సిటీ వర్సెస్ శివారు!
♦ మెట్రోతో నగరం..
♦ ఓఆర్‌ఆర్‌తో శివార్ల అభివృద్ధి
♦ జూన్ నుంచి మెట్రో పరుగులు..
♦ సంవత్సరాంతానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఓఆర్‌ఆర్
♦ ఈ ప్రాజెక్ట్‌లతో 30-40 శాతం స్థిరాస్తి ధరల పెంపు
మెట్రో రైలు.. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం!
ఔటర్ రింగ్ రోడ్డు.. భాగ్యనగరాన్ని జిల్లా కేంద్రాలకు కలిపే వారధి!
.. ప్రతిష్టాత్మకమైన ఈ రెండు ప్రాజెక్ట్‌లు ప్రజల అవసరాలు తీర్చేవి మాత్రమే కాదండోయ్.. భాగ్యనగర స్థిరాస్తి రంగానికి ఊత కర్రలా మారాయి. మెట్రో కారిడార్లలో రానున్న షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్‌లు.. ఓఆర్‌ఆర్ చుట్టూ 13 రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాంతాలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడమే ఇందుకు కారణమని నిపుణుల అభిప్రాయం. రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉన్న నగరాల్లో స్థిరాస్తి ధరలు 30 నుంచి 50 శాతం దాకా అధికంగా ఉంటాయని వారంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ ఏడాది జూన్ నుంచి పట్టాలెక్క నున్న మెట్రో.. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఓఆర్‌ఆర్‌తో హైదరాబాద్‌లోనూ ధరలు పెరుగుతాయన్నట్టేగా!
సాక్షి, హైదరాబాద్: కారిడార్ 3లోని నాగోల్-మెట్టుగూడ (8 కి.మీ.), కారిడార్ 1లోని మియాపూర్- సంజీవరెడ్డి నగర్ (12 కి.మీ.) పరిధిలో మొత్తం 20 కి.మీ. మార్గం రెండు దశలను ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న స్థిరాస్తి రంగం కూడా పట్టాలెక్కుతుందని నిపుణుల మాట. ‘‘రవాణా, విద్యా, వైద్యం, వినోద వసతులున్న ప్రాంతాల్లోనే నివాసముండేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. ఈ విషయంలో భాగ్యనగరానికి మణిహారంలా మారాయి మెట్రో, ఓఆర్‌ఆర్. నగరంలో ఏటా 7 నుంచి 10 లక్షల యూనిట్లను అందించే నిర్మాణ సంస్థలు.. మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో వీటి సంఖ్య 15 లక్షలకు పైగానే చేర్చుతారని’’ సుచిరిండియా ఎండీ కిరణ్ కుమార్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.
మార్చి నాటికి 3 మెట్రో మాల్స్: హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో 66 స్టేషన్లు, డిపోలు, దశల వారీగా 12 ప్రాంతాల్లో మెట్రో మాల్స్ రానున్నాయి. మెట్రోకిరువైపులా 300 మీటర్ల స్థలంలో రవాణా ఆధారిత అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 1.85 కోట్ల చ.అ. రిటైల్ స్థలంలో.. తొలిదశలో 60.5 లక్షల చ.అ. మేర నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో ఈ ఏడాది మార్చి నాటికి పంజగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్‌లో మూడు మెట్రో మాల్స్ వినియోగంలోకి రానున్నాయి కూడా. వీటి ద్వారా 10.1. లక్షల చ.అ. వాణిజ్య స్థలం అందుబాటులోకి రానుంది. ఈ మాల్స్‌లో ఆఫీసు స్పేస్, రిటైల్ స్టోర్లు, బహుళ జాతి కంపెనీలు, ఐటీ, బీపీ ఓ, కేపీఓ కంపెనీల కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, హెల్త్‌కేర్ సెంటర్లు, మల్టీప్లెక్స్ ఏర్పాటు కానున్నాయి. 8-10 ఏళ్ల సమయంలో మిగతా ప్రాంతాల్లో మాల్స్ నిర్మాణం పూర్తవుతాయి.
చ.అ. ధర రూ.100-340: నగరంలో మెట్రో మాల్స్ వచ్చే ప్రాంతాలను పరిశీలిస్తే.. హైటెక్ సిటీ ఎదురుగా 2 లక్షల చ.అ., పంజగుట్ట మెట్రో జంక్షన్ వద్ద 4 లక్షల చ.అ., ఎర్రగడ్డ వద్ద 4 లక్షల చ.అ., మూసారాంబాగ్‌లో 4 లక్షల చ.అ., అమీర్‌పేట జంక్షన్‌లో లక్ష చ.అ., బాలానగర్ ట్రక్ పార్క్‌లో 2 లక్షల చ.అ., సికింద్రాబాద్ (పాత జీహెచ్‌ఎంసీ భవనం) వద్ద లక్ష చ.అ., ఎల్బీనగర్ ఓపెన్ స్టేడియం వద్ద 1.5 లక్షల చ.అ., ముషీరాబాద్ పాత గాంధీ ఆసుపత్రి ప్రాంతంలో 10 లక్షల చ.అ., రాయదుర్గం ఐటీ కారిడార్ లో 10 లక్షల చ.అ.ల్లో ఈ మాల్స్ రానున్నాయి. మెట్రో మాల్స్ నిర్మాణానికి చ.అ.కు రూ.4 వేలు వ్యయమవుతుందని అంచనా. చ.అ.కు నెలవారీగా రూ.50-150 మధ్య నెలసరి అద్దె ఉంటుంది. స్టేషన్లలో 100-340 చ.అ. స్థలం వాణిజ్య అవసరాలకు అందుబాటులో ఉంటుంది.
72 కి.మీ. నుంచి 200 కి.మీ. వరకూ: ఢిల్లీలో మొదట 62 కి.మీ. ప్రారంభమైన మెట్రో ఆ తర్వాత 200 కి.మీ.లకు విస్తరించారు. నగరంలోనూ 200 కి.మీ. వరకు విస్తరించాలనేది ప్రభుత్వం ప్ర ణాళిక. విస్తరణ ప్రతిపాదిత ప్రాంతాల్లో.. మియాపూర్-పటాన్ చెరు: 13 కి.మీ., ఎల్బీనగర్- హయత్‌నగర్: 7 కి.మీ., ఎల్బీనగర్-ఫలక్‌నుమా-శంషాబాద్: 28 కి.మీ., తార్నాక-ఈసీఐఎల్: 7 కి. మీ., రాయదుర్గం-గచ్చిబౌలి-శంషాబాద్: 28 కి.మీ.లున్నాయి.
శివారు ప్రాంతాల రియల్ అవకాశాలపై కథనం వచ్చే వారం..