అతడు నేనే.. రోజూ మెట్రోలో వెళ్లి వస్తుంటా.. | Metro Station Person Meet Karnataka Police | Sakshi
Sakshi News home page

అతడు నేనే

Published Thu, May 9 2019 10:48 AM | Last Updated on Thu, May 9 2019 10:48 AM

Metro Station Person Meet Karnataka Police - Sakshi

సీసీ కెమెరా చిత్రంలో రియాజ్‌

శ్రీలంకలో ఉగ్రవాదుల మారణహోమం నేపథ్యంలోఐటీ సిటీలో రకరకాల వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ మెట్రో రైల్వేస్టేషన్‌లో కనిపించిన అనుమానితవ్యక్తి ఉగ్రవాది కావచ్చని జోరుగా ప్రచారం జరగడం, చివరకుఆ అనుమానితుడు అమాయకుణ్నని పోలీసులనుకలవడంతో కథ సుఖాంతమైంది.  

బనశంకరి: మెజస్టిక్‌ మెట్రోస్టేషన్‌లో అనుమానాస్పదంగా తెలుపురంగు జుబ్బా, పైజామా ధరించి సంచరించిన వ్యక్తి ఆచూకీ లభించింది. బుధవారం ఆ అనుమానిత వ్యక్తే డీసీపీ కార్యాలయానికి వెళ్లి మెట్రోస్టేషన్‌లో చోటు చేసుకున్న ఘటనను వివరించారు. సోమవారం రాత్రి మెజస్టిక్‌ మెట్రో స్టేషన్‌లో జుబ్బా, పైజామాతో ఉన్న వ్యక్తి మెటల్‌ డిటెక్టర్‌ వద్ద కు వెళ్లాడు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది అతడిని తనిఖీ చేయడానికి యత్నించగా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు విచారణ ఆరంభించారు.  

రోజూ మెట్రోలో వెళ్లి వస్తుంటా
 వైరల్‌ అయిన వీడియోలో ఉన్న వ్యక్తి రియాజ్‌అహ్మద్‌ (70), మెజస్టిక్‌లో గడియారాల విక్రయాలు, మరమ్మతులు చేసే వ్యక్తి అని తేలింది. ఆయన బెంగళూరు పశ్చిమవిభాగ డీసీపీ రవి డీ.చెన్నణ్ణవర్‌ కార్యాలయానికి వెళ్లి చోటు చేసుకున్న ఘటన ను వెల్లడించారు. తాను నాయండహళ్లిలో నివాసం ఉంటున్నానని, మెజస్టిక్‌లో గడియారాల రిపేరీలు చేస్తూ జీవిస్తుంటానని తెలిపారు. నిత్యం మెట్రో రైల్లో వెళ్లి వస్తుంటానని తెలిపారు. తాను ఉగ్రవాదిని కాదని, అనుమానిత ఉగ్రవాది అని మీడియాలో ప్రసారం కావడంతో ప్రజలు కొందరు తనపై దాడికి ప్రయత్నించారని, రక్షణ కల్పించాలని విన్నవించారు. గడ్డం పెంచుకున్నవారందరూ ఉగ్రవాదులా? గడ్డం పెంచుకోవడం తప్పేనంటూ తన భాద వెళ్లగక్కారు. దీంతో అతని వివరాలను నమోదు చేసుకుని పోలీసులు పంపించివేశారు.

భయంతో తగ్గిన ప్రయాణికుల రద్దీ
అంతకుముందు డీజీపీ నీలమణి రాజు మీడియాతో మాట్లాడుతూ బ్లాక్‌ కలర్‌ జుబ్బా ధరించిన వ్యక్తి ఆచూకీ లభించలేదని తెలిపారు. సాధ్యమైనంత వరకు అనుమానితవ్యక్తి ఆచూకీ కనిపెట్టాలని నగర సీపీ సునీల్‌కుమార్‌కు సూచించారు. మెట్రోస్టేషన్‌లో అనుమానిత వ్యక్తి సంచరించారనే సమాచారం నేపద్యంలో  ప్రయాణికుల్లో భయం నెలకొంది. దీంతో మెట్రోలో సంచరించడానికి నగరప్రజలు భయపడుతున్నారు. మెజస్టిక్‌ కెంపేగౌడ బస్టాండ్, చిక్కలాల్‌బాగ్‌గేట్‌ వద్ద రెండుచోట్ల బుదవారం మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వాటిలో అదనపు భద్రత కల్పించారు.  

భద్రతను పెంచాం: పోలీస్‌ కమిషనర్‌
మెజస్టిక్‌ మెట్రోస్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా కనపించిన వ్యక్తి ఆచూకీకోసం తీవ్రంగా గాలిస్తున్నామని ననగర పోలీస్‌కమిషనర్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు. బుధవారం నగరపోలీస్‌కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్‌ అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. నగరంలోని అన్ని మెట్రోస్టేషన్లు వద్ద అదనపు సిబ్బందిని, కేఐఎస్‌ఎఫ్‌ను నియమించామన్నారు. అవసరానికి అనుగుణంగా నగరపోలీసులు అందుబాటులో ఉంటూ గస్తీలో ఉంటారని తెలిపారు. జుబ్బా, పైజామా దరించి గడ్డం కలిగిన వ్యక్తి పట్ల అనుమానం వస్తే తక్షణం పోలీసులకు సమాచారం అందించాలని నగరప్రజలకు మనవిచేశారు. మెజెస్టిక్‌ మెట్రోస్టేషన్‌లో అనుమానితుని ఆచూకీ కోసం ఏసీపీ మహంతరెడ్డి నేతృత్వంలో ఓ బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్‌కమిషనర్ః సీమంత్‌కుమార్, డీసీపీలు ఇషాపంత్, రాహుల్‌దేవ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, కమిషనర్‌ సమావేశం అనంతరం అనుమానిత వ్యక్తి డీసీపీని కలవడంతో అనుమానాలు తొలగిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement