3 నెలల కనిష్టానికి తయారీ రంగం: హెచ్‌ఎస్‌బీసీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం వృద్ధి జనవరిలో మూడు నెలల కనిష్ట స్థాయికి తగ్గినట్లు హెచ్‌ఎస్‌బీఐ మార్కెట్ సర్వే ఒకటి వెల్లడించింది. సోమవారం ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన చేసింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆర్డర్లు తగ్గడం దీనికి కారణమని సర్వే తెలిపింది. డిసెంబర్‌లో రెండేళ్ల గరిష్టాన్ని తాకిన ఈ పాయింట్లు మరుసటి నెలలోనే మూడు నెలల కనిష్టానికి తగ్గడం గమనార్హం.
పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం, తయారీ రంగానికి సంబంధించి సూచీ పాయింట్లు డిసెంబర్‌లో 54.5 వద్ద ఉండగా, ఇది 52.9కి పడిపోయింది. అయితే ఈ పాయింట్లు 50కి పైనుంటే వృద్ధికి సంకేతంగా, 50 దిగువకు పడిపోతే, క్షీణతకు చిహ్నంగా భావిస్తారు. ఫిబ్రవరి 3న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో హెచ్‌ఎస్‌బీసీ తాజా సర్వే వివరాలు విడుదల చేసింది.