మెట్రో రైల్ ట్రయల్ రన్ సక్సెస్‌తో బిల్డర్లలో ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి ఊతకర్ర దొరికింది. భాగ్యనగరానికి మెట్రో హారంతో సాంత్వన లభించింది. గురువారం నాగోల్ మెట్రో డిపో నుంచి మెట్రోరైల్ పట్టాలపై పరుగులు తీయడంతో నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్రోతో రియల్ రంగం కూడా పట్టాలెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో రైలు ఆరంభమైన విదేశీ నగరాల్లో స్థిరాస్తి ధరలు 30 నుంచి 50 శాతం దాకా పెరిగాయి. మెట్రో పూర్తయితే హైదరాబాద్ ఇందుకు భిన్నమైందేమీ కాదని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జైవీర్ రెడ్డి చెప్పారు. మెట్రో నిర్మాణంలో ప్రపంచ పోకడలు, హైదరాబాద్‌కు గల ప్రత్యేక ఆకర్షణలు అదనపు అంశాలన్నారు. మెట్రో అందుబాటులోకి వస్తే రెండు రకాల ప్రయోజనాలుంటాయి. పాతబడిన ప్రాంతాలుగా ముద్రపడిన వాటికి కొత్త జీవం వస్తుంది. దీంతో అవి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయి.
రెండోది.. మెట్రో స్టేషన్ల ఏర్పాటుతో శివారు ప్రాంతాలన్నీ అతి వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతుంది. మన అదృష్టం ఏమిటంటే.. అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించే ప్రత్యేక లక్షణాలు హైదరాబాద్ సొంతం. ఇక్కడి వాతావరణం అందరికీ నచ్చుతుంది. భౌగోళికంగా ఎలాంటి అడ్డంకుల్లేవు.
50 ఏళ్ల అభివృద్ధి: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రానున్న 50 ఏళ్ల అభివృద్ధి చోటు చేసుకుంటుందని యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెంట్ డెరైక్టర్ కళిశెట్టి నాయుడు చెప్పారు. మెట్రోతో ఎల్బీనగర్, ఉప్పల్ వంటి శివారు ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాళ్ల నిర్మాణానికి దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో ఇక్కడి స్థిరాస్తి ధరలు క్రమంగా పెరుగుతాయి. మెట్రో పరిధిని విస్తరించాలనే యోచనలో ప్రభుత్వం ఉండటం హర్షణీయం. దీంతో మెదక్, ఘట్‌కేసర్, మేడ్చల్, షాద్‌నగర్ వంటి ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం మెరుగవడంతో ఈ ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి.
ఏటా 7 నుంచి 10 లక్షల ఫ్లాట్లను అందించే నిర్మాణ సంస్థలు మెట్రో రాకతో 15 లక్షలకు పెరుగుతాయి. నివాస సముదాయాలు పెరడగంతో ధరలూ అందుబాటులో ఉంటాయి. ఆర్థికంగా మనకంటే ఎంతో వెనుకబడ్డ దేశాలు నగరీకరణలో మనకంటే ముందుకు దూసుకెళుతున్నాయి. అందుకే నగరీకరణ మనకో సువర్ణావకాశం. ఇందుకోసం అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్‌ఆర్, మెట్రో రైలు వంటివి చక్కగా పనికొస్తాయనడంలో సందేహంలేదు.
మౌలికం మెరుగ్గా: మౌలిక సదుపాయాల విషయంలో ఏరకంగా చూసినా ముంబై, ఢిల్లీ, బెంగళూరుల కంటే హైదరాబాద్ ఎంతో నయం. అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి మనమెప్పుడూ పోటీలో ఉంటాం. ముంబైలో స్థలం కొరత. ఢిల్లీ నగర పరిధి తక్కువ. కొంత దూరమెళితే ఇతర రాష్ట్రంలోకి వెళ్లాల్సి వస్తుంది. అదే భాగ్యనగరం విషయంలో ఇలాంటి ఇబ్బందుల్లేవు. స్థల లభ్యత ఎక్కువే కాబట్టి హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటే పరిస్థితులుండవు. ఒకవేళ కొంత మంది రేట్లు కృత్రిమంగా పెంచినా, ఆ తర్వాత పడిపోతాయి.
మెట్రో నుంచి నేరుగా: ప్రపంచ మెట్రో రైళ్లను క్షుణ్నంగా అధ్యయనం చేసి.. అందులోని మెరుగైన సదుపాయాల్ని ఇక్కడ కల్పిస్తున్నారు. ఉదాహరణకు బ్యాంకాక్ మెట్రో స్కై వాక్‌లకు ప్రసిద్ధి. దీన్ని మన మెట్రోలో పొందొచ్చు. సుమారు 50 ప్రాంతాల్లో స్కైవాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా మెట్రో వెళ్లే మార్గాల్లో గల పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, షాపింగ్ మాళ్లలోకి ప్రయాణికులు నేరుగా వెళ్లొచ్చు. ప్రజల దైనందిన జీవితాల్లో అవసరమయ్యే ప్రతి సేవలు, ప్రతి వస్తువూ మెట్రో స్టేషన్లలో లభిస్తాయి. బ్యూటీపార్లర్లు, కిరాణా వస్తువులు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, పౌరసేవా కేంద్రాలు, సినిమా థియేటర్లు.. ఇలా సమస్తం ఉంటాయిక్కడ. ఈ సదుపాయాలు సింగపూర్, హాంకాంగ్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.