సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో వచ్చే నెలలో మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు రైళ్లను నడిపేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ఒక్కో రైలులో సగం మంది ప్రయాణికులతోనే నడపాల్సి వస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే వెయ్యి మంది ప్రయాణించే రైలులో 500–600కు మించి అనుమతించని పరిస్థితి రానుంది. ఇక ప్రతీ కిలోమీటరుకు ఒక స్టేషన్ ఉండగా.. ప్రతీ స్టేషన్‌లోనూ విధిగా రైలును నిలిపే పరిస్థితి ఉండదు. రద్దీ అంతగా ఉండని స్టేషన్లలో రైలును నిలిపే ఛాన్స్ ఉండదన్న మాట. ప్రస్తుతం ఈ అంశాలపై మెట్రో అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. (‘ప్రైవేటు’కి అనుమతిస్తే తప్పేంటి?)
కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని రంగాలను కుదేలు చేస్తున్న చందంగానే దేశవ్యాప్తంగా...విశ్వవ్యాప్తంగా అన్ని మెట్రో ప్రాజెక్టులపై ఈ ప్రభావం సుస్పష్టంగా కనిపించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు వందకు పైగా మెట్రో ప్రాజెక్టులుండగా..సింగపూర్, హాంకాంగ్, టోక్యో, తైపి నగరాల్లోని ప్రాజెక్టులు మినహా మిగతా ప్రాజెక్టులన్నీ నష్టాలతో నెట్టుకొస్తున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో మన గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనూ సమీప భవిష్యత్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా లేదా అన్న అంశం సస్పెన్స్‌గా మారింది.
ప్రస్తుత సవాళ్లివే..
నగరంలో ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో సుమారు 69 కి.మీ మార్గంలో మెట్రో రూటు అందుబాటులో ఉంది. ప్రయాణికులు సుమారు 4.5 లక్షలకు చేరుకున్న తరుణంలోనే లాక్‌డౌన్ విధించడంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. జూన్‌లో తిరిగి ప్రారంభించినా..ఒక్కో రైలులో పూర్తిస్థాయి ఆక్యుపెన్సీ..అంటే మూడు బోగీల్లో వెయ్యి మంది ప్రయాణించే వీలుండదు. భౌతిక దూరం విధిగా పాటించాల్సి ఉన్నందున ఒక్కో రైలులో 500–600కు మించి ప్రయాణించడం సాధ్యపడదు. బోగీల్లోనూ తెల్లరంగు మార్కర్‌తో మార్క్ చేసి ప్రయాణికులు నిల్చునేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. రైలులో ప్రయాణికుల రద్దీ అధికమైతే కొన్ని స్టేషన్లలో ప్రయాణికులను రైలులోనికి అనుమతించని పరిస్థితి రానుంది.
ఇక రద్దీలేని స్టేషన్లలో రైలును నిలిపే పరిస్థితి ఉండదు. ప్రతీ స్టేషన్‌లోనికి ప్రవేశించే ప్రయాణికునికి విధిగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. నగరంలో సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయంతో మెట్రో ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు వ్యయం రూ.3 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని సమాచారం. సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఛార్జీలు, వాణిజ్య ప్రకటనలు నిలిచిపోవడం, మాల్స్ మూతపడడం వంటివన్నీ మెట్రో ప్రాజెక్టుకు సవాళ్లు విసురుతున్నాయి.
నష్టాలెందుకంటే..
ప్రపంచ వ్యాప్తంగా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు నగర మెట్రో కావడం విశేషం. నిర్మాణానికి అయిన వ్యయంలో సుమారు 90 శాతం నిర్మాణ సంస్థనే ఖర్చు చేసింది. ఆదాయం విషయానికి వస్తే 50 శాతం ప్రయాణికుల ఛార్జీలు, మరో 45 శాతం మెట్రో కారిడార్‌లో మాల్స్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా..మరో ఐదు శాతాన్ని వాణిజ్య ప్రకటనల ద్వారా రాబట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు లాక్‌డౌన్ నేపథ్యంలో ఆదాయం నిలిచిపోగా..స్టేషన్లు, డిపోలు, రైళ్ల నిర్వహణ వ్యయాలు తడిసిమోపడవుతున్నాయి. ఇక నగరంలో సుమారు 18 మాల్స్ నిర్మించాలనుకున్నప్పటికీ ప్రస్తుతం 4 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నెలకు రూ.45 కోట్ల ఆదాయంతో లాభం..నష్టం లేని స్థితికి చేరుకుంటున్న తరుణంలోనే కోవిడ్ పిడుగుపడడంతో మెట్రోకు శాపంగా పరిణమించడం గమనార్హం. కిలోమీటరుకు సుమారు రూ.200 కోట్లు వ్యయం చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టుకు మరికొన్నేళ్లపాటు నష్టాలబాట తప్పదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment