న్యూఢిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. కంపెనీ గతేడాది నాలుగో త్రైమాసికంలో (2017–18, క్యూ4) కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,801 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలోని లాభం రూ.2,267 కోట్లతో పోలిస్తే 20 శాతం క్షీణించింది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం 5 శాతం తగ్గుదలతో రూ.15,045 కోట్ల నుంచి రూ.14,305 కోట్లకు పడిపోయింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ4లో విప్రో రూ.2,119 కోట్ల లాభాన్ని రూ.14,007 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. కాగా, దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాలతో మెప్పించిన సంగతి తెలిసిందే.
సీక్వెన్షియల్‌గా 7 శాతం తగ్గుదల...
గతేడాది మూడో త్రైమాసికంలో (క్యూ3) ఆర్జించిన నికర లాభం రూ.1,930 కోట్లతో పోలిస్తే క్యూ4లో సీక్వెన్షియల్‌గా లాభం 6.7 శాతం తగ్గింది. క్యూ3 ఆదాయం రూ.14,297 కోట్లతో పోలిస్తే క్యూ4లో 0.7 శాతం పెరిగింది. ఇక డాలర్ల రూపంలో ఐటీ సేవల ఆదాయం సీక్వెన్షియల్‌గా 2.4 శాతం వృద్ధితో 2,062 మిలియన్‌లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 1.1 శాతం వృద్ధి చెందింది. కంపెనీ క్యూ4 డాలర్ ఆదాయం 2,030–2,070 మిలియన్లు ఉండొచ్చని అంచనా వేసింది. ఎబిటా మార్జిన్ 40 బేసిస్ పాయింట్లు తగ్గుదలతో 14.4 శాతానికి పరిమితమైంది.
పూర్తి ఏడాదికి చూస్తే...
గడిచిన ఆర్థిక సంవత్సరం(2017–18) పూర్తి కాలానికి విప్రో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.8,003 కోట్లుగా నమోదైంది. 2016–17లో నికర లాభం రూ.8,518 కోట్లతో పోలిస్తే 6 శాతం తగ్గింది. మొత్తం ఆదాయం కూడా 1.7 శాతం తగ్గుదలతో రూ.58,071 కోట్ల నుంచి రూ.57,036 కోట్లకు చేరింది.
గైడెన్స్ తగ్గింపు...
2018–19 తొలి త్రైమాసికంలో ఐటీ సేవలకు సంబంధించి డాలర్ ఆదాయం 2,015– 2,065 మిలియన్లుగా ఉండొచ్చని కంపెనీ అంచనా (గైడెన్స్) వేసింది. గతేడాది క్యూ4 గైడెన్స్ కంటే ఇది తక్కువ. తమ హోస్టెడ్ డేటా సెంటర్ వ్యాపారాన్ని ఎన్‌సోనో అనే సంస్థకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని... ఇది జూన్ కల్లా పూర్తికావచ్చని కంపెనీ పేర్కొంది. ఈ డీల్ విలువ 40.5 కోట్ల డాలర్లు. ఈ నేపథ్యంలో క్యూ1 ఆదాయ అంచనాలను తదుపరి సవరించనున్నామని కంపెనీ పేర్కొంది.
బుధవారం బీఎస్‌ఈలో విప్రో షేరు ధర స్వల్ప లాభంతో రూ.287 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.
క్లయింట్ల దివాలా ప్రభావం
క్లయింట్లు దివాలా తీసిన ప్రభావం కంపెనీ ఆదాయాలపై పడుతోందని విప్రో పేర్కొంది. ఇద్దరు పెద్ద క్లయింట్ల దివాలా కారణంగా దాదాపు రూ.1,437 కోట్ల మేర ఆదాయాన్ని క్యూ4లో కోల్పోయినట్లు తెలిపింది. 2017–18 పూర్తి ఏడాదికి ఈ మొత్తం రూ.4,612 కోట్లుగా పేర్కొంది. భారత్‌కు చెందిన ఒక టెలికం కంపెనీ (ఎయిర్‌సెల్‌గా భావిస్తున్నారు) దివాలా పిటిషన్ దాఖలు చేయడంతో క్యూ4 కన్సాలిడేటెడ్ ఆదాయంలో 65–75 బేసిస్ పాయింట్ల మేర లాభాలు తగ్గాయని వెల్లడించింది. టెలికం వ్యాపారంలో ప్రతికూలతలు కొనసాగవచ్చని విప్రో సీఈఓ అబిదాలి నీముచ్‌వాలా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి మళ్లీ వృద్ధి బాటలోకి రాగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్జిన్లు మెరుగుపడతాయని సీఎఫ్‌ఓ జతిన్ దలాల్ వ్యాఖ్యానించారు. కాగా, తమ పూర్తిస్థాయి అనుబంధ సంస్థలైన విప్రో టెక్నాలజీస్ ఆస్ట్రియా, విప్రో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆస్ట్రియా, న్యూలాజిక్ టెక్నాలజీస్, అపిరియో ఇండియా క్లౌడ్ సొల్యూషన్స్‌ను విప్రో లిమిటెడ్‌లో విలీనం చేసే ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు కంపెనీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment