న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ధరలు అసాధారణంగా పెరిగిపోకుండా కిరీట్ పారిఖ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. లెగసీ క్షేత్రాల నుంచి (నామినేషన్‌పై ప్రభుత్వం కేటాయించిన) ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరలకు కనిష్ట, గరిష్ట పరిమితులను సూచించింది. దీనివల్ల దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం సహజ వాయువులో రెండొంతులపై (పాత క్షేత్రాల నుంచి) కచ్చితమైన ధరల విధానం ఉంటుందని అభిప్రాయపడింది. తయారీ సంస్థలకు ధరలపై స్పష్టత ఉంటుందని పేర్కొంది.
ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా ఈ తరహా క్షేత్రాలను నిర్వహిస్తున్నాయి. కేజీ డీ6 తదితర రిలయన్స్, బీపీ ఇతర సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వాటికి ఈ ధరల పరిమితి వర్తించదు. తాజా సూచనలతో 70 శాతం మేర పెరిగిపోయిన ధరలు కొంత దిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాకు నామినేషన్‌పై ఇచ్చిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు, దిగుమతి చేసుకునే గ్యాస్ ధరనే చెల్లించాలని సిఫారసు చేసింది.
అంతేకానీ, అంతర్జాతీయ ధరలను చెల్లించొద్దని సూచించింది. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ)కు కనీసం 4 డాలర్లు, గరిష్టంగా 6.5 డాలర్ల చొప్పున పరిమితులు సూచించింది. దీనికి ఏటా 0.05 డాలర్లను పెంచుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఎంబీటీయూ ధర 8.57 డాలర్లు ఉంది. లోతైన సముద్ర ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే జోన్లకు ప్రస్తుతం భిన్న రేట్ల విధానం అమల్లో ఉంది. వీటికి సంబంధించి సైతం ఎంబీటీయూ గరిష్ట ధర 12.46 డాలర్లు మించకూడదని పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. ఇక 2026 జనవరి 1 నుంచి ధరలపై ఎలాంటి పరిమితుల్లేని స్వేచ్ఛా విధానాన్ని సూచించింది. (షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!)
ఈ చర్యలు దేశీయ వినియోగదారులపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని కమిటీ వ్యాఖ్యానించింది. అలాగే 2030 నాటికి భారతదేశ ఇంధన మిశ్రమంలో గ్యాస్ వాటాను ప్రస్తుతం ఉన్న 6.4 శాతం నుండి 15 శాతానికి పెంచాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దాని సిఫార్సులు సహాయపడతాయని కూడా నొక్కి చెప్పింది. అలాగే దేశీయంగా వినియోగించే సహజ వాయువులో దాదాపు 50 శాతం దిగుమతి చేసుకుంటున్నారు. (జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం)
Comments
Please login to add a commentAdd a comment