రెండో దశలో 8 లక్షలు.. 2030 నాటికి 10 లక్షల మంది ప్రయాణికులు
వచ్చే జనవరి మొదటి వారంలో పాతబస్తీలో పనులు ప్రారంభం
నిధుల లభ్యతకు ఇబ్బందులేమీ లేవు
నాలుగేళ్లలో 5 కారిడార్‌లు పూర్తి
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ నిర్మాణానికి నిధుల లభ్యతలో ఎలాంటి ఇబ్బంది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు తక్కువ వడ్డీ రేటుకు నిధులు అందజేసేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 2028లో రెండో దశ పూర్తయ్యేనాటికి సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటారని.. 2030 నాటికి 10 లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. రెండో దశ కారిడార్‌లలో ప్రయాణికుల డిమాండ్‌పై లీ అసోసియేషన్ సంస్థ రూపొందించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ నివేదిక (సీఎంపీ) ప్రకారం ప్రతిపాదించిన అయిదు కారిడార్‌లలో ప్రయాణికుల డిమాండ్ అత్యధికంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ మొదట దశ ప్రాజెక్టుకు 7 ఏళ్లు పూర్తయిన (ఈ నెల 28) సందర్భంగా మంగళవారం బేగంపేట్ మెట్రో భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్వీఎస్ రెడ్డి ఏం చెప్పారంటే..
ఏడేళ్లలో 63.40 కోట్ల ప్రయాణికులు..
గత ఏడేళ్లలో నాగోల్– రాయదుర్గం, ఎల్‌బీనగర్–మియాపూర్, జూబ్లీ బస్టేషన్–ఎంజీబీఎస్ మూడు కారిడార్‌లలో 63.40 కోట్ల మంది ప్రయాణం చేశారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా.. ఈ ఏడాది ఆగస్టు 14న అత్యధికంగా 5.63 లక్షల మంది ప్రయాణం చేశారు. రెండో దశ పూర్తిస్థాయిలో అందుబాటు లోకి వస్తే మొదటి, రెండు దశల్లో కలిపి సుమారు 15 లక్షల నుంచి క్రమంగా 20 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. వచ్చే డిసెంబరు నెలాఖరుకు పాతబస్తీలో రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టనున్నాం. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో రెండో దశ పనులు ప్రారంభమవుతాయి.
జాయింట్ వెంచర్..
⇒సమాజంలోని అన్ని వర్గాల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రెండో దశ రూట్‌లను ఎంపిక చేశాం. ఇది మొత్తం 6 కారిడార్‌లలో 116.4 కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోర్త్‌సిటీ మెట్రోకు సర్వే పనులు ప్రారంభించాం. రెండో దశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (50: 50) జాయింట్ వెంచర్. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఈ నెల 4న కేంద్రానికి అందజేశారు. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే పనులు మొదలవుతాయి. ప్రస్తుతం 5 కారిడార్‌లలో చేపట్టనున్న 76.4 కి.మీ. కారిడార్‌ల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,313 కోట్లు (30 శాతం), కేంద్రం రూ.4,230 కోట్లు (18 శాతం) చొప్పున అందజేయనున్నాయి. మిగతా 48 శాతం నిధు లు రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరిన్ గ్యా రంటీతో జైకా, ఏడీబీ, ఎన్‌డీపీ వంటి మల్టీ లేటరల్ సంస్థల నుంచి సేకరించనున్నారు. మరో 4 శాతం నిధులు రూ.1,033 కోట్లను మాత్రం పీపీపీ విధానంలో సమకూర్చుకుంటారు. రెండోదశలో నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది.
భూసేకరణ వేగవంతం...
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. రోడ్డు విస్తరణతో 1100 పైగా ఆస్తులు ప్రభావితం కానున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 800 ఆస్తుల వివరాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేశాం. వాటిలో 200 కట్టడాల తొలగింపునకు ఆయన చర్యలు చేపట్టారు. డిసెంబర్‌లో పరిహారం చెల్లింపుతో పాటు కూలి్చవేతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం అక్కడ గజానికి రూ.23,000 చొప్పున ఉంది. దానికి రెట్టింపుగా ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా గజానికి రూ.65,000 చొప్పున చెల్లించనున్నారు. మొత్తం ఆస్తుల సేకరణకు సుమారు రూ.700 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది.
3 కోచ్‌లు.. 35 కి.మీ వేగం..
ప్రస్తుతం మొదటి దశలో ఉన్నట్లుగానే రెండో దశలోనూ మెట్రో రైల్‌కు 3 కోచ్‌లు ఉంటాయి. గంటకు 35 కిలోమీటర్ల సగటు వేగంతో రైళ్లు నడుస్తాయి. ప్లాట్‌ఫాంలు మాత్రం 6 కోచ్‌లు నిలిపేందుకు వీలుగా నిర్మిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment