నెలకు 20లక్షల ఫోన్లు విక్రయిస్తాం | Celkon opens phones manufacturing unit in Hyderabad | Sakshi
Sakshi News home page

నెలకు 20లక్షల ఫోన్లు విక్రయిస్తాం

Published Thu, Jun 29 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

నెలకు 20లక్షల ఫోన్లు విక్రయిస్తాం

నెలకు 20లక్షల ఫోన్లు విక్రయిస్తాం

ఏడాదిలో ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం
ఇప్పటిదాకా డిమాండ్‌ ఉన్నా ఉత్పత్తి లేదు
తిరుపతి యూనిట్‌తో ఆ సమస్య తీరిపోయింది
తొలిసారిగా వినూత్న ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు
ఏడాదిలో ఫ్యాబ్‌సిటీ ప్లాంటు; ఆర్‌ అండ్‌ డీ హబ్‌
‘సాక్షి’తో సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా మొబైల్స్‌ తయారీలో ఉన్న సెల్‌కాన్‌... నెలకు 20 లక్షల ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీకి చెందిన మేడ్చల్‌ ప్లాంటులో నెలకు 3 లక్షలు, థర్డ్‌ పార్టీ యూనిట్లలో 2 లక్షల మొబైళ్లను నెలకు తయారు చేస్తున్నారు. ఇటీవలే తిరుపతి ప్లాంటు కూడా అందుబాటులోకి వచ్చింది. అక్కడ ఒక షిఫ్ట్‌లో నెలకు 10 లక్షల మొబైల్స్‌ను తయారుచేస్తుండటంతో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం నెలకు 15 లక్షల యూనిట్లకు చేరింది. కొన్నాళ్లుగా డిమాండ్‌ పెరుగుతున్నా ఉత్పత్తి అందుబాటులో లేక మొబైళ్లను సరఫరా చేయలేకపోయామని సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు చెప్పారు. బుధవారంనాడు ఆయన ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ అంశాలపై గురు ఏమన్నారంటే...

సామర్థ్యం పెరగటంతో కొత్త మార్కెట్లలోకి...
ప్రస్తుతం యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్, నైజీరియా, బోట్స్‌వానా, కెన్యా, జింబాబ్వే వంటి 12 దేశాలకు కంపెనీ మొబైల్స్‌ను ఎగుమతి చేస్తోంది. తయారీ సామర్థ్యం పెరగడంతో భారత్‌లో పూర్తి స్థాయిలో విస్తరించటంతో పాటు కొత్త మార్కెట్లలోకి అడుగు పెట్టేందుకూ సిద్ధమవుతున్నాం.  దక్షిణాఫ్రికాలో బండిల్‌ ఆఫర్‌లో సెల్‌కాన్‌ ఫోన్లను ఆఫర్‌ చేసేందుకు ఎతిసలాత్‌ గ్రూప్‌ నుంచి మాకు ఆర్డరుంది. ఇప్పటికే ఈ టెలికం కంపెనీ పలు మార్కెట్లలో సెల్‌కాన్‌ ఫోన్లను విక్రయించింది కూడా. 20 లక్షల ఫోన్ల అమ్మకం లక్ష్యాన్ని ఏడాదిలో చేరతామనే నమ్మకం మాకుంది.

అన్ని విడిభాగాలు ఇక్కడే...
ప్రస్తుతం పీసీబీ, ఎల్‌సీడీ వంటి ప్రధాన విడిభాగాలను దిగుమతి చేసుకుని అసెంబ్లింగ్, ప్రోగ్రామింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్‌ను దేశీయంగా చేపడుతున్నాం. చార్జర్లు, బ్యాటరీలు, హెడ్‌సెట్లు, స్పీకర్లను పూర్తిగా ఇక్కడే తయారు చేస్తున్నాం. దశలవారీగా ఇతర యాక్సెసరీస్, విడిభాగాల ఉత్పత్తిని కూడా ఇక్కడే చేపట్టాలనుకుంటున్నాం. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌ లక్ష్యానికి అనుగుణంగా మా ప్లాంట్లను తీర్చిదిద్దుతున్నాం. ఇందులో భాగంగానే చైనా, తైవాన్‌కు చెందిన కంపెనీల సహకారంతో పీసీబీ, ఎల్‌సీడీలను ఇక్కడ రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నాం. 2019 నాటికి అన్ని విడిభాగాలను.. అంటే నూరు శాతం దేశీయంగానే తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. మరోవంక వినూత్న ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను డిజైన్‌ చేసేందుకు టెక్నోవేషన్‌ పేరిట ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం.

త్వరలో కొత్త మోడళ్లు: మురళి
టెక్నోవేషన్‌ టీమ్‌ అభివృద్ధి చేసిన క్లిక్, యూనిక్‌ మోడళ్లు త్వరలో మార్కెట్లోకి రానున్నట్లు సెల్‌కాన్‌ ఈడీ మురళి రేతినేని చెప్పారు. ఇప్పటిదాకా ఏ స్మార్ట్‌ఫోన్లోనూ లేని ఫీచర్లు కొన్ని వీటిలో ఉంటాయన్నారు. థర్డ్‌ పార్టీల ద్వారా 650 సర్వీసింగ్‌ కేంద్రాలను నిర్వహిస్తున్నామని, ఈ నెలలోనే ప్రధాన నగరాల్లో 20 సెంటర్లను సొంతంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారాయన. ఎక్స్‌క్లూజివ్‌ కేంద్రాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. ‘‘90% సమస్యలను ఒక్కరోజులోనే పరిష్కరిస్తాం. విడిభాగాలను కంపెనీకి వచ్చిన ధరకే ఇస్తున్నాం. 30 రోజుల్లో ఫోన్‌ రిపేర్‌ కాకపోతే కస్టమర్లు కొత్త ఫోన్‌ పొందొచ్చు. 3 కోట్ల పైచిలుకు కస్టమర్ల కోసం ఇటీవల ఉచిత సర్వీస్‌ క్యాంప్‌ నిర్వహించాం. పాత ఫోన్‌ను మార్చుకున్న వినియోగదార్లకు తక్కువ ధరలో కొత్త మోడళ్లను అందించాం. దీనికి మంచి స్పందన వచ్చింది’’ అని మురళి వివరించారు.

ఫ్యాబ్‌సిటీ యూనిట్‌కు రూ.100 కోట్లు..
హైదరాబాద్‌ ఫ్యాబ్‌సిటీలో మేం ఏర్పాటు చేస్తున్న యూనిట్‌ను ఏడాదిలో పూర్తి చేయాలనుకుంటున్నాం. ఒక్కో షిఫ్టుకు నెలకు 5 లక్షల మొబైళ్లు తయారు చేసే సామర్థ్యం ఈ ప్లాంటు సొంతం. దీనికోసం రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాం. 1,200 మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే గచ్చిబౌలిలో ఆర్‌అండ్‌డీ హబ్‌కు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఎకరం స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వం అనుమతిస్తే 20 అంతస్తుల భవనాన్ని నిర్మించటానికి సిద్ధంగా ఉన్నాం. 2018 చివరినాటికి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. మౌలిక వసతులు, ల్యాబ్‌ కోసం రూ.150 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నాం. ఈ హబ్‌ ద్వారా కొత్తగా 1,000 మందికి ఉద్యోగాలొస్తాయి. 1,500 మంది కూర్చునేలా సీటింగ్‌ సామర్థ్యం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement