న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు 12 శాతం క్షీణించి రూ. 2,694 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 3,053 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వెనకడుగుతో రూ. 22,205 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 23,229 కోట్ల టర్నోవర్ సాధించింది. ఐటీ సర్విసుల విభాగం 4.5 శాతం తక్కువగా రూ. 22,151 కోట్ల ఆదాయం అందుకుంది.
గైడెన్స్ ఇలా
ఈ ఏడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్విసుల బిజినెస్ 261.5–266.9 కోట్ల డాలర్ల(రూ. 21,845–22,296 కోట్లు) మధ్య టర్నోవర్‌ను సాధించే వీలున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వాటాదారులకు ప్రతీ షేరుకీ రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది.
ఇతర విశేషాలు
♦ ఐటీ సర్వీసుల నిర్వహణ లాభం(ఇబిట్) త్రైమాసికవారీగా 2 శాతం తగ్గి రూ. 3,540 కోట్లుగా నమోదైంది.
♦బీఎఫ్‌ఎస్‌ఐ సర్విసుల విభాగం ఆదాయం 12.1% క్షీణించగా.. కన్జూమర్ 6.9%, తయారీ 9.1% చొప్పున నీరసించాయి. కమ్యూనికేషన్స్ నుంచి మాత్రం 18.8 శాతం జంప్‌చేసింది.
♦ ఆర్డర్ బుక్ 0.2 శాతం బలపడి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వీటిలో భారీ డీల్స్ విలువ 0.9 బిలియన్ డాలర్లు.
♦ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత 6 క్వార్టర్లకల్లా కనిష్టంగా 14.2 శాతంగా నమోదైంది.
♦ డిసెంబర్‌కల్లా 4,473 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,40,234గా నమోదైంది.
ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 465 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment