాద్ బ్యాంక్ రూ. 29 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో బ్యాంకుకు రూ.565 కోట్ల నష్టం వచ్చింది. తాజా తొలి త్రైమాసికంలో ఆదాయం రూ.5,123 కోట్ల నుంచి రూ.4,969 కోట్లకు తగ్గింది. నికర ఎన్‌పీఏలు 8.69 శాతం నుంచి 8.96 శాతానికి పెరిగాయి. క్యూ1లో మొండి బాకీల కోసం ప్రొవిజనింగ్ కింద అలహాబాద్ బ్యాంకు చేసిన కేటాయింపులు రూ.1,575 కోట్ల నుంచి రూ.1,687 కోట్లకు పెరిగాయి.
కార్పొరేషన్ బ్యాంక్ లాభం 67 శాతం అప్..
తొలి త్రైమాసికంలో కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం 67 శాతం వృద్ధి చెంది రూ.36 కోట్ల నుంచి రూ.60 కోట్లకు పెరిగింది. అయితే, ఆదాయం మాత్రం రూ.5,241 కోట్ల నుంచి రూ.5,113 కోట్లకు తగ్గింది. మరోవైపు, స్థూల నిరర్ధక ఆస్తులు 11.01 శాతం నుంచి ఏకంగా 15.49 శాతానికి ఎగశాయి.