
న్యూఢిల్లీ: భారీ కుంభకోణం కేసులో ఇతర బ్యాంకులకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) జరపాల్సిన చెల్లింపుల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పీఎన్‌బీతో పాటు ఇతర బ్యాంకర్లతో కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో భేటీ కానుంది. వజ్రాభరణాల డిజైనర్ నీరవ్ మోదీ సంస్థలకు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్ (ఎల్‌వోయూ) జారీ చేసిన పీఎన్‌బీ రూ. 11,400 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటూ స్కామ్ వెలుగుచూసిన సందర్భంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు పేర్కొంది.
ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు, పీఎన్‌బీకి మధ్య నెలకొన్న చెల్లింపుల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం కేంద్ర ఆర్థిక సేవల విభాగం.. ఈ వివాదంలో ఉన్న బ్యాంకుల అధికారులతో త్వరలో సమావేశం కానున్నట్లు వివరించాయి. ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం పడిన బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, యూనియన్ బ్యాంకు ఉన్నాయి.