mertro train
-
మెట్రో ప్రయాణం ఫిఫ్టీ.. ఫిఫ్టీ?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో వచ్చే నెలలో మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు రైళ్లను నడిపేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ఒక్కో రైలులో సగం మంది ప్రయాణికులతోనే నడపాల్సి వస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే వెయ్యి మంది ప్రయాణించే రైలులో 500–600కు మించి అనుమతించని పరిస్థితి రానుంది. ఇక ప్రతీ కిలోమీటరుకు ఒక స్టేషన్ ఉండగా.. ప్రతీ స్టేషన్లోనూ విధిగా రైలును నిలిపే పరిస్థితి ఉండదు. రద్దీ అంతగా ఉండని స్టేషన్లలో రైలును నిలిపే ఛాన్స్ ఉండదన్న మాట. ప్రస్తుతం ఈ అంశాలపై మెట్రో అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. (‘ప్రైవేటు’కి అనుమతిస్తే తప్పేంటి?) కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని రంగాలను కుదేలు చేస్తున్న చందంగానే దేశవ్యాప్తంగా...విశ్వవ్యాప్తంగా అన్ని మెట్రో ప్రాజెక్టులపై ఈ ప్రభావం సుస్పష్టంగా కనిపించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు వందకు పైగా మెట్రో ప్రాజెక్టులుండగా..సింగపూర్, హాంకాంగ్, టోక్యో, తైపి నగరాల్లోని ప్రాజెక్టులు మినహా మిగతా ప్రాజెక్టులన్నీ నష్టాలతో నెట్టుకొస్తున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో మన గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనూ సమీప భవిష్యత్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా లేదా అన్న అంశం సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుత సవాళ్లివే.. నగరంలో ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో సుమారు 69 కి.మీ మార్గంలో మెట్రో రూటు అందుబాటులో ఉంది. ప్రయాణికులు సుమారు 4.5 లక్షలకు చేరుకున్న తరుణంలోనే లాక్డౌన్ విధించడంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. జూన్‌లో తిరిగి ప్రారంభించినా..ఒక్కో రైలులో పూర్తిస్థాయి ఆక్యుపెన్సీ..అంటే మూడు బోగీల్లో వెయ్యి మంది ప్రయాణించే వీలుండదు. భౌతిక దూరం విధిగా పాటించాల్సి ఉన్నందున ఒక్కో రైలులో 500–600కు మించి ప్రయాణించడం సాధ్యపడదు. బోగీల్లోనూ తెల్లరంగు మార్కర్‌తో మార్క్ చేసి ప్రయాణికులు నిల్చునేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. రైలులో ప్రయాణికుల రద్దీ అధికమైతే కొన్ని స్టేషన్లలో ప్రయాణికులను రైలులోనికి అనుమతించని పరిస్థితి రానుంది. ఇక రద్దీలేని స్టేషన్లలో రైలును నిలిపే పరిస్థితి ఉండదు. ప్రతీ స్టేషన్‌లోనికి ప్రవేశించే ప్రయాణికునికి విధిగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. నగరంలో సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయంతో మెట్రో ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు వ్యయం రూ.3 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని సమాచారం. సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఛార్జీలు, వాణిజ్య ప్రకటనలు నిలిచిపోవడం, మాల్స్ మూతపడడం వంటివన్నీ మెట్రో ప్రాజెక్టుకు సవాళ్లు విసురుతున్నాయి. నష్టాలెందుకంటే.. ప్రపంచ వ్యాప్తంగా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు నగర మెట్రో కావడం విశేషం. నిర్మాణానికి అయిన వ్యయంలో సుమారు 90 శాతం నిర్మాణ సంస్థనే ఖర్చు చేసింది. ఆదాయం విషయానికి వస్తే 50 శాతం ప్రయాణికుల ఛార్జీలు, మరో 45 శాతం మెట్రో కారిడార్‌లో మాల్స్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా..మరో ఐదు శాతాన్ని వాణిజ్య ప్రకటనల ద్వారా రాబట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో ఆదాయం నిలిచిపోగా..స్టేషన్లు, డిపోలు, రైళ్ల నిర్వహణ వ్యయాలు తడిసిమోపడవుతున్నాయి. ఇక నగరంలో సుమారు 18 మాల్స్ నిర్మించాలనుకున్నప్పటికీ ప్రస్తుతం 4 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నెలకు రూ.45 కోట్ల ఆదాయంతో లాభం..నష్టం లేని స్థితికి చేరుకుంటున్న తరుణంలోనే కోవిడ్ పిడుగుపడడంతో మెట్రోకు శాపంగా పరిణమించడం గమనార్హం. కిలోమీటరుకు సుమారు రూ.200 కోట్లు వ్యయం చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టుకు మరికొన్నేళ్లపాటు నష్టాలబాట తప్పదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. -
రద్దీ రైళ్లతో మెట్రో రికార్డు
సాక్షి,హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రికార్డు ప్రయాణికుల జర్నీతో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. శనివారం 3.65 లక్షలమంది మెట్రో జర్నీ చేయగా.. ఆదివారం అర్థరాత్రి వరకు సుమారు 3.70 లక్షలమంది మెట్రో రైళ్లలో ప్రయాణించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో మెట్రో రద్దీ 2.75 లక్షల మేర ఉండగా, సెలవు రోజుల్లో గరిష్టంగా 3 లక్షల మేర రద్దీ ఉంటుందన్నారు. సమ్మె నేపథ్యంలో రద్దీ అనూహ్యంగా పెరిగిందని తెలిపారు.పలు దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, నగరంలోని ప్రధాన బస్స్టాండ్లు ఎంజీబీఎస్, జేబీఎస్ సహా.. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లకు సమీపంలోని మెట్రో స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లోకి ప్రవేశించేందుకు వేలాదిమంది ప్రయాణికులు ఒక్కసారిగా లోనికి చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. ఆరు అదనపు మెట్రో రైళ్లు ఆదివారం ఉదయం 6 గం. నుంచి మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రోజువారీగా నడిచే రైళ్లకు అదనంగా ఆరు ప్రత్యేక రైళ్లతోపాటు..మొత్తంగా వంద ట్రిప్పులను అదనంగా నడిపినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. -
సిటీ వర్సెస్ శివారు!
♦ మెట్రోతో నగరం.. ♦ ఓఆర్ఆర్తో శివార్ల అభివృద్ధి ♦ జూన్ నుంచి మెట్రో పరుగులు.. ♦ సంవత్సరాంతానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఓఆర్ఆర్ ♦ ఈ ప్రాజెక్ట్‌లతో 30-40 శాతం స్థిరాస్తి ధరల పెంపు మెట్రో రైలు.. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం! ఔటర్ రింగ్ రోడ్డు.. భాగ్యనగరాన్ని జిల్లా కేంద్రాలకు కలిపే వారధి! .. ప్రతిష్టాత్మకమైన ఈ రెండు ప్రాజెక్ట్‌లు ప్రజల అవసరాలు తీర్చేవి మాత్రమే కాదండోయ్.. భాగ్యనగర స్థిరాస్తి రంగానికి ఊత కర్రలా మారాయి. మెట్రో కారిడార్లలో రానున్న షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్‌లు.. ఓఆర్ఆర్ చుట్టూ 13 రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాంతాలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడమే ఇందుకు కారణమని నిపుణుల అభిప్రాయం. రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉన్న నగరాల్లో స్థిరాస్తి ధరలు 30 నుంచి 50 శాతం దాకా అధికంగా ఉంటాయని వారంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ ఏడాది జూన్ నుంచి పట్టాలెక్క నున్న మెట్రో.. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఓఆర్ఆర్తో హైదరాబాద్‌లోనూ ధరలు పెరుగుతాయన్నట్టేగా! సాక్షి, హైదరాబాద్: కారిడార్ 3లోని నాగోల్-మెట్టుగూడ (8 కి.మీ.), కారిడార్ 1లోని మియాపూర్- సంజీవరెడ్డి నగర్ (12 కి.మీ.) పరిధిలో మొత్తం 20 కి.మీ. మార్గం రెండు దశలను ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న స్థిరాస్తి రంగం కూడా పట్టాలెక్కుతుందని నిపుణుల మాట. ‘‘రవాణా, విద్యా, వైద్యం, వినోద వసతులున్న ప్రాంతాల్లోనే నివాసముండేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. ఈ విషయంలో భాగ్యనగరానికి మణిహారంలా మారాయి మెట్రో, ఓఆర్ఆర్. నగరంలో ఏటా 7 నుంచి 10 లక్షల యూనిట్లను అందించే నిర్మాణ సంస్థలు.. మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో వీటి సంఖ్య 15 లక్షలకు పైగానే చేర్చుతారని’’ సుచిరిండియా ఎండీ కిరణ్ కుమార్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. మార్చి నాటికి 3 మెట్రో మాల్స్: హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో 66 స్టేషన్లు, డిపోలు, దశల వారీగా 12 ప్రాంతాల్లో మెట్రో మాల్స్ రానున్నాయి. మెట్రోకిరువైపులా 300 మీటర్ల స్థలంలో రవాణా ఆధారిత అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 1.85 కోట్ల చ.అ. రిటైల్ స్థలంలో.. తొలిదశలో 60.5 లక్షల చ.అ. మేర నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో ఈ ఏడాది మార్చి నాటికి పంజగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్‌లో మూడు మెట్రో మాల్స్ వినియోగంలోకి రానున్నాయి కూడా. వీటి ద్వారా 10.1. లక్షల చ.అ. వాణిజ్య స్థలం అందుబాటులోకి రానుంది. ఈ మాల్స్‌లో ఆఫీసు స్పేస్, రిటైల్ స్టోర్లు, బహుళ జాతి కంపెనీలు, ఐటీ, బీపీ ఓ, కేపీఓ కంపెనీల కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, హెల్త్‌కేర్ సెంటర్లు, మల్టీప్లెక్స్ ఏర్పాటు కానున్నాయి. 8-10 ఏళ్ల సమయంలో మిగతా ప్రాంతాల్లో మాల్స్ నిర్మాణం పూర్తవుతాయి. చ.అ. ధర రూ.100-340: నగరంలో మెట్రో మాల్స్ వచ్చే ప్రాంతాలను పరిశీలిస్తే.. హైటెక్ సిటీ ఎదురుగా 2 లక్షల చ.అ., పంజగుట్ట మెట్రో జంక్షన్ వద్ద 4 లక్షల చ.అ., ఎర్రగడ్డ వద్ద 4 లక్షల చ.అ., మూసారాంబాగ్‌లో 4 లక్షల చ.అ., అమీర్‌పేట జంక్షన్లో లక్ష చ.అ., బాలానగర్ ట్రక్ పార్క్‌లో 2 లక్షల చ.అ., సికింద్రాబాద్ (పాత జీహెచ్ఎంసీ భవనం) వద్ద లక్ష చ.అ., ఎల్బీనగర్ ఓపెన్ స్టేడియం వద్ద 1.5 లక్షల చ.అ., ముషీరాబాద్ పాత గాంధీ ఆసుపత్రి ప్రాంతంలో 10 లక్షల చ.అ., రాయదుర్గం ఐటీ కారిడార్ లో 10 లక్షల చ.అ.ల్లో ఈ మాల్స్ రానున్నాయి. మెట్రో మాల్స్ నిర్మాణానికి చ.అ.కు రూ.4 వేలు వ్యయమవుతుందని అంచనా. చ.అ.కు నెలవారీగా రూ.50-150 మధ్య నెలసరి అద్దె ఉంటుంది. స్టేషన్లలో 100-340 చ.అ. స్థలం వాణిజ్య అవసరాలకు అందుబాటులో ఉంటుంది. 72 కి.మీ. నుంచి 200 కి.మీ. వరకూ: ఢిల్లీలో మొదట 62 కి.మీ. ప్రారంభమైన మెట్రో ఆ తర్వాత 200 కి.మీ.లకు విస్తరించారు. నగరంలోనూ 200 కి.మీ. వరకు విస్తరించాలనేది ప్రభుత్వం ప్ర ణాళిక. విస్తరణ ప్రతిపాదిత ప్రాంతాల్లో.. మియాపూర్-పటాన్ చెరు: 13 కి.మీ., ఎల్బీనగర్- హయత్‌నగర్: 7 కి.మీ., ఎల్బీనగర్-ఫలక్‌నుమా-శంషాబాద్: 28 కి.మీ., తార్నాక-ఈసీఐఎల్: 7 కి. మీ., రాయదుర్గం-గచ్చిబౌలి-శంషాబాద్: 28 కి.మీ.లున్నాయి. శివారు ప్రాంతాల రియల్ అవకాశాలపై కథనం వచ్చే వారం..