పేదింటి కొత్త నమూనాపై సర్కారు యోచన
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించాలంటే 60 గజాల స్థలం అవసరం
అంత స్థలం లేని పేదల్లో ఆందోళన
వారి కోసం డూప్లెక్స్ తరహా నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లలో ఈసారి డూప్లెక్స్ తరహా నిర్మాణాలు దర్శనమిస్తాయా? పేద వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి ఆధారంగా ప్ర భుత్వం ఆ దిశగా యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. దిగువ అంతస్తులో కొన్ని గదులు, పై అంతస్తులో కొన్ని గదులు నిర్మించటం దీని ఉద్దేశం. కాదంటే పెద్ద సంఖ్యలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు చేజారే పరిస్థితి కనిపిస్తోంది.
కనీసం 400 చదరపు అడుగుల్లో...
గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు చిన్నవిగా ఉండటంతో ఈసారి విశాలమైనవి సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. ప్రతి ఇంట్లో కచ్చితంగా వంటగది, టాయిలెట్ నిర్మించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇవికాకుండా మరో రెండు గదులు ఉండాలని పేర్కొంది. దీని ప్రకారం ఇల్లు సమకూరాలంటే కనీసం 400 చదరపు అడుగులకు తగ్గకుండా నిర్మించాల్సి ఉంటుంది. అందుకు 60 గజాల వరకు స్థలం అవసరం. కానీ, చాలామంది నిరుపేదలకు అంతమేర స్థలం లేదు. 30 గజాలలోపు స్థలం ఉన్నవారు ఎందరో. అందులో నిర్మించాలంటే, నిబంధనల ప్రకారం ఖరారు చేసిన విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం అసాధ్యం. ఇరుకు ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది.
అందుకు నిర్ధారిత యూనిట్ కాస్ట్ రూ.5 లక్షల కంటే తక్కువ మొత్తం విడుదల చేయాల్సి ఉంటుంది. ఇది తమ హామీకి విరుద్ధంగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం రూ.5 లక్షలు కచ్చితంగా అందించాలంటోంది. అంత మొత్తంతో ఇంటిని నిర్మించాలంటే 60 గజాల స్థలం ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో తక్కువ స్థలం ఉన్న నిరుపేదల్లో ఆందోళన మొదలైంది. తమకున్న చిన్న స్థలంలో నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించాలంటే కచ్చితంగా డూప్లెక్స్ తరహాలో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పడక గదులను పైన నిర్మించుకుని, వంటిల్లు, హాలు, మరుగుదొడ్డిని దిగువ అంతస్తుల్లో నిర్మించాలి. ఈ నమూనాకు ఆమోదం తెలపాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment