సమావేశంలో మాట్లాడుతున్న హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. చిత్రంలో కేవీబీ రెడ్డి.
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో రెండు మార్గాల్లో మిగిలిన మెట్రో ప్రాజెక్టు పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేస్తామని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రసూల్‌పురాలోని మెట్రో రైలు భవన్‌లో ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అవసరాల మేరకు మెట్రో రైలు వేళల్లో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. అమీర్‌పేట్–హైటెక్ సిటీ, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో ఈ ఏడాది చివరి నాటికి మెట్రో పనులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నామన్నారు. ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు సర్వే, మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో నిత్యం 16 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని.. వీటిలో రోజూ 80 వేల నుంచి లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారన్నారు.
ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గం అందుబాటులోకి రావడంతో అదనంగా మరో లక్ష మంది మెట్రో జర్నీ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ రూట్లోనూ నిత్యం 19 రైళ్లను నడుపుతున్నామన్నారు. రద్దీ వేళల్లో ప్రతి ఆరున్నర నిమిషాలకో రైలు.. రద్దీ లేని సమయాల్లో ప్రతి 8 నిమిషాలకో రైలును నడుపుతున్నామన్నారు. ఉదయం 6.30 గం. నుంచి రాత్రి 10.30 గం. వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటి వరకూ 46 కి.మీ. మెట్రో ట్రాక్ పరిధిలో 8 ఆర్‌వోబీలు నిర్మించామని తెలిపారు. మెట్రో రూట్లలో కొన్నిచోట్ల 60 నుంచి 70 అడుగుల ఎత్తున ట్రాక్ వేయాల్సి వచ్చిందని, దాదాపు 2,000 మెట్రో పిల్లర్లను నిర్మించామన్నారు. ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు తమ సంస్థ రూ.13,000 కోట్లు ఖర్చు చేసిందని.. మరో రూ.2,000 నుంచి 2,500 కోట్లు వ్యయం చేస్తేనే మిగిలిన పనులు పూర్తవుతాయన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఆస్తుల సేకరణకు రూ.2,300 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అయిన అదనపు వ్యయంపై మొత్తం ప్రాజెక్టు పూర్తయిన తరువాతే స్పష్టత రానుందని తెలిపారు.
నాగోలు–ఎల్బీనగర్ మెట్రో లైను కలుపుతాం...
మెట్రో రెండో దశలో నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలైన్‌ను కలుపుతామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. విమానాశ్రయానికి అన్ని వైపుల నుంచి మెట్రోలైన్ కలపాలని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. రెండో దశ ప్రాజెక్టుపై సర్వే తుది అంకానికి చేరుకుందని.. ఫేజ్–1లో పాత బస్తీ మెట్రో మినహా మిగిలిన పనులు తుది దశకు చేరాయని చెప్పారు. అమీర్‌పేట–ఎల్‌బీనగర్ మార్గంలో సాయంత్రం నుంచి ప్రయాణికులకు అనుమతించామని, రైళ్లన్నీ నిండుగా కనిపించాయన్నారు. దశలవారీగా అన్ని పార్కింగ్ సదుపాయాలు, స్మార్ట్‌బైక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, కార్లు అద్దెకిచ్చే సదుపాయాలు కల్పించనున్నామన్నారు. ఈ సందర్భంగా మెట్రో ప్రాజెక్టు సాకారానికి కృషి చేసిన ఎల్‌అండ్‌టీ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు రవిశంకర్, రామకృష్ణ, సతీష్, ఎం.పి. నాయుడు, కియోలిస్ సంస్థ బెర్నార్డ్, కేఎం రావు తదితరులను జ్ఞాపిక బహూకరించి అభినందించారు.
తొలి ఐదేళ్లు నష్టాలబాటే..
మెట్రో ప్రాజెక్టు తొలి ఐదేళ్లు నష్టాలబాట తప్పదని ఎన్వీఎస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ తరువాత నష్టాలు తగ్గి వ్యయం, ఆదాయం మధ్య అంతరం తగ్గుతుందని అంచనా వేస్తున్నామన్నారు. మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా 50 శాతమే ఆదాయం సమకూరుతుందని.. మరో 45 శాతం స్టేషన్లు, మాల్స్‌లో రిటైల్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి ద్వారానే రానుందన్నారు. మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో సమకూర్చుకోనున్నామని వివరించారు. కాగా మెట్రో స్మార్ట్ కార్డులపై 10 శాతం రాయితీ ఇస్తున్నామని, త్వరలో మెట్రో పాస్‌లను జారీ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రయాణికులకు ఈ పాస్‌లపై 25 శాతం రాయితీ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment