
బీజింగ్: భారీగా నగదు నిల్వలున్న చైనా ఇన్వెస్టర్లు .. ప్రస్తుతం భారత స్టార్టప్ కంపెనీలకు దన్నుగా నిలుస్తున్నారు. గతేడాది ఏకంగా 2 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 12,900 కోట్లు) దేశీ స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్టా్టర్టప్ ఇండియా అసోసియేషన్ (ఎస్‌ఐఏ), వెంచర్ గురుకుల్‌తో కలిసి భారతీయ ఎంబసీ బీజింగ్‌లో నిర్వహించిన సెమినార్‌లో కేపీఎంజీ ఈ నివేదికను ఆవిష్కరించింది.
‘సాధారణంగానే చైనాకు భారత్ ఆకర్షణీయ పెట్టుబడుల కేంద్రంగా నిలుస్తోంది. 2015 నుంచి మరింత ఆకర్షణీయంగా మారింది. చైనా సంస్థల నుంచి పెట్టుబడులు చెప్పుకోతగ్గ స్థాయిలో గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా స్టార్టప్స్, టెక్నాలజీ సంస్థల్లోకి ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. 2017లో భారతీయ స్టార్టప్స్‌లోకి చైనా నుంచి సుమారు రూ.12,900 కోట్లు (2 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులు వచ్చాయి. కొత్త మార్కెట్లలోకి విస్తరించాలన్న చైనా ఇన్వెస్టర్ల ధోరణులను ఇది ప్రతిబింబిస్తోంది‘ అని నివేదిక పేర్కొంది.
రవాణా, ఫిన్‌టెక్‌లోకి కూడా ..
చైనా పెట్టుబడులు అత్యధికంగా ఆకర్షించిన వాటిల్లో ఈ–కామర్స్ సంస్థలు ఎక్కువగా ఉండగా.. రవాణా, ఫైనాన్షియల్ టెక్నాలజీ మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆలీబాబా, సిట్రిప్, టెన్సెంట్ వంటి దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. చైనా పెట్టుబడులను అందుకున్న వాటిల్లో పేటీఎం, స్నాప్‌డీల్, మీడియా నెట్, మేక్‌మైట్రిప్, హైక్, ప్రాక్టో, డైలీహంట్ వంటి దేశీ స్టార్టప్స్ ఉన్నాయి.
చిన్న సంస్థల్లో పెట్టుబడులకు 200 మిలియన్ డాలర్ల ఫండ్ ..
భారతీయ లఘు, చిన్న, మధ్యతరహా సంస్థల్లో (ఎంఎస్‌ఎంఈ) ఇన్వెస్ట్ చేసేందుకు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) 200 మిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు చేసింది. స్టార్టప్ ఇండియా పేరిట నిర్వహించిన రెండో దపా ఇన్వెస్ట్‌మెంట్ సెమినార్ సందర్భంగా ఆ బ్యాంక్ సీఈవో జెంగ్ బిన్ ఈ విషయం వెల్లడించినట్లు భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. చైనా దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐసీబీసీ 2011లో ముంబైలో తమ శాఖను ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది సెమినార్‌లో 350 పైచిలుకు చైనా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఏంజెల్ ఇన్వెస్టర్స్ మొదలైన వారు పాల్గొన్నారు. భారత్ నుంచి 20 స్టార్టప్ సంస్థలకు చెందిన 42 రెండు మంది భారతీయ ఔత్సాహిక వ్యాపారవేత్తలు దీనికి హాజరైనట్లు భారతీయ ఎంబసీ ఆర్థిక, వాణిజ్య కౌన్సిలర్ ప్రశాంత్ లోఖండే తెలిపారు. గతేడాది నిర్వహించిన సెమినార్‌లో పాల్గొన్న 12 దేశీ సంస్థల్లో నాలుగింటికి 15 మిలియన్ డాలర్ల దాకా ఫండింగ్ లభించినట్లు భారతీయ ఎంబసీ తెలిపింది.. ప్రస్తుత సదస్సులో 7–8 స్టార్టప్స్‌కి 30 మిలియన్ డాలర్ల దాకా పెట్టుబడుల హామీ లభించవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment