విప్రో రూ.11 వేల కోట్ల బైబ్యాక్
♦ షేరుకు రూ. 320 చొప్పున
♦ 34 కోట్ల షేర్ల కొనుగోలుకు ఆఫర్
♦ స్వల్పంగా పెరిగిన నికరలాభం
బెంగళూరు: భారత్‌లో మూడో పెద్ద ఐటీ కంపెనీ విప్రో నికరలాభం ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1.2 శాతం పెరుగుదలతో రూ. 2,076 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం కూడా స్వల్పంగా వృద్ధిచెంది రూ. 14,281 కోట్లకు చేరింది. అలాగే రూ. 11,000 కోట్లతో బైబ్యాక్ ఆఫర్‌ను విప్రో ప్రకటించింది. ఈ ఆఫర్ కింద షేరుకు రూ. 320 చొప్పున 34.3 కోట్ల షేర్లను కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేయనుంది. గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు బైబ్యాక్ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షేర్‌హోల్డర్ల అనుమతికి లోబడి టెండర్ ఆఫర్ ప్రాతిపదికన ఈ బైబ్యాక్ ఆఫర్ అమలవుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌కల్లా బైబ్యాక్ ప్రణాళికను పూర్తిచేస్తామన్న అంచనాల్ని కంపెనీ అధికారులు ప్రకటించారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు స్వల్ప తగ్గుదలతో రూ. 269 వద్ద ముగిసింది.
సెప్టెంబర్ క్వార్టర్‌కి గైడెన్స్...
ఈ జూన్–సెప్టెంబర్ త్రైమాసికంలో తమ ఐటీ ఆదాయం 1,96.2–200.1 కోట్ల డాలర్ల మధ్య వుండవచ్చని కంపెనీ అంచనాల్లో పేర్కొంది. డాలరు ప్రాతిపాదికన జూన్ త్రైమాసికంలో కంపెనీ ఐటీ సర్వీసుల ఆదాయం 2.1 శాతం పెరుగుదలతో 197.17 కోట్ల డాలర్లుగా నమోదయ్యింది. తాము గతంలో ప్రకటించిన గైడెన్స్ శ్రేణిలో గరిష్టస్థాయి టర్నోవర్‌ను ముగిసిన త్రైమాసికంలో సాధించామని విప్రో సీఈఓ అబిదాలి జడ్ నీమూచ్‌వాలా చెప్పారు.
డిజిటల్ టెక్నాలజీలపై తాము దృష్టి సారిస్తున్నామని, దీనికి తోడు క్లయింట్ మైనింగ్‌పై తాము చేసిన పెట్టుబడులు ఫలితాల్ని ఇస్తున్నాయని, దాంతో ప్రధాన ఖాతాల నుంచి పటిష్టమైన వృద్ధి సాధించినట్లు ఆయన వివరించారు. రూపాయి పెరుగుదల, వేతనాల వృద్ధి వల్ల ఆపరేటింగ్ మార్జిన్లపై ప్రభావం పడినా, మంచి వ్యాపార సమర్థత కనపర్చడం ద్వారా ఆ ప్రతికూలతను కొంతవరకూ అధిగమించామని కంపెనీ సీఎఫ్‌ఓ జితిన్ దలాల్ చెప్పారు. జూన్ త్రైమాసికంలో విప్రో స్థూలంగా 1,309 కొత్త నియామకాల్ని జరపడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,66,790కి చేరింది. షేర్‌హోల్డర్లకు రాబడులనిచ్చే క్రమంలో తాజా బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించినట్లు ఆయన తెలిపారు.