కాకినాడ సెజ్‌లో చైనా కంపెనీల భారీ పెట్టుబడులు
రూ. 3,000 కోట్లతో జీఐఐసీ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు
* జీఐఐసీతో జీఎంఆర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనాకు చెందిన విద్యుత్ ఉపకరణాలు తయారు చేసే గిజూ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్(జీఐఐసీ), జీఎంఆర్‌కు చెందిన కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. చైనాకు చెందిన మూడు తయారీ రంగ సంస్థలు జీఐఐసీ పేరుతో కన్సార్టియంగా ఏర్పడి 2,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు షాంఘైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది.
దీని ప్రకారం తొలుత జీఐఐసీ రూ. 3,000 కోట్లతో (500 మిలియన్ డాలర్లు) విద్యుత్, ఎలక్ట్రానిక్స్, సోలార్, పవన విద్యుత్ తయారీకి చెందిన ఉపకరణాలను తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేయనుంది. చైనా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కాకినాడసెజ్ ప్రెసిడెంట్ చల్లా ప్రశన్న, జీఐఐసీ ప్రతినిధులు సంతకాలు చేశారు.
వచ్చే ఐదేళ్ళలో ఈ పారిశ్రామిక వాడ సుమారు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను (3.5 బిలియన్ డాలర్లు) ఆకర్షించడమే కాకుండా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి కల్పించగలదని జీఎంఆర్ ఇన్‌ఫ్రా బిజినెస్ చైర్మన్ బి.బి. ఎన్ రావు తెలిపారు. జీఎంఆర్ ఇన్‌ఫ్రా కాకినాడ సమీపంలో 10,500 ఎకరాల్లో మల్టీ ప్రోడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.