జెనీవా: చైనా ప్రభుత్వం మైనార్టీలపై మారణహోమాన్ని సృష్టిస్తోందని గత కొంత కాలంగా అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) స్వరం కలిపింది. ఉగ్రవాద నిర్మూలన పేరుతో పశ్చిమ జిన్ జియాంగ్ ప్రాంతంలో వీగర్లు, ఇతర ముస్లింలను నిర్బంధించి చైనా ప్రభుత్వం హింసకు పాల్పడుతున్న విషయం వాస్తవమేనని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం పేర్కొంది.
నిర్బంధంలోకి తీసుకున్న మైనార్టీలపై కనీస మానవత్వం చూపించకుండా ఘోరమైన నేరాలకు పాల్పడే అవకాశాలను కొట్టి పారేయలేమని యూఎన్ తాజా నివేదిక స్పష్టం చేసింది. చాలా కాలం కిందటే ఈ నివేదిక బయటకు రావాల్సి ఉంది. కానీ చైనా ప్రభుత్వం ఒత్తిడితో ఇన్నాళ్లుగా యూఎన్ తన నివేదికను బయట పెట్టలేదు.
యూఎన్ మానవ హక్కుల చీఫ్ మిషెల్లీ బచెలెట్ బుధవారం నాడు తన పదవీ కాలం ముగియడానికి కేవలం 13 నిముషాల ముందు ఈ నివేదిక బయట పెట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. పశ్చిమ జిన్ జియాంగ్ ప్రాంతంలోని వీగర్లు, ఇతర ముస్లిం మైనార్టీలపై ఐదేళ్లుగా డ్రాగన్ ప్రభుత్వం హింసాకాండకు పాల్పడుతున్నట్టుగా మానవ హక్కుల సంస్థలు, పశ్చిమ దేశాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. 10 లక్షల మంది వీగర్లను నిర్బంధించినట్టుగా వార్తలు వచ్చాయి. యూఎన్ నివేదికను అమెరికా, మరికొన్ని పశ్చిమ శక్తుల కుట్రగా చైనా అభివర్ణించింది.
చదవండి: బ్రిటన్‌లో ప్రచారానికి తెర
Comments
Please login to add a commentAdd a comment