న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ సేవల దిగ్గజం విప్రో నికర లాభం సుమారు 31.8 శాతం ఎగిసి రూ.2,544.5 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.1,930.1 కోట్లు. మరోవైపు, కంపెనీ ఆదాయం రూ. 10 శాతం వృద్ధితో రూ.13,669 కోట్ల నుంచి రూ.15,059.5 కోట్లకు చేరింది. క్యూ3 ఫలితాల వెల్లడి సందర్భంగా రూ. 2 ముఖ విలువ గల షేరు ఒక్కో దానికి రూ.1 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకోసం జనవరి 30 రికార్డు తేదీగా ఉంటుందని పేర్కొంది. ‘క్లయింట్లతో పటిష్టమైన సంబంధాలు, వ్యూహాత్మక పెట్టుబడులు, కార్యకలాపాల ఆధునికీకరణపై క్లయింట్లు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తుండటం తదితర అంశాలు మెరుగైన పనితీరు కనపర్చేందుకు దోహదపడ్డాయి‘ అని విప్రో సీఈవో, ఈడీ ఆబిదాలి నీముచ్‌వాలా తెలిపారు.
ఐటీ ఆదాయం 1.8% వృద్ధి..
కీలకమైన ఐటీ సర్వీసుల విభాగం ఆదాయాలు త్రైమాసికాల వారీగా (సీక్వెన్షియల్) చూస్తే 1.8 శాతం వృద్ధితో రూ. 2,046.5 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 14,555 కోట్లు) నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో డాలర్ల మారకంలో చూస్తే ఐటీ సేవల వ్యాపార విభాగం ఆదాయాలు సీక్వెన్షియల్ ప్రాతిపదికన సుమారు 2 శాతం వృద్ధి సాధించవచ్చని విప్రో అంచనా వేస్తోంది. ఇది 2,047 మిలియన్ డాలర్ల నుంచి 2,088 మిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని తెలిపింది.
మూడుకు ఒకటి బోనస్..
ప్రతి మూడు షేర్లకు ఒకటి చొప్పున బోనస్ షేర్లు జారీ చేయనున్నట్లు విప్రో తెలిపింది. అటు అమెరికన్ డిపాజిటరీ రిసీట్ ఏడీఆర్‌లకు కూడా ఇదే నిష్పత్తిలో బోనస్ షేర్ల కేటాయింపు ఉంటుందని వివరించింది. ఇందుకు సంబంధించిన రికార్డు తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు విప్రో పేర్కొంది. గతంలో 2017 ఏప్రిల్‌లో విప్రో 1:1 నిష్పత్తిలో బోనస్ ఇష్యూ చేపట్టింది. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ. 46,848 కోట్ల మేర మిగులు నిధులు ఉన్నాయని విప్రో పేర్కొంది. కొత్తగా రూ.2 ముఖవిలువ గల 700 కోట్ల షేర్లను జారీ చేయడం ద్వారా ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్‌ను రూ. 1,126.5 కోట్ల నుంచి రూ. 2,526.5 కోట్లకు పెంచుకున్నట్లు తెలిపింది. శుక్రవారం బీఎస్‌ఈలో విప్రో షేరు సుమారు 3 శాతం పెరిగి రూ. 346.20 వద్ద క్లోజయ్యింది.
లాభం భేష్.. బోనస్ జోష్!
Published Sat, Jan 19 2019 12:40 AM | Last Updated on Sat, Jan 19 2019 12:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment