విప్రో లాభం 14 శాతం డౌన్‌  | Wipro Consolidated September 2018 Net Sales at Rs 14567.90 crores | Sakshi
Sakshi News home page

విప్రో లాభం 14 శాతం డౌన్‌ 

Published Thu, Oct 25 2018 1:00 AM | Last Updated on Thu, Oct 25 2018 1:00 AM

Wipro Consolidated September 2018 Net Sales at Rs 14567.90 crores - Sakshi

న్యూఢిల్లీ/బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 14 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.2,192 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,889 కోట్లకు తగ్గింది. సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 10 శాతం తగ్గింది. అయితే కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.13,423 కోట్ల నుంచి 8 శాతం పెరిగి రూ.14,541 కోట్లకు చేరిందని విప్రో సీఈఓ అబిదాలి జడ్‌  నీముచ్‌వాలా చెప్పారు మొత్తం ఆదాయంలో అధిక వాటా ఉన్న ఐటీ సర్వీస్‌ల ఆదాయం రూ.14,380 కోట్లుగా ఉందని, ఐటీ ఉత్పత్తుల సెగ్మెంట్‌ ఆదాయం రూ.260 కోట్లకు మించిందని వివరించారు.  

డిజిటల్‌ విభాగం 13 శాతం అప్‌ 
అక్టోబర్‌–డిసెంబర్‌ క్వార్టర్‌లో ఐటీ సర్వీస్‌ల ఆదాయం 202 కోట్ల డాలర్ల నుంచి 206 కోట్ల డాలర్ల రేంజ్‌లో ఉండొచ్చన్న గైడెన్స్‌ను కంపెనీ వెల్లడించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఇది 1–3 శాతం వృద్ధి అని అబిదాలి పేర్కొన్నారు.  ఒక కీలకమైన క్లయింట్‌తో వివాద పరిష్కార నిమిత్తం రూ.514 కోట్ల నష్టాలు వచ్చాయని, దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఐటీ సర్వీస్‌ల మార్జిన్‌ 18.1 శాతంగా ఉందని వివరించారు.మొత్తం ఆదాయంలో 31 శాతం వాటా ఉన్న డిజిటల్‌ వ్యాపారం సీక్వెన్షియల్‌గా చూస్తే, 13 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు.

అతి పెద్ద డీల్‌ సాధించాం... 
ఆదాయం, మార్జిన్ల పరంగా చూస్తే ఇది మరో పటిష్టమైన క్వార్టరని  అబిదాలి జడ్‌  నీముచ్‌వాలా చెప్పారు. తమ నాలుగు వ్యాపార విభాగాలు స్వీక్వెన్షియల్‌గా 4 శాతం వృద్ధి సాధించాయని, కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద డీల్‌ను ఈ క్యూ2లోనే సాధించామని వివరించారు. డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్, ఎంటర్‌ప్రైజ్‌ స్కేల్‌ మోడర్నైజేషన్‌ సర్వీసులకు డిమాండ్‌ జోరుగా ఉందని పేర్కొన్నారు.  

ఆటోమేషన్‌ కీలకం.... 
రానున్న కాలంలో కంపెనీ మార్జిన్లు మరింతగా పెరగడానికి ఆటోమేషన్‌ కీలకం కానున్నదని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జతిన్‌  దలాల్‌ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,75,346కు చేరిందని, అట్రిషన్‌ రేటు(ఉద్యోగుల వలస) 18.3 శాతంగా ఉందని పేర్కొన్నారు.  

అదనపు డైరెక్టర్‌గా ఎస్‌బీఐ అరుంధతి
అదనపు డైరెక్టర్‌గా అరుంధతీ భట్టాచార్యను (ఎస్‌బీఐ మాజీ చీఫ్‌) డైరెక్టర్ల బోర్డ్‌ నియమించిందని విప్రో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ హోదాలో ఆమె ఐదేళ్ల పాటు కొనసాగుతారని పేర్కొంది. ఈ నియామకానికి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని వివరించింది.   మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో విప్రో షేర్‌ ఫ్లాట్‌గా రూ.309 వద్ద ముగిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement