న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ లక్ష్యంలో ద్రవ్యోలోటు ఆగస్టు నెలాఖరుకు 96.1 శాతానికి చేరింది. వివరాల్లోకి వెళితే, 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయం–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు లక్ష్యం రూ.5,46,532 కోట్లు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలో 3.2%. దీనర్థం జీడీపీలో ద్రవ్యలోటు 3.2% దాటకూడదన్నమాట (గతేడాది లక్ష్యం 3.5%) అయితే ఆర్థిక సంవత్సరం ఆగస్టు నాటికే ద్రవ్య లోటు రూ.5.25 లక్షల కోట్లకు చేరింది.
అంటే 2017–18 బడ్జెట్ అంచనాల్లో ఇది 96.1% అన్నమాట. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ నిష్పత్తి 76.4%. ఇది ఆందోళనకరమైన అంశమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మున్ముందు పెరిగే రాబడులతో 2017–18 లక్ష్యాలకు అనుగుణంగానే ద్రవ్యలోటు ఉంటుందన్న విశ్వాసాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వృద్ధి లక్ష్యంగా వ్యయాల పెంపునకు ద్రవ్యలోటు లక్ష్యాలను కేంద్రం పెంచవచ్చన్న వార్తలపై కొన్ని వర్గాల్లో ఇప్పటికే ఆందోళన వ్యక్తం అవుతోంది.