అశోక్ లేలాండ్ లాభం 111 కోట్లు
న్యూఢిల్లీ: వాహన దిగ్గజం అశోక్ లేలాండ్ నికర లాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీగా తగ్గి రూ. 111.23 కోట్లకు దిగింది. గతేడాది ఇదేకాలంలో లాభం రూ. 291 కోట్లు. అయితే హిందూజా ఫౌండ్రీస్ విలీనం కారణంగా ఈ కంపెనీ ఆర్థికాంశాలు కూడా కలిసివున్నందున, తమతాజా ఫలితాల్ని గతేడాదితో పోల్చలేమని అశోక్‌లేలాండ్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
కానీ ముగిసిన త్రైమాసికంలో తమ లాభదాయకత తగ్గినట్లు కంపెనీ తెలిపింది. తాజా త్రైమాసికంలో ఫారిన్ ఎక్సే్ఛంజ్ స్వాప్స్ కారణంగా రూ. 2.67 కోట్ల నష్టం వచ్చిందని, గతేడాది ఇదేకాలంలో ఈ కార్యకలాపాల ద్వారా రూ. 49 కోట్ల లాభం వచ్చినట్లు కంపెనీ వివరించింది. అశోక్ లేలాండ్ మొత్తం ఆదాయం రూ. 4,553 కోట్ల వద్ద స్థిరంగా నమోదయ్యింది. గతేడాది జూన్ త్రైమాసికంలో ఆదాయం రూ. 4,569 కోట్లు.