Duplex house
-
డూప్లెక్స్ ‘ఇందిరమ్మ’!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లలో ఈసారి డూప్లెక్స్ తరహా నిర్మాణాలు దర్శనమిస్తాయా? పేద వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి ఆధారంగా ప్ర భుత్వం ఆ దిశగా యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. దిగువ అంతస్తులో కొన్ని గదులు, పై అంతస్తులో కొన్ని గదులు నిర్మించటం దీని ఉద్దేశం. కాదంటే పెద్ద సంఖ్యలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు చేజారే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం 400 చదరపు అడుగుల్లో... గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు చిన్నవిగా ఉండటంతో ఈసారి విశాలమైనవి సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. ప్రతి ఇంట్లో కచ్చితంగా వంటగది, టాయిలెట్ నిర్మించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇవికాకుండా మరో రెండు గదులు ఉండాలని పేర్కొంది. దీని ప్రకారం ఇల్లు సమకూరాలంటే కనీసం 400 చదరపు అడుగులకు తగ్గకుండా నిర్మించాల్సి ఉంటుంది. అందుకు 60 గజాల వరకు స్థలం అవసరం. కానీ, చాలామంది నిరుపేదలకు అంతమేర స్థలం లేదు. 30 గజాలలోపు స్థలం ఉన్నవారు ఎందరో. అందులో నిర్మించాలంటే, నిబంధనల ప్రకారం ఖరారు చేసిన విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం అసాధ్యం. ఇరుకు ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. అందుకు నిర్ధారిత యూనిట్ కాస్ట్ రూ.5 లక్షల కంటే తక్కువ మొత్తం విడుదల చేయాల్సి ఉంటుంది. ఇది తమ హామీకి విరుద్ధంగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం రూ.5 లక్షలు కచ్చితంగా అందించాలంటోంది. అంత మొత్తంతో ఇంటిని నిర్మించాలంటే 60 గజాల స్థలం ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో తక్కువ స్థలం ఉన్న నిరుపేదల్లో ఆందోళన మొదలైంది. తమకున్న చిన్న స్థలంలో నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించాలంటే కచ్చితంగా డూప్లెక్స్ తరహాలో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పడక గదులను పైన నిర్మించుకుని, వంటిల్లు, హాలు, మరుగుదొడ్డిని దిగువ అంతస్తుల్లో నిర్మించాలి. ఈ నమూనాకు ఆమోదం తెలపాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్:పాన్-ఇండియా స్టార్ సమంతా రూత్ ప్రభు కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన సమాచారం ఇపుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మీడియా నివేదికల ప్రకారం, 13వ అంతస్తులో కొనుగోలు చేసిన ఇల్లు 3,920 చదరపు అడుగులతో 7,944 చదరపు అడుగుల సూపర్ బిల్ట్-అప్ ఏరియా , 14వ అంతస్తులో 4,024 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్యూప్లెక్స్ ఏరియాతో ఉంది. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన సమంతా తాజాగా అత్యంత ఖరీదైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ (డ్యూప్లెక్స్) కొత్తగా సామ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో జయభేరి కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో ఖరీదైన డూప్లెక్స్ ప్లాట్‌ను తాజాగా సమంత సొంతం చేసుకుంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఆరు పార్కింగ్ స్లాట్లతో జయభేరి ఆరెంజ్ కౌంటీలో 3BHK లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ 13, 14 ఫ్లోర్లలో ఉందని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ నివేదించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.7.8 కోట్లు. ఇటీవల ముంబైలో రూ. 15 కోట్ల విలువైన రాజభవన అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతోపాటు జూబ్లీహిల్స్‌లో 100 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కూడా ఉందట. దీంతో ఆమె నికర విలువ రూ. 89 కోట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంతా రీసెంట్గా గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మైథలాజికల్ డ్రామా `శాకుంతలం`తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.కాళిదాసు నాటకం ఆధారంగా, శకుంతల, పెరూ రాజవంశం రాజు దుష్యంత్‌ల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ కూడా నటించారు.భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.11 కోట్లు మాత్రమే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తమిళ, మలయాళ, కన్నడ. హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న విడుదల కానుంది. మరోవైపు విజయ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా మంగళవారం రిలీజైన ఈ మూవీలో ఫస్ట్ సింగిల్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
న్యూయార్క్ అపార్ట్మెంట్లో అగ్నికీలలు
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రోన్స్ ప్రాంతంలోని 19 అంతస్తుల భవంతిలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు మంటలు వ్యాపించడం మొదలైంది. భారీ స్థాయిలో మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ వేగంగా విస్తరించడంతో వాటిల్లో చిక్కుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. ఆఫ్రికాలోని గాంబియా నుంచి వలస వచ్చిన ముస్లిం కుటుంబాలు ఆ డూప్లెక్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ట్వీట్ చేశారు. దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని ఆయన చెప్పారు. ఒక బెడ్రూమ్లోని ‘గదిని వేడిగా ఉంచే ఎలక్ట్రిక్ హీటర్’ నుంచి మంటలు మొదలై గది మొత్తం విస్తరించి, తర్వాత అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయని న్యూయార్క్ అగ్నిమాపక విభాగం కమిషనర్ డేనియల్ నీగ్రో వివరించారు. బిల్డింగ్‌లోని ప్రతీ ఫ్లోర్‌లోని మెట్ల వద్ద అపార్ట్మెంట్ వాసులు విగతజీవులై కనిపించారని ఆయన తెలిపారు. విపరీతంగా కమ్మేసిన పొగకు ఊపిరాడక, గుండె ఆగిపోవడంతో కొందరు మరణించారని కమిషనర్ వెల్లడించారు. 32 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. -
వామ్మో! రూ.72 కోట్లకు అమ్ముడైన డూప్లెక్స్ అపార్ట్మెంట్! మోస్ట్ కాస్ట్లీ డీల్
విలాసవంతమైన విల్లాలు, ఫార్మ్హౌజ్ల అమ్మకాలు కొనుగోళ్లు జరిగినప్పుడు కోట్లలో బేరం జరుగుతూ ఉంటుంది. కానీ చాలా రోజుల తర్వాత రియల్టీ రంగంలో ఒక డూప్లెక్స్ అపార్ట్మెంట్కి సంబంధించి కాస్ట్లీ డీల్ జరిగింది. ఇప్పటి వరకు వార్తల్లోకి ఎక్కిన డీల్స్‌లో ఇదే మోస్ట్కాస్ట్లీ అనే ప్రచారం జరుగుతోంది. ఎక్కడంటే వ్యాపారవేత్తలు, ఎంట్రప్యూపర్లు, బాలీవుడ్ స్టార్స్, క్రికెట్ ఐకాన్లు ఎక్కువగా నివసించే ముంబై నగరంలో దేశంలోనే డూప్లెక్స్ అపార్ట్మెంట్కి సంబంధించి కాస్ట్లీ డీల్ జరిగింది. దక్షిణ ముంబైలోని 33 సౌత్‌లో పెద్దార్రోడ్డులో ఇటీవల నిర్మాణ జరుపుకున్న ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో డూప్లెక్స్ ప్లాట్ ఏకంగా రూ. 72 కోట్ల రూపాయలు వెచ్చించి రచనా జైన్ కొనుగోలు చేశారు. ఈ డీల్‌లో భాగంగా స్టాంప్డ్యూటీగా 2.88 కోట్లు పన్ను చెల్లించారని ఎకానమిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఎవరీ రచనా జైన్ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 కోఫౌండర్ హర్ష్ జైన్ సతీమణి రచనా జైన్ పేరు మీద ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ రిజిస్టరయ్యింది. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఈ డూప్లెక్స్‌లో తమ అభిరచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముంబై కార్పోరేషన్ నుంచి అనుమతులు కూడా తెచ్చుకున్నారు. యూనికార్న్‌గా డ్రీమ్ 11 స్టార్టప్ కంపెనీగా మొదలైన డ్రీమ్ 11 అనతి కాలంలోనే యూనికార్న్ కంపెనీగా మారింది. ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ కంపెనీ విలువ 8 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు రచన జైన్ డెంటిస్ట్‌గా ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. వీరికి క్రిష్ అనే కొడుకు ఉన్నాడు. చదరపు అడుగు ధర లక్ష జేఎస్‌డబ్ల్యూ, బోజ్వనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ప్రీమియం అపార్ట్మెంట్లో 29,30వ ఫ్లోర్లలో 7,375 చదరపు అడుగుల్లో విస్తరించిన అపార్ట్మెంట్ రికార్డు స్థాయి ధరకు అమ్ముడైంది. సగటున చదరపు అడుగుకి లక్ష రూపాయల ధర పలికింది. ఈ కాస్ట్ డూప్లెక్స్ డీల్‌గా భాగంగా పార్కింగ్ ప్లేస్‌లో ఏడు కార్లు నిలుపుకోవచ్చు. చదవండి:సూపర్‌స్టార్ మహేశ్.. హైదరాబాద్‌లో ప్లాటు కొనుగోలు.. ఎక్కడంటే ? -
ముంబైలో మరో కాస్ట్లీ ఇంటిని కొన్న అమితాబ్ బచ్చన్!
ముంబై : బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ముంబైలో మరో ఖరీధైన ఇంటికి కొనుగోలు చేసినట్లు ఓ వార్త బీటౌన్‌లో చక్కర్లు కొడుతుంది. 31 కోట్ల విలువైన ఈ ఇంటికి సంబంధించి 2020లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపు 27-28 అంతస్థులు కలిగిన ఈ డూప్లెక్ ఇంటిని ప్రముఖ వాణిజ్య సంస్థ టైర్ -2 బిల్డర్ క్రిస్టల్ గ్రూప్ నుంచి బిగ్‌బి ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 5,184 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో విలాసవంతంగా ఈ ఇంటి నిర్మాణం ఉందని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఆరు కార్ల పార్కింగ్ కెపాసిటీతో పాటు అనేక సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని అంథేరి సబర్భన్‌లో అట్లాంటిక్ ఏరియాలో ఈ ఇళ్లు ఉందని తెలుస్తోంది. కాగా ఇదే అపార్ట్మెంట్లో ఇదివరకే బాలీవుడ్ ప్రముఖులు సన్నీలియోన్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఫ్లాట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 16 కోట్లతో సన్నీలియోన్ ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయగా, డైరెక్టర్ ఆనంద్ రాయ్ 25 కోట్లతో మరో అపార్ట్‌మెంట్‌ను తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం అదే ప్రాంతంలో బిగ్‌బి కూడా ఇంటిని కొనుగోలు చేశారు. ఇప్పటికే ముంబైలో ఆయనకు ఐదు ఖరీధైన ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జుహులో నివాసం ఉంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్‌బి చెహ్ర్, జుండ్, మేడే, గుడ్ బై చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు. రణ్‌బీర్, ఆలియా, నాగార్జునతో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి : ఆఫీసు జలమయం, సిబ్బందికి తన దుస్తులిచ్చిన బిగ్‌బీ ఇంటి రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద చేశారో తెలిస్తే షాకే! -
ఎంపీల కోసం ముస్తాబవుతున్న ఫ్లాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో కొత్త ఎంపీలు కొలువుతీరనున్న వేళ ఎంపీలకు నూతన ఫ్లాట్లను ప్రభుత్వం సమకూర్చనుంది. దేశ రాజధానిలో అధికారిక నివాసం లేని ఎంపీలకు ఫైవ్‌స్టార్ హోటళ్లలో వసతి అందించడంలో దుబారా అవుతుండటంతో లోక్‌సభ సెక్రటేరియట్ ఖర్చు తగ్గించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని హై సెక్యూరిటీ జోన్ నార్త్ ఎవెన్యూ ప్రాంతంలో ఎంపీలకు అత్యాధునిక వసతులతో ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు అందించేందుకు ఇప్పటివరకూ అన్ని హంగులతో 36 ఫ్లాట్లు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రజా పనుల శాఖ నిర్మించిన ఈ ఫ్లాట్లు అన్ని ఆధునిక సదుపాయాలతో పాటు ఎంపీల అవసరాలకు అనుగుణంగా రూపొందాయి. ఈ డూప్లెక్స్ ఫ్లాట్లు భూకంపాన్ని తట్టుకునే విధంగా, గ్రీన్ బిల్డింగ్ విధానాలను అనుసరిస్తూ నిర్మితమయ్యాయి. ప్రతి అపార్ట్మెంట్లో రెండు ఫోర్లతో పాటు సెంట్రలైజ్డ్ ఏసీ, చిన్నపాటి దేవాలయం, సర్వెంట్ రూమ్, బేస్మెంట్ పార్కింగ్, ఎటాచ్డ్ వాష్‌రూమ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ బిల్లును తగ్గించేందుకు ఫ్లాట్స్‌పై సోలార్ ప్యానెల్స్, సెన్సర్ లైట్లు అమర్చారు. ఇక 300 మంది ఎంపీల కోసం నిర్మిస్తున్న ఈ ఫ్లాట్లు అన్నీ సిద్ధమయ్యేవరకూ మరికొందరు ఎంపీలకు ఆయా రాష్ట్రాల అతిధి గృహాలతో పాటు నగరం మధ్యలో పునరుద్ధరించిన వెస్ర్టన్ కోర్టులోనూ వసతి కల్పించాలని లోక్‌సభ సెక్రటేరియట్ భావిస్తోంది. -
వన్నెవెన్నెల పైకప్పు
సాక్షి, హైదరాబాద్: డూప్లెక్స్, ఫ్లాట్లలో పడక గదులకు ఫాల్స్ సీలింగ్‌తో అలంకరణ అధికమవుతుంది. ఇది మీ అభిరుచులకు అద్దం పట్టాలంటే మాత్రం సీలింగ్ డిజైన్‌తో పాటు సరైన రంగులను ఎంచుకోవాలి. ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. చక్కటి డిజైన్, సరైన రంగుల కలయికతో ఆశించిన రూపాన్ని ఆవిష్కరింపజేసుకోవచ్చు. దీంతో మనసును ఆకట్టుకునే సీలింగ్‌ను ఏర్పాటు చేసుకోవడమే కాదు పైకప్పు విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. పైకప్పునకు మృదువైన వర్ణాలు వేస్తే ఆ రూపం ఆనందమయం చేస్తుంది. ♦ మిగతా గదులతో పోలిస్తే పడక గది సీలింగ్‌నే ఎక్కువ సేపు చూస్తాం. కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దం పట్టేవి ఎంచుకోండి. ఇది మీ మనసులోని భావాలకు ప్రతీకగా ఉండాలి. ♦ మధ్యస్తం, డార్క్ బ్రౌన్ రంగులు పడక గదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి. ♦ బిగీస్, బ్రౌన్స్, టాన్స్ వాడండి. ఇవి పుడమి రూపాన్ని తలపిస్తాయి. కొండలు, రాళ్లు, మట్టి రూపాల్ని ప్రతిబింబిస్తాయి. ఆకుపచ్చ, బ్రౌన్ మిశ్రమం పడక గదిని అద్భుతంగా మారుస్తుంది. గదిలో ఆత్మీయత భావాన్ని కలిగిస్తుంది. ఆకుపచ్చలో సరైన షేడ్లను ఎంచుకోవాలి. ఎందుకంటే కొన్ని షేడ్లు రంగు స్థాయిని తగ్గిస్తాయి. వర్ణాల ఎంపికలో.. ♦ గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ.. విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. ♦ తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే.. మోనో క్రోమోటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడక గది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. ♦ పైకప్పునకు తెలుపు రంగు కూడా వేసుకోవచ్చు. కానీ, అది సంప్రదాయ పద్ధతి. నేటి పోకడలకు అద్దం పట్టదని గుర్తుంచుకోండి. గోడలకు, సీలింగ్‌కు ఒకే రకమైన రంగులు కాకుండా.. వేర్వేరు రంగుల్ని ఎంచుకోవాలి. దగ్గర దగ్గర రంగులు కాకుండా చూడగానే ఇట్టే తేడా కనిపించే రంగుల్ని ఎంచుకోవాలి. -
రూ.55 లక్షలకే విల్లా!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో విల్లా కొనాలంటే మామూలు విషయం కాదు. కనీసం రూ.80 లక్షలు లేనిదే మధ్యతరగతి ప్రజలు కొనలేం. ఇక, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అయితే ఇంకాస్త ఎక్కువ కావాల్సిందే! కానీ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిలోని ఘట్కేసర్లో కేవ లం రూ.55 లక్షలకే డూప్లెక్స్ విల్లాను అందిస్తోంది సుచిరిండియా. దసరా నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామంటున్నారు సుచి రిండియా గ్రూప్ సీఈఓ డాక్టర్ వై కిరణ్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ♦ ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలోని యమ్నంపేటలో 7 ఎకరాల్లో ఒడిస్సీ విల్లా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మొత్తం 99 డూప్లెక్స్ విల్లాలుంటాయి. ఒక్కో విల్లా 133 గజాల్లో 1,400 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉంటుంది. ప్రారంభ ధర రూ.55 లక్షలు. రహేజా ఐటీ పార్క్, ఇన్ఫోసిస్ క్యాంపస్‌లకు 10 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్. టింబర్లీఫ్లో స్పానిష్ విల్లాలు.. బెంగళూరు జాతీయ రహదారిలో టింబర్‌లీఫ్ పేరిట మరో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 25 ఎకరాల్లో 123 విల్లాలుంటాయి. ఒక్కో విల్లా 330 గజాల్లో 3,800 బిల్టప్ ఏరియాలో ఉంటుంది. ధర రూ.1.85 కోట్ల నుంచి ప్రారంభం. ♦ యూరోపియన్ స్టయిల్లో స్పానిష్ ఆర్కిటెక్చర్‌తో ఉండటమే వీటి ప్రత్యేకత. గేటెడ్ కమ్యూనిటీలా కాకుండా రిసార్ట్‌లో ఉన్న అనుభూతి కలిగేలా ప్రాజెక్ట్‌లో 101 రకాల వసతులను అభివృద్ధి చేస్తున్నాం. 70 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్‌తో పాటూ స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, వాలీబాల్ కోర్ట్, వాక్ వే, జాగింగ్ ట్రాక్స్, గార్డెన్, అంపి థియేటర్ వంటివెన్నో ఉంటాయి. ♦ 80% నిర్మాణ పనులు పూర్తయ్యా యి. 5 నెలల క్రితం నుంచే గృహ ప్రవే శాలు మొదలయ్యాయి. కొన్ని కుటుంబాలు నివాసముంటున్నాయి కూడా. దసరా నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. రూ.30 లక్షలకే ఫ్లాట్! మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో వినూత్న ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. శంషా బాద్‌లోని సాతం రాయ్‌లో 7 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయిం చాం. స్థల సమీకరణ పూర్తయింది. ప్లాన్లు, అనుమతులు వచ్చాక నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. మొత్తం 6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో 750 ఫ్లాట్లుంటాయి. 800 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1,000 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే యూనిట్లుంటాయి. ఆర్యవర్తనగరి, ఓయ్స్టర్ బ్లూ.. ♦ త్వరలోనే సుచిరిండియా నుంచి రెండు లే అవుట్ వెంచర్లను కూడా ప్రారంభించనున్నాం. హకీంపేట్ రోడ్‌లోని తూంకుంటలో ఆర్యవర్తనగరి పేరిట 86 ఎకరాలను అభివృద్ధి చేయనున్నాం. 200 గజాల నుంచి 1,000 గజాల మధ్య మొత్తం 800 ఓపెన్ ప్లాట్లుంటాయి. ♦ ఆర్యవర్తనగరి ప్రత్యేకత ఏంటంటే.. ముఖ ద్వారం నుంచి మొదలు పెడితే ప్రాజెక్ట్‌లోని వసతులు, క్లబ్ హౌస్, ఇతరత్రా ఏర్పాట్లు అన్నీ రాజుల కాలాన్ని గుర్తు చేసేలా ఉంటుంది. అంటే భారీ ఏనుగు విగ్రహాలు, రాజుల చిత్ర పటాలు వంటివి ఏర్పాటు చేస్తాం. దక్షిణ, ఉత్తరాది సమ్మిళిత ఆర్కిటెక్చర్ ఉంటుంది. ♦ ఘట్కేసర్ బోగారంలోని హోలీమేరీ కళాశాలను ఆనుకొని ఓయ్స్టర్ బ్లూ పేరిట 50 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. హెచ్ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్లో 166 గజాల నుంచి 7 వేల గజాల వరకు మొత్తం 600 ఓపెన్ ప్లాట్లుంటాయి. -
కేజ్రీవాల్ కేరాఫ్ డూప్లెక్స్
అధికారిక నివాసం స్వీకరించిన ‘సామాన్యుడు’ ఐదేసి బెడ్రూంల రెండు డూప్లెక్స్లలోకి త్వరలో మకాం మార్పు ఒకటి నివాసానికి, మరొకటి క్యాంపు ఆఫీసు కోసం... ఇళ్ల మొత్తం విస్తీర్ణం సుమారు 9 వేల చదరపు అడుగులు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా రూటుమార్చారు. వీఐపీ సంస్కృతికి దూరమంటూ ఇప్పటివరకూ జెడ్ కేటగిరీ భద్రతను, కాన్వాయ్‌ను, ప్రభుత్వ బంగ్లాను తోసిపుచ్చి ఘజియాబాద్‌లోని కౌశాంబీలో ఉన్న ఫ్లాట్ నుంచే ఆఫీసుకు వస్తున్న కేజ్రీవాల్ తాజాగా తన మకాంను ఐదు బెడ్రూంల డూప్లెక్స్‌లోకి మార్చనున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని భగవాన్ దాస్ రోడ్డులో ఐదేసి బెడ్రూంలుగల రెండు డూప్లెక్స్ ఇళ్లను అధికారిక నివాసంగా స్వీకరించేందుకు ఆయన అంగీకరించారు. ఒక డూప్లెక్స్‌ను (ఫ్లాట్ నంబరు 7/6) కుటుంబంతో కలిసి ఉండేందుకు, మరో డూప్లెక్స్ (ఫ్లాట్ నం 7/7)ను తన క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోనున్నారు. మాజీ సీఎం షీలా దీక్షిత్ ఉన్న టైప్-8 ప్రభుత్వ బంగ్లా (3-మోతీలాల్ నెహ్రూ మార్గ్) అంత భారీగా కాకపోయినా ఈ డూప్లెక్స్ ఇళ్లు కూడా పెద్దవే. రెండు డూప్లెక్స్‌ల విస్తీర్ణం సుమారు 6 వేల చదరపు అడుగులు ఉంది. ఇళ్ల ముందున్న లాన్‌ను కూడా కలుపుకుంటే విస్తీర్ణం సుమారు 9 వేల చదరపు అడుగులు ఉంటుంది. ఈ డూప్లెక్స్‌ల ఇళ్ల తాళాలను అధికారులు కేజ్రీవాల్‌కు ఇప్పటికే అందించారు. కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం ఈ ఇళ్లను సందర్శించారు. కేజ్రీవాల్ అవసరానికి తగినట్లుగా ప్రస్తుతం ఈ డూప్లెక్స్లలో పనులు జరుగుతున్నాయి. ఢిల్లీ సెక్రటేరియట్‌తోపాటు కన్నాట్ ప్లేస్‌లోని తన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి చేరువగా ఉండేలా ఈ డూప్లెక్స్‌లను ఎంపిక చేశారు. ఈ ఇళ్లు ఉన్న ప్రాంతం కేజ్రీవాల్ ప్రాతినిధ్యం వహించే న్యూఢిల్లీ పరిధిలోనే ఉంది. వాస్తవానికి ఈ రెండు డూప్లెక్స్‌లను ఢిల్లీ డిస్ట్రిక్ట్ అథారిటీ సభ్యుడు, ప్రిన్సిపల్ కమిషనర్ కోసం కేటాయిస్తూ వస్తున్నారు. షీలా ఇంటితో పోల్చి చూడండి: కేజ్రీవాల్ అధికారిక నివాసం గురించి విలేకరులు కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా ‘నాకు ఐదేసి బెడ్రూంల రెండు ఇళ్లు కేటాయించారు. కావాలంటే కెమెరాలు తీసుకెళ్లి తనిఖీ చేసుకోండి. అలాగే అంతకుముందు సీఎం ఇంటితో పోల్చి చూడండి. నేను ఇప్పటివరకూ నాలుగు బెడ్రూంల ఇంట్లో ఉంటున్నా. ఇప్పుడది ఐదు బెడ్రూంలు అయింది. అంతే తేడా’ అని వ్యాఖ్యానించారు. షీలా దీక్షిత్ ఉంటున్న టైప్-8 బంగ్లా విస్తీర్ణం సుమారు 9,000 చదరపు అడుగులు. ఇందులో బంగ్లాతోపాటు ఆఫీసు కార్యాలయం, సిబ్బంది ఇళ్లు, గ్యారేజీ, తనిఖీల గది ఉన్నాయి. అవినీతి వ్యతిరేక పోరాటాన్ని దేశ రాజధాని నుంచి ఇకపై జాతీయ స్థాయికి విస్తరించనున్నట్లు కేజ్రీవాల్ అన్నారు. ‘ఆప్’ మంత్రులు అధికార వాహనాల్లో రాకపోకలు సాగిస్తుండటంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అధికార వాహనాలను వినియోగించరాదని తానెప్పుడూ చెప్పలేదని, వాహనాలపై ఎర్రబుగ్గలు వాడటంపై మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశానని అన్నారు. ఆప్ మంత్రులకు ఇన్నోవా కార్లు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గట్టెక్కే వరకూ సొంత కార్లలో, మెట్రో రైల్లో, ఆటోరిక్షాలో ప్రయాణించిన ‘ఆప్’ మంత్రులు శుక్రవారం అధికారిక వాహనాలలో (ఇన్నోవా కార్లు) అసెంబ్లీకి వచ్చారు. కేజ్రీవాల్ మినహా ఆరుగురు మంత్రులకు ఈ కార్లను ప్రభుత్వం కేటాయించింది. దీనిపై కేజ్రీవాల్ స్పందన కోరగా తాము ఎర్ర బుగ్గ వాహనాలను వాడబోమని మాత్రమే చెప్పామని... అధికారిక వాహనాలను వాడబోమని చెప్పలేదని వ్యాఖ్యానించారు. పొదుపు అంటే ఇదేనా: బీజేపీ కేజ్రీవాల్ నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అధికారంలోకి వస్తే వీఐపీ సంస్కృతికి తెరదించి పొదుపు చర్యలు పాటిస్తానన్నా కేజ్రీవాల్ మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం కాగానే సభ్యులు ఈ అంశాన్ని లెవనెత్తారు. ఆయన ప్రజలను పెడదోవ పట్టిస్తారని, విద్యుత్, నీటి సరఫరా విషయంలో ప్రజలను భ్రమింపచేశారని ఆరోపించారు. ఈ గుట్టు త్వరలోనే రట్టవుతుందన్నారు. స్పీకర్ ఎన్నికలోనూ ఆప్ సత్తా..: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ శాసనసభ స్పీకర్ ఎన్నికలోనూ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో పార్టీ అభ్యర్థి ఎంఎస్ ధీర్‌కు 37 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జగదీష్ ముఖీ అకాలీదళ్ మద్దతుతో 32 ఓట్లను సొంతం చేసుకున్నారు. ‘ఆప్’లోకి కెప్టెన్ గోపీనాథ్ బెంగళూరు: ఎయిర్ డెక్కన్, డెక్కన్ చార్టర్స్, డెక్కన్ 360 వంటి చౌక విమానయాన సేవల కంపెనీలు స్థాపించిన కెప్టెన్ గోపీనాథ్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలో తాను కూడా పాలుపంచుకున్నానని చెప్పారు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఆప్‌కు అమీర్ ప్రశంసలు సామాన్యుడి పార్టీగా ప్రజల ముందుకు వచ్చి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరేందుకు బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ అడుగులు వేస్తున్నట్లు ఎన్డీటీవీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూను బట్టి తెలుస్తోంది. ఆ కార్యక్రమంలో ఆప్‌ను, అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. రాజకీయాలపై నమ్మకంపోతున్న ప్రస్తుత తరుణంలో ఆప్ ఒక భారీ అలలా వచ్చి మార్పుకు భరోసా ఇచ్చిందన్నారు. ఆ అలలో తాము కూడా సభ్యులు కావాలని చాలామంది కోరుకుంటున్నారని అమీర్ చెప్పారు.