విజయవాడలో టీడీపీ నేత ‘రియల్‌’ బ్రేకులు! | Tenders invited for vijayawada outer ring road bypass | Sakshi
Sakshi News home page

‘రియల్‌’ బ్రేకులు!

Published Fri, Jun 1 2018 3:36 AM | Last Updated on Fri, Jun 1 2018 10:44 AM

Tenders invited for vijayawada outer ring road bypass - Sakshi

రాజధాని ముసుగులో ప్రభుత్వ ముఖ్యనేత రియల్‌ ఎస్టేట్‌ దందాలో ఇదో కొత్త కోణం. తన బినామీల రూ.5 వేల కోట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ఏకంగా విజయవాడ ఔటర్‌ రింగ్‌రోడ్డు బైపాస్‌ పనులను నాలుగేళ్లుగా అడ్డుకుంటున్న కుతంత్రం ఇది. విజయవాడ మీదుగా వెళ్తున్న రెండు ప్రధాన జాతీయ రహదారులపై నిత్యం 1.20లక్షల వాహనాల రాకపోకలతో లక్షలాది మంది నరకం చవిచూస్తున్నా తమ రియల్‌ ఎస్టేట్‌ దోపిడీ కంటే ఏదీ ఎక్కువ కాదన్న ముఖ్యనేత పన్నాగంతో.. పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను–విజయవాడ ఔటర్‌ రింగ్‌రోడ్డు బైపాస్‌ పనులకు ఒక్క అడుగూ పడలేదు. ఆ బాగోతం కథాకమామిషు ఇదిగో ఇలా ఉంది..


సాక్షి, అమరావతి బ్యూరో: 2014 ఎన్నికల అనంతరం జూన్‌లో పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని అక్కడే వస్తుందని తన అనుచర గణానికి ముందే సమాచారమిచ్చి అక్కడ తక్కువ ధరకు పెద్దఎత్తున భూములు కొనిపించారు. అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించాక ఔటర్‌ రింగ్‌ రోడ్డు బైపాస్‌ను పట్టించుకోకుండా తాము కొనుగోలు చేసిన భూముల డిమాండ్‌ను పెంచుకోగలిగారు.

సీఎం చంద్రబాబు సన్నిహితులు, బినామీలు వాటిల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేశారు. వారిలో ఎంపీ మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థ, లింగమనేని ఎస్టేట్స్‌లతోపాటు పలువురు టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధుల వెంచర్లు ఉన్నాయి. క్రెడాయ్‌ వివరాల ప్రకారం.. రాజధాని పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.10వేల కోట్ల విలువైన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేశారు. వాటిలో విజయవాడ కనకదుర్గ వారధి నుంచి గుంటూరు జిల్లా చినకాకాని మధ్యలోనే జాతీయ రహదారికి ఇరువైపులా దాదాపు రూ.5వేల కోట్ల విలువైన రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులున్నాయి.

వాటిలో దాదాపు 75శాతం టీడీపీ ముఖ్యనేత, ఆయన సన్నిహితులు, బంధువులు, బినామీలవే కావడం గమనార్హం. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఆ భూములకు ప్రస్తుతం డిమాండ్‌ ఉంది. ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు నుంచి బడా కంపెనీల వరకు అక్కడే భూములు, ప్లాట్లు కొనుగోలుకు పోటీపడుతున్నాయి. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకునిపెట్టుబడికి మూడు నాలుగు రెట్లు లాభాలు గడించడానికి ముఖ్యనేత బినామీలు వ్యూహం పన్నారు. ఈ సమయంలో విజయవాడ ఔటర్‌ రింగ్‌రోడ్‌ బైపాస్‌ ప్రాజెక్టును నిర్మిస్తే అటు పక్కనున్న భూములకు డిమాండ్‌ పెరుగుతుంది.

అంటే గన్నవరం నుంచి గొల్లపూడి వరకు, కృష్ణా నదిపై నిర్మించే వంతెనకు ఆవల వైపు నుంచి చినకాకానికి అటువైపునున్న భూములకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే తమ రియల్‌ ఎస్టేట్‌ దందా సాగదని ముఖ్యనేత ఆయన బినామీ బ్యాచ్‌ సందేహించారు. తమ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు అన్నీ అమ్ముడయ్యే వరకు విజయవాడ ఔటర్‌ బైపాస్‌ నిర్మాణం జరగకూడదని పథక రచన చేశారు. కాంట్రాక్టును దక్కించుకున్న గామన్‌ ఇండియా సంస్థ పనులు ప్రారంభించకపోయినా సరే ఎన్‌హెచ్‌ఏఐ కాంట్రాక్టు రద్దు చేయకుండా మూడున్నరేళ్లుగా అడ్డుకుంటున్నారు.

అసలు పనులు ప్రారంభించకుండా గామన్‌ ఇండియా సంస్థను రాష్ట్ర ముఖ్యనేతే ప్రభావితం చేశారని కూడా అధికార వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ కొత్తగా ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచినా సరే రెండు ప్యాకేజీల పనులే ఈ ఏడాది ప్రారంభమవుతాయి. కృష్ణా నదికి అవతల వైపు నుంచి చినకాకాని వరకు పనులు మరో ఏడాది తరువాతే ప్రారంభమై 20022నాటికి పూర్తవుతాయి. ఈలోపు అంటే 2019లోగా తమ వెంచర్లు అన్నీ అమ్మేసుకోవాలన్నది ముఖ్యనేత పన్నాగం.  
 
మూడున్నరేళ్లుగా అవాంతరాలు
హైదరాబాద్‌–మచిలీపట్నం 65వ నంబర్‌ జాతీయ రహదారి, చెన్నై–కోల్‌కత 16నంబర్‌ జాతీయ రహదారి విజయవాడ వద్ద కలుస్తాయి. పోలీసు, రవాణా శాఖ సర్వే ప్రకారం రోజూ 1.20లక్షల వాహనాలు ప్రయాణించే ఈ రహదారిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుండడంతో లక్షలాది మంది నరకయాతన అనుభవిస్తున్నారు. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారంగా విజయవాడ ఔటర్‌ రింగ్‌రోడ్డు బైపాస్‌ నిర్మించాలని 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను నుంచి కృష్ణాజిల్లా గన్నవరం, గొల్లపూడి.. గుంటూరు జిల్లా మంగళగిరి మీదుగా చినకాకాని వరకు 103.59 కి.మీ. పొడవున నాలుగు లేన్ల బైపాస్‌ రోడ్డు నిర్మించాలన్నది ప్రణాళిక. అందుకోసం అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 60మీటర్ల వెడల్పుతో గుండుగొలను నుంచి చినకాకాని వరకు భూసేకరణ పూర్తిచేసింది.

దాదాపు రూ.1,684కోట్ల అంచనా వ్యయంతో నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీవోటీ) విధానంలో ఈ బైపాస్‌ నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) 2014లో టెండర్లు పిలిచింది. ఎల్‌–1గా వచ్చిన గామన్‌ ఇండియా సంస్థకు 2014, సెప్టెంబరు 1న టెండరు ఖరారు చేశారు. 2017 మార్చి 1 నాటికి దీని నిర్మాణం పూర్తిచేయాలని గడువు విధించారు. కానీ, నాటి నుంచి నేటి వరకూ ఒక్క అడుగూ పడలేదు.
 
కాంట్రాక్టు రద్దుకూ ముఖ్యనేత ససేమిరా
నెలలు గడుస్తున్నా గామన్‌ ఇండియా సంస్థ రింగ్‌రోడ్డు బైపాస్‌ పనులు ప్రారంభించనే లేదు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఎన్నిసార్లు ప్రస్తావించినప్పటికీ ఆ సంస్థ సానుకూలంగా స్పందించలేదు. దాంతో అధికారులు ఆ కాంట్రాక్టు రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యనేత రంగంలోకి దిగారు. ‘గామన్‌’ కాంట్రాక్టును రద్దు చేయడానికి వీల్లేదని.. కాంట్రాక్టు గడువు పొడిగించాలని కేంద్రంపై ఒత్తిడి చేశారు. 

టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రాయపాటి సాంబశివరావులతోపాటు రాష్ట్ర మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి పుల్లారావు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో చర్చలు జరిపారు. వారి ఒత్తిడితో ఎన్‌హెచ్‌ఏఐ కాంట్రాక్టు గడువును పొడిగించింది. అయినా పనులు ప్రారంభం కాలేదు. ఇక లాభం లేదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు గామన్‌ ఇండియా సంస్థకు 2016, ఆగస్టులో రద్దు నోటీసు జారీచేశారు.

ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల జోక్యంతో మరోసారి గడువు పొడిగించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో నిర్ణీత గడువు ప్రకారం 2017, మార్చి 1 నాటికి ఒక్క అడుగు కూడా రోడ్డు నిర్మించనే లేదు. అయినా సరే, కాంట్రాక్టు రద్దు చేయడానికి వీల్లేదని ప్రభుత్వ ముఖ్యనేత 2017, డిసెంబరు వరకు అడ్డుకుంటూనే ఉన్నారు.  
 
కాంట్రాక్టు రద్దు.. తాజాగా టెండర్లు  
‘గామన్‌’ సంస్థ ఎంతకీ పనులు ప్రారంభించకపోవడంతో ఇక లాభం లేదని ఆ కాంట్రాక్టును రద్దుచేసి రింగ్‌రోడ్డు బైపాస్‌ ప్రాజెక్టును ఈపీసీ విధానంలో నాలుగు ప్యాకేజీల కింద నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ప్యాకేజీ–1గా గొండుగొలను నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వరకు రూ.513కోట్లు, ప్యాకేజీ–2గా హనుమాన్‌ జంక్షన్‌ నుంచి చిన్నఅవుటుపల్లి వరకు రూ.587కోట్లతో టెండర్లు పిలిచింది. అందుకు జూన్‌ 4 వరకు గడువు ఉంది.

అవసరమైన భూమి అందుబాటులో ఉన్నందున అందుకోసం తాజాగా డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) తయారుచేసేందుకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు  పిలిచారు. డీపీఆర్‌ అనంతరం రెండు ప్యాకేజీల కింద ఆ పనులకు టెండర్లు పిలుస్తారు. ప్యాకేజీ–1, 2ల పనులను 2020 నాటికి పూర్తి అవుతాయని అధికారులు భావిస్తున్నారు. గొల్లపూడి వద్ద కృష్ణా నదిపై వంతెనతో సహా ప్యాకేజీ 3, 4 పనులు 2022నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement