సాక్షి, హైదరాబాద్: డూప్లెక్స్, ఫ్లాట్లలో పడక గదులకు ఫాల్స్ సీలింగ్‌తో అలంకరణ అధికమవుతుంది. ఇది మీ అభిరుచులకు అద్దం పట్టాలంటే మాత్రం సీలింగ్ డిజైన్‌తో పాటు సరైన రంగులను ఎంచుకోవాలి. ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. చక్కటి డిజైన్, సరైన రంగుల కలయికతో ఆశించిన రూపాన్ని ఆవిష్కరింపజేసుకోవచ్చు. దీంతో మనసును ఆకట్టుకునే సీలింగ్‌ను ఏర్పాటు చేసుకోవడమే కాదు పైకప్పు విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. పైకప్పునకు మృదువైన వర్ణాలు వేస్తే ఆ రూపం ఆనందమయం చేస్తుంది.
♦ మిగతా గదులతో పోలిస్తే పడక గది సీలింగ్‌నే ఎక్కువ సేపు చూస్తాం. కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దం పట్టేవి ఎంచుకోండి. ఇది మీ మనసులోని భావాలకు ప్రతీకగా ఉండాలి.
♦ మధ్యస్తం, డార్క్ బ్రౌన్ రంగులు పడక గదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి.
♦ బిగీస్, బ్రౌన్స్, టాన్స్ వాడండి. ఇవి పుడమి రూపాన్ని తలపిస్తాయి. కొండలు, రాళ్లు, మట్టి రూపాల్ని ప్రతిబింబిస్తాయి. ఆకుపచ్చ, బ్రౌన్ మిశ్రమం పడక గదిని అద్భుతంగా మారుస్తుంది. గదిలో ఆత్మీయత భావాన్ని కలిగిస్తుంది. ఆకుపచ్చలో సరైన షేడ్లను ఎంచుకోవాలి. ఎందుకంటే కొన్ని షేడ్లు రంగు స్థాయిని తగ్గిస్తాయి.
వర్ణాల ఎంపికలో..
♦ గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ.. విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయం కలుగుతుంది.
♦ తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే.. మోనో క్రోమోటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడక గది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది.
♦ పైకప్పునకు తెలుపు రంగు కూడా వేసుకోవచ్చు. కానీ, అది సంప్రదాయ పద్ధతి. నేటి పోకడలకు అద్దం పట్టదని గుర్తుంచుకోండి. గోడలకు, సీలింగ్‌కు ఒకే రకమైన రంగులు కాకుండా.. వేర్వేరు రంగుల్ని ఎంచుకోవాలి. దగ్గర దగ్గర రంగులు కాకుండా చూడగానే ఇట్టే తేడా కనిపించే రంగుల్ని ఎంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment