ఖమ్మంలీగల్: నిత్యం వేల నుంచి లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రోకు ఊహించని జరిమానా పడింది. ఓ ప్రయాణికుడ్ని ఇబ్బంది పెడుతూ.. అతని మెట్రోకార్డు నుంచి 10రూ. కట్ చేసినందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే.. నాలుగేళ్ల కిందటి నాటి ఈ ఘటనలో తీర్పు తాజాగా వెల్లడైంది.
ఖమ్మంకు చెందిన న్యాయవాది వెల్లంపల్లి నరేంద్రస్వరూప్ 2019 జనవరి 10న హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఎల్‌బీ.నగర్ మెట్రో రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించాక తూర్పు వైపు దారిలో టాయిలెట్లు లేక మరోవైపు వెళ్లాడు. ఈక్రమంలో మెట్రో అధికారులు జారీ చేసిన కార్డు మరోసారి స్వైప్ చేయాల్సి వచ్చింది. ఆపై పాత మార్గానికి వచ్చేందుకు ఇంకో సారి స్వైప్ చేశాడు. ఈమేరకు కార్డు నుంచి రూ.10 మినహాయించుకుంది హైదరాబాద్ మెట్రో.
అయితే, తాను రైలు ఎక్కాల్సిన మార్గంలో టాయిలెట్లు లేక వెళ్లినందున అదనంగా డబ్బులు తీసుకున్నారని, రోజు వేలాది మందికి ఇలాగే జరుగుతోందని నరేంద్ర ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసును పరిశీలించి వసూలు చేసిన రూ.10 తిరిగి ఇచ్చేయడమే కాకుండా.. అసౌకర్యానికి రూ.5వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5వేలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత బుధవారం తీర్పు ఇచ్చారు.
సదరు పరిహారాన్ని 45 రోజుల్లోగా బాధితుడికి అందించాలని హైదరాబాద్ మెట్రోను ఆదేశించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు కనిపించేలా డిస్‌ప్లే బోర్డులు పెట్టాలని హైదరాబాద్ మెట్రోకు సూచించింది ఖమ్మం వినియోగదారుల కమిషన్.
Comments
Please login to add a commentAdd a comment