Metro Rail Bhavan
-
Hyderabad Metro: మూత్ర విసర్జన కోసం మరో ప్లాట్‌ఫాంకు..
ఖమ్మంలీగల్: నిత్యం వేల నుంచి లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రోకు ఊహించని జరిమానా పడింది. ఓ ప్రయాణికుడ్ని ఇబ్బంది పెడుతూ.. అతని మెట్రోకార్డు నుంచి 10రూ. కట్ చేసినందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే.. నాలుగేళ్ల కిందటి నాటి ఈ ఘటనలో తీర్పు తాజాగా వెల్లడైంది. ఖమ్మంకు చెందిన న్యాయవాది వెల్లంపల్లి నరేంద్రస్వరూప్ 2019 జనవరి 10న హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఎల్బీ.నగర్ మెట్రో రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించాక తూర్పు వైపు దారిలో టాయిలెట్లు లేక మరోవైపు వెళ్లాడు. ఈక్రమంలో మెట్రో అధికారులు జారీ చేసిన కార్డు మరోసారి స్వైప్ చేయాల్సి వచ్చింది. ఆపై పాత మార్గానికి వచ్చేందుకు ఇంకో సారి స్వైప్ చేశాడు. ఈమేరకు కార్డు నుంచి రూ.10 మినహాయించుకుంది హైదరాబాద్ మెట్రో. అయితే, తాను రైలు ఎక్కాల్సిన మార్గంలో టాయిలెట్లు లేక వెళ్లినందున అదనంగా డబ్బులు తీసుకున్నారని, రోజు వేలాది మందికి ఇలాగే జరుగుతోందని నరేంద్ర ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసును పరిశీలించి వసూలు చేసిన రూ.10 తిరిగి ఇచ్చేయడమే కాకుండా.. అసౌకర్యానికి రూ.5వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5వేలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత బుధవారం తీర్పు ఇచ్చారు. సదరు పరిహారాన్ని 45 రోజుల్లోగా బాధితుడికి అందించాలని హైదరాబాద్ మెట్రోను ఆదేశించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు కనిపించేలా డిస్ప్లే బోర్డులు పెట్టాలని హైదరాబాద్ మెట్రోకు సూచించింది ఖమ్మం వినియోగదారుల కమిషన్. -
మెట్రో స్టేషన్లో కలకలం, పైనుంచి దూకేస్తానన్న యువతి.. అంతలో
చండిగఢ్: అంతవరకు ప్రశాంతంగా ఉన్న మెట్రో ఆవరణమంతా ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఏం జరిగిందో తెలీదు గానీ ఓ యువతి మెట్రో స్టేషన్ పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతంగా ముగిసింది. ఈ ఘటన హర్యానాలో జూలై 24 న సాయంత్రం 6:30 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫరిదాబాద్ మెట్రో స్టేషన్ బాల్కని పైకి అకస్మాత్తుగా ఓ యువతి ఎక్కి అక్కడి నుంచి దూకాలని ప్రయత్నించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేసిన పోలీసు అధికారి, సిఐఎస్ఎఫ్ సిబ్బంది, మెట్రో సిబ్బందితో కలిసి.. ఆ యువతి దృష్టిని మళ్లించేందుకు ముందుగా ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. అలా మాటల్లో పెట్టిన పోలీసు అధికారి ఆ యువతి వద్దకు మెల్లగా చేరుకున్నాడు. ఇంతలో, మరో వ్యక్తి కూడా ఆమె వద్దకు చేరడంతో తనని కాపాడగలిగారు. విచారణలో.. ఆ యువతి, ఫరీదాబాద్ సెక్టార్ 28 లో ఉన్న ఓ ప్రవేట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపింది. తాను చేస్తున్న పని కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పేర్కొంది. అనంతరం పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. కాగా ఫరీదాబాద్ పోలీసు శాఖ ఆ యవతిని కాపాడిన వారిని అభినందిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది . యువతిని కాపాడటంలో అధికారులు చూపిన సమయస్ఫూర్తికి , ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ऐसा #फ़िल्मों में भी नहीं होता। जान देने पर अमादा #लड़की को जान हथेली पर रख कर बचाया। जाँबाज़ #पुलिस कर्मी को बधाई। #कहो_ना_कहो pic.twitter.com/sPZ5bjkZOm — People’s Police - Faridabad Police (@FBDPolice) July 24, 2021 -
అతడు నేనే.. రోజూ మెట్రోలో వెళ్లి వస్తుంటా..
శ్రీలంకలో ఉగ్రవాదుల మారణహోమం నేపథ్యంలోఐటీ సిటీలో రకరకాల వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ మెట్రో రైల్వేస్టేషన్లో కనిపించిన అనుమానితవ్యక్తి ఉగ్రవాది కావచ్చని జోరుగా ప్రచారం జరగడం, చివరకుఆ అనుమానితుడు అమాయకుణ్నని పోలీసులనుకలవడంతో కథ సుఖాంతమైంది. బనశంకరి: మెజస్టిక్ మెట్రోస్టేషన్లో అనుమానాస్పదంగా తెలుపురంగు జుబ్బా, పైజామా ధరించి సంచరించిన వ్యక్తి ఆచూకీ లభించింది. బుధవారం ఆ అనుమానిత వ్యక్తే డీసీపీ కార్యాలయానికి వెళ్లి మెట్రోస్టేషన్లో చోటు చేసుకున్న ఘటనను వివరించారు. సోమవారం రాత్రి మెజస్టిక్ మెట్రో స్టేషన్లో జుబ్బా, పైజామాతో ఉన్న వ్యక్తి మెటల్ డిటెక్టర్ వద్ద కు వెళ్లాడు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది అతడిని తనిఖీ చేయడానికి యత్నించగా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు విచారణ ఆరంభించారు. రోజూ మెట్రోలో వెళ్లి వస్తుంటా వైరల్ అయిన వీడియోలో ఉన్న వ్యక్తి రియాజ్‌అహ్మద్ (70), మెజస్టిక్‌లో గడియారాల విక్రయాలు, మరమ్మతులు చేసే వ్యక్తి అని తేలింది. ఆయన బెంగళూరు పశ్చిమవిభాగ డీసీపీ రవి డీ.చెన్నణ్ణవర్ కార్యాలయానికి వెళ్లి చోటు చేసుకున్న ఘటన ను వెల్లడించారు. తాను నాయండహళ్లిలో నివాసం ఉంటున్నానని, మెజస్టిక్‌లో గడియారాల రిపేరీలు చేస్తూ జీవిస్తుంటానని తెలిపారు. నిత్యం మెట్రో రైల్లో వెళ్లి వస్తుంటానని తెలిపారు. తాను ఉగ్రవాదిని కాదని, అనుమానిత ఉగ్రవాది అని మీడియాలో ప్రసారం కావడంతో ప్రజలు కొందరు తనపై దాడికి ప్రయత్నించారని, రక్షణ కల్పించాలని విన్నవించారు. గడ్డం పెంచుకున్నవారందరూ ఉగ్రవాదులా? గడ్డం పెంచుకోవడం తప్పేనంటూ తన భాద వెళ్లగక్కారు. దీంతో అతని వివరాలను నమోదు చేసుకుని పోలీసులు పంపించివేశారు. భయంతో తగ్గిన ప్రయాణికుల రద్దీ అంతకుముందు డీజీపీ నీలమణి రాజు మీడియాతో మాట్లాడుతూ బ్లాక్ కలర్ జుబ్బా ధరించిన వ్యక్తి ఆచూకీ లభించలేదని తెలిపారు. సాధ్యమైనంత వరకు అనుమానితవ్యక్తి ఆచూకీ కనిపెట్టాలని నగర సీపీ సునీల్‌కుమార్‌కు సూచించారు. మెట్రోస్టేషన్లో అనుమానిత వ్యక్తి సంచరించారనే సమాచారం నేపద్యంలో ప్రయాణికుల్లో భయం నెలకొంది. దీంతో మెట్రోలో సంచరించడానికి నగరప్రజలు భయపడుతున్నారు. మెజస్టిక్ కెంపేగౌడ బస్టాండ్, చిక్కలాల్‌బాగ్‌గేట్ వద్ద రెండుచోట్ల బుదవారం మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వాటిలో అదనపు భద్రత కల్పించారు. భద్రతను పెంచాం: పోలీస్ కమిషనర్ మెజస్టిక్ మెట్రోస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా కనపించిన వ్యక్తి ఆచూకీకోసం తీవ్రంగా గాలిస్తున్నామని ననగర పోలీస్‌కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు. బుధవారం నగరపోలీస్‌కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. నగరంలోని అన్ని మెట్రోస్టేషన్లు వద్ద అదనపు సిబ్బందిని, కేఐఎస్‌ఎఫ్‌ను నియమించామన్నారు. అవసరానికి అనుగుణంగా నగరపోలీసులు అందుబాటులో ఉంటూ గస్తీలో ఉంటారని తెలిపారు. జుబ్బా, పైజామా దరించి గడ్డం కలిగిన వ్యక్తి పట్ల అనుమానం వస్తే తక్షణం పోలీసులకు సమాచారం అందించాలని నగరప్రజలకు మనవిచేశారు. మెజెస్టిక్ మెట్రోస్టేషన్లో అనుమానితుని ఆచూకీ కోసం ఏసీపీ మహంతరెడ్డి నేతృత్వంలో ఓ బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్‌కమిషనర్ః సీమంత్‌కుమార్, డీసీపీలు ఇషాపంత్, రాహుల్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కమిషనర్ సమావేశం అనంతరం అనుమానిత వ్యక్తి డీసీపీని కలవడంతో అనుమానాలు తొలగిపోయాయి. -
నేడు, రేపు సాక్షి ప్రాపర్టీ షో
మెట్రో రైలు పరుగులు ఒకవైపు...ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్‌లతో నగర విస్తరణ మరోవైపు... జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ఎంట్రీ,స్టార్టప్‌ల జోష్ ఇంకొక వైపు... రెరా, జీఎస్టీల అమలుతో కొనుగోలుదారుల నమ్మకం మరొక వైపు... .. ఇదీ సింపుల్‌గా హైదరాబాద్ రియల్టీ రంగం వృద్ధికి కారణాలు! సాధారణంగా ఎన్నికల వాతావరణంలో రియల్టీ మందగమనంలో ఉంటుంది. అదేంటో మరి? ఈసారి ఎలక్షన్స్ ప్రభావం హైదరాబాద్ రియల్టీ రంగం మీద అస్సల్లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాల్లో క్షీణత నమోదైతే.. నగరంలో వృద్ధి కనిపించడమే ఇందుకు నిదర్శనం. ఇక, ఎన్నికల ఫలితాల తర్వాత స్థిరాస్తి రంగం పరుగులు పెట్టడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రాపర్టీ షో నిర్వహిస్తే? కొనుగోలుదారులకు, ఇన్వెస్టర్లకు సరైన ప్రాపర్టీలను ఎంచుకునే వీలు కల్పిస్తే? ఒకే వేదికగా వీటికి సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది ‘సాక్షి ప్రాపర్టీ షో’! సాక్షి ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నేడు, రేపు మెగా ప్రాపర్టీ షో జరగనుంది. తెలంగాణ రెరా చైర్మన్ రాజేశ్వర్ తివారీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో 35కి పైగా నగరానికి చెందిన బడా నిర్మాణ సంస్థలు ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు, వాణిజ్య సముదాయాలను ప్రదర్శించనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు షో అందుబాటులో ఉంటుంది. సందర్శకులకు ప్రవేశం ఉచితం. – సాక్షి, హైదరాబాద్ ప్రధాన స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్: రాంకీ ఎస్టేట్స్ కో–స్పాన్సర్స్: జనప్రియ, ఎన్సీసీ అర్బన్, మ్యాక్ ప్రాజెక్ట్స్ ఇతర పాల్గొనే సంస్థలు: అక్యురేట్ డెవలపర్స్, రాజపుష్ప, వెర్టెక్స్, గిరిధారి హోమ్స్, ఆర్క్ బిల్డర్స్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్ హోమ్స్, సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఆర్వీ నిర్మాణ్, సాకేత్, ప్రావిడెంట్, కపిల్ ప్రాపర్టీస్, ప్రగతి గ్రీన్మోడోస్, దామరి ఎస్టేట్స్, వర్ధన్ డెవలపర్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. -
కోడ్ ఉండగా మెట్రో ఎలా ప్రారంభిస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు మెట్రో రైలు నూతన మార్గాన్ని ఎలా ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. మెట్రో రైలు నూతన మార్గాన్ని గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. కోడ్ అమల్లో ఉండగా ప్రారంభానికి గవర్నర్‌ను ఎలా ఆహ్వానిస్తారని, ఆయన ఎలా పాల్గొంటారని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ గోపిశెట్టి నిరంజన్ ప్రశ్నిం చారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం సీఈఓ రజత్‌కుమార్‌కు ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ ఈ మేరకు మంగళవారం ఫిర్యాదు చేశారు. -
డిసెంబర్ నాటికి మరో 2 మార్గాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో రెండు మార్గాల్లో మిగిలిన మెట్రో ప్రాజెక్టు పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేస్తామని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రసూల్‌పురాలోని మెట్రో రైలు భవన్లో ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అవసరాల మేరకు మెట్రో రైలు వేళల్లో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. అమీర్‌పేట్–హైటెక్ సిటీ, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో ఈ ఏడాది చివరి నాటికి మెట్రో పనులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నామన్నారు. ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు సర్వే, మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో నిత్యం 16 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని.. వీటిలో రోజూ 80 వేల నుంచి లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గం అందుబాటులోకి రావడంతో అదనంగా మరో లక్ష మంది మెట్రో జర్నీ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ రూట్లోనూ నిత్యం 19 రైళ్లను నడుపుతున్నామన్నారు. రద్దీ వేళల్లో ప్రతి ఆరున్నర నిమిషాలకో రైలు.. రద్దీ లేని సమయాల్లో ప్రతి 8 నిమిషాలకో రైలును నడుపుతున్నామన్నారు. ఉదయం 6.30 గం. నుంచి రాత్రి 10.30 గం. వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటి వరకూ 46 కి.మీ. మెట్రో ట్రాక్ పరిధిలో 8 ఆర్వోబీలు నిర్మించామని తెలిపారు. మెట్రో రూట్లలో కొన్నిచోట్ల 60 నుంచి 70 అడుగుల ఎత్తున ట్రాక్ వేయాల్సి వచ్చిందని, దాదాపు 2,000 మెట్రో పిల్లర్లను నిర్మించామన్నారు. ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు తమ సంస్థ రూ.13,000 కోట్లు ఖర్చు చేసిందని.. మరో రూ.2,000 నుంచి 2,500 కోట్లు వ్యయం చేస్తేనే మిగిలిన పనులు పూర్తవుతాయన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఆస్తుల సేకరణకు రూ.2,300 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అయిన అదనపు వ్యయంపై మొత్తం ప్రాజెక్టు పూర్తయిన తరువాతే స్పష్టత రానుందని తెలిపారు. నాగోలు–ఎల్బీనగర్ మెట్రో లైను కలుపుతాం... మెట్రో రెండో దశలో నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలైన్‌ను కలుపుతామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. విమానాశ్రయానికి అన్ని వైపుల నుంచి మెట్రోలైన్ కలపాలని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. రెండో దశ ప్రాజెక్టుపై సర్వే తుది అంకానికి చేరుకుందని.. ఫేజ్–1లో పాత బస్తీ మెట్రో మినహా మిగిలిన పనులు తుది దశకు చేరాయని చెప్పారు. అమీర్‌పేట–ఎల్బీనగర్ మార్గంలో సాయంత్రం నుంచి ప్రయాణికులకు అనుమతించామని, రైళ్లన్నీ నిండుగా కనిపించాయన్నారు. దశలవారీగా అన్ని పార్కింగ్ సదుపాయాలు, స్మార్ట్బైక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, కార్లు అద్దెకిచ్చే సదుపాయాలు కల్పించనున్నామన్నారు. ఈ సందర్భంగా మెట్రో ప్రాజెక్టు సాకారానికి కృషి చేసిన ఎల్అండ్టీ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు రవిశంకర్, రామకృష్ణ, సతీష్, ఎం.పి. నాయుడు, కియోలిస్ సంస్థ బెర్నార్డ్, కేఎం రావు తదితరులను జ్ఞాపిక బహూకరించి అభినందించారు. తొలి ఐదేళ్లు నష్టాలబాటే.. మెట్రో ప్రాజెక్టు తొలి ఐదేళ్లు నష్టాలబాట తప్పదని ఎన్వీఎస్రెడ్డి స్పష్టం చేశారు. ఆ తరువాత నష్టాలు తగ్గి వ్యయం, ఆదాయం మధ్య అంతరం తగ్గుతుందని అంచనా వేస్తున్నామన్నారు. మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా 50 శాతమే ఆదాయం సమకూరుతుందని.. మరో 45 శాతం స్టేషన్లు, మాల్స్‌లో రిటైల్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి ద్వారానే రానుందన్నారు. మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో సమకూర్చుకోనున్నామని వివరించారు. కాగా మెట్రో స్మార్ట్ కార్డులపై 10 శాతం రాయితీ ఇస్తున్నామని, త్వరలో మెట్రో పాస్‌లను జారీ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రయాణికులకు ఈ పాస్‌లపై 25 శాతం రాయితీ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నామన్నారు. -
32 చోట్ల మెట్రో మల్టీ లెవెల్ వెహికల్ పార్కింగ్
- అందుబాటులోకి 400 బైక్ స్టేషన్లు.. 10 వేల సైకిళ్లు - మియాపూర్ –జేఎన్టీయూల మధ్య 500 మీటర్ల స్కైవాక్ - మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్: మెట్రో రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల వాహనాల పార్కింగ్ కోసం ప్రాథమికంగా 32 చోట్ల మల్టీ లెవెల్ వాహన పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. శనివారం బేగంపేటలోని మెట్రో రైల్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్అండ్టీ ఆధ్వర్యంలో 17 చోట్ల 57 ఎకరాల్లో, హెచ్ఎంఆర్ ఆధ్వర్యంలో 15 చోట్ల ఈ పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు ఆయన వివరించారు. మొత్తం 62 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంటుందని.. వీటితో పాటు ప్రభుత్వ భూములు గుర్తించి దాన్ని వాహనాల పార్కింగ్ సదుపాయం కోసం వినియోగిస్తామని చెప్పారు. మెట్రో మాల్స్‌లో రెండు, మూడు లెవెల్లో ఈ పార్కింగ్ సౌకర్యం ఉంటుందని చెప్పారు. మెట్రో రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ప్రైవేటు భూముల యజమానులు ముందుకు వస్తే వాటిని అభివృద్ధి చేస్తామని.. వీటిపై ప్రభుత్వం త్వరలోనే పాలసీ తీసుకుని రాబోతుందని తెలిపారు. అందుబాటులోకి మెట్రో ఫీడర్ బస్సులు నగరంలో ప్రైవేటు వాహనాలు తగ్గించి ప్రజారవాణా వ్యవస్థ మెరుగు పరిచేందుకు ప్రతి స్టేషన్ నుంచి రైల్ టెర్మినల్స్, ఎంఎంటీఎస్ స్టేషన్లు, ఆర్టీసీ బస్ డిపోలను అనుసంధానం చేస్తామని చెప్పారు. మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి కాలనీలకు వెళ్లేందుకు మెట్రో ఫీడర్ బస్‌లు అందుబాటులో ఉంచుతామని.. అదే టికెట్‌పై దీనిలో ప్రయా ణించవచ్చని చెప్పారు. స్టేషన్ల నుంచి నాలుగు కి.మీ. పరిధిలో వెళ్లేందుకు 400 బైక్ స్టేషన్లలో 10 వేల సైకిళ్లు అందుబాటులో ఉంచుతా మన్నారు. వాటిని ప్రయాణికులు తీసుకుని వెళ్లి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బైక్ స్టేషన్లో అప్పగించవచ్చని వివరించారు. ప్రతి స్టేషన్లో సోలార్ ప్యానెల్స్ రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే ఉంటాయని.. ఎలక్ట్రికల్ వాహనాలు చార్జింగ్ చేసుకునేందుకు ప్రతి మెట్రో రైల్వే స్టేషన్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామ న్నారు. ఇందులో ఉత్పత్తి అయిన విద్యుత్‌తో ఎలక్ట్రికల్ వాహనాలను చార్జింగ్ చేసుకోవడం తో పాటు ఖాళీ బ్యాటరీ ఇచ్చి, చార్జింగ్ చేసిన బ్యాటరీ తీసుకుని వెళ్లే సౌకర్యం అందుబాటు లోకి తెస్తున్నామని వివరించారు. మియాపూర్ స్టేషన్ నుంచి హైదర్‌నగర్ మధ్య రెండు కి.మీ. పరిధిలో రాహ్‌గిరి వేదికను పిల్లలు ఆడుకునేం దుకు, యోగా తదితర అన్ని అవసరాలకు ప్రజలు ఉపయోగించుకునేందుకు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భిన్న ఆకృతుల్లో స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు మెట్రో కారిడార్ సెంట్రల్ మీడియంలో గ్రీనరీని పెంచి బ్యూటిఫికేషన్ చేస్తున్నామని మెట్రో స్టేషన్లలో ప్రజలు కూర్చునేందుకు భిన్న ఆకృతులతో స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మియాపూర్, జేఎన్టీయూల మధ్య 500 మీటర్ల స్కైవాక్ నిర్మిస్తామని.. మొదట ఎస్ఆర్నగర్ స్టేషన్లో దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే కూకట్పల్లి మీదుగా 200 మీటర్ల స్కై వాక్ ఉంటుందన్నారు. ప్రతి స్టేషన్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను వేరువేరుగా రోడ్డుపైన ఉండే ప్రధాన ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి స్టేషన్లో ఎయిర్‌పోర్టు మాదిరిగా సెక్యూరిటీ సిస్టమ్, లగేజ్ స్కానింగ్ ఉంటుందన్నారు. మెట్రో కారిడార్ 1, 3 పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయని త్వరలోనే ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించాలనేది చెబుతుందని చెప్పారు. కారిడార్ 2 వచ్చే సంవత్సరానికి పూర్తవుతుందని చెప్పారు. -
మెట్రో రైల్ భవన్ వద్ద వైఎస్సార్సీపీ ధర్నా
హైదరాబాద్: మెట్రో రైల్ భవన్ వద్ద బుధవారం వైఎస్సార్సీపీ నాయకులు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడకుండా మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పూర్తైన మెట్రో మార్గంలో రాకపోకలు సాగించాలని కోరారు. ప్రభుత్వ తీరును బట్టి చూస్తే 2019 ఎన్నికల ముందుగా మెట్రోను ప్రారంభించే విధంగా ఉందని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శివకుమార్, బొడ్డు సాయినాథ్ రెడ్డి, వెల్లాల రాంమోహన్, మతిన్, జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.