32 చోట్ల మెట్రో మల్టీ లెవెల్ వెహికల్ పార్కింగ్
- అందుబాటులోకి 400 బైక్ స్టేషన్లు.. 10 వేల సైకిళ్లు
- మియాపూర్ –జేఎన్‌టీయూల మధ్య 500 మీటర్ల స్కైవాక్
- మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి
హైదరాబాద్: మెట్రో రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల వాహనాల పార్కింగ్ కోసం ప్రాథమికంగా 32 చోట్ల మల్టీ లెవెల్ వాహన పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. శనివారం బేగంపేటలోని మెట్రో రైల్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో 17 చోట్ల 57 ఎకరాల్లో, హెచ్‌ఎంఆర్ ఆధ్వర్యంలో 15 చోట్ల ఈ పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు ఆయన వివరించారు. మొత్తం 62 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంటుందని.. వీటితో పాటు ప్రభుత్వ భూములు గుర్తించి దాన్ని వాహనాల పార్కింగ్ సదుపాయం కోసం వినియోగిస్తామని చెప్పారు. మెట్రో మాల్స్‌లో రెండు, మూడు లెవెల్లో ఈ పార్కింగ్ సౌకర్యం ఉంటుందని చెప్పారు. మెట్రో రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ప్రైవేటు భూముల యజమానులు ముందుకు వస్తే వాటిని అభివృద్ధి చేస్తామని.. వీటిపై ప్రభుత్వం త్వరలోనే పాలసీ తీసుకుని రాబోతుందని తెలిపారు.
అందుబాటులోకి మెట్రో ఫీడర్ బస్సులు
నగరంలో ప్రైవేటు వాహనాలు తగ్గించి ప్రజారవాణా వ్యవస్థ మెరుగు పరిచేందుకు ప్రతి స్టేషన్ నుంచి రైల్ టెర్మినల్స్, ఎంఎంటీఎస్ స్టేషన్లు, ఆర్టీసీ బస్ డిపోలను అనుసంధానం చేస్తామని చెప్పారు. మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి కాలనీలకు వెళ్లేందుకు మెట్రో ఫీడర్ బస్‌లు అందుబాటులో ఉంచుతామని.. అదే టికెట్‌పై దీనిలో ప్రయా ణించవచ్చని చెప్పారు. స్టేషన్ల నుంచి నాలుగు కి.మీ. పరిధిలో వెళ్లేందుకు 400 బైక్ స్టేషన్లలో 10 వేల సైకిళ్లు అందుబాటులో ఉంచుతా మన్నారు. వాటిని ప్రయాణికులు తీసుకుని వెళ్లి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బైక్ స్టేషన్‌లో అప్పగించవచ్చని వివరించారు.
ప్రతి స్టేషన్‌లో సోలార్ ప్యానెల్స్
రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే ఉంటాయని.. ఎలక్ట్రికల్ వాహనాలు చార్జింగ్ చేసుకునేందుకు ప్రతి మెట్రో రైల్వే స్టేషన్‌లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామ న్నారు. ఇందులో ఉత్పత్తి అయిన విద్యుత్‌తో ఎలక్ట్రికల్ వాహనాలను చార్జింగ్ చేసుకోవడం తో పాటు ఖాళీ బ్యాటరీ ఇచ్చి, చార్జింగ్ చేసిన బ్యాటరీ తీసుకుని వెళ్లే సౌకర్యం అందుబాటు లోకి తెస్తున్నామని వివరించారు. మియాపూర్ స్టేషన్ నుంచి హైదర్‌నగర్ మధ్య రెండు కి.మీ. పరిధిలో రాహ్‌గిరి వేదికను పిల్లలు ఆడుకునేం దుకు, యోగా తదితర అన్ని అవసరాలకు ప్రజలు ఉపయోగించుకునేందుకు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
భిన్న ఆకృతుల్లో స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు
మెట్రో కారిడార్ సెంట్రల్ మీడియంలో గ్రీనరీని పెంచి బ్యూటిఫికేషన్ చేస్తున్నామని మెట్రో స్టేషన్లలో ప్రజలు కూర్చునేందుకు భిన్న ఆకృతులతో స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మియాపూర్, జేఎన్‌టీయూల మధ్య 500 మీటర్ల స్కైవాక్ నిర్మిస్తామని.. మొదట ఎస్‌ఆర్‌నగర్ స్టేషన్‌లో దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే కూకట్‌పల్లి మీదుగా 200 మీటర్ల స్కై వాక్ ఉంటుందన్నారు. ప్రతి స్టేషన్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్‌లను వేరువేరుగా రోడ్డుపైన ఉండే ప్రధాన ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి స్టేషన్‌లో ఎయిర్‌పోర్టు మాదిరిగా సెక్యూరిటీ సిస్టమ్, లగేజ్ స్కానింగ్ ఉంటుందన్నారు. మెట్రో కారిడార్ 1, 3 పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయని త్వరలోనే ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించాలనేది చెబుతుందని చెప్పారు. కారిడార్ 2 వచ్చే సంవత్సరానికి పూర్తవుతుందని చెప్పారు.