అభివృద్ధి అంతా.. ఔటర్ చెంత!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన నగరం.. దాని చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు.. ఆపై విస్తరించిన నివాస, వాణిజ్య, పారిశ్రామిక జోన్లు.. మరోసారి వాటి చుట్టూ బాహ్య వలయ రహదారి (ఔటర్ రింగ్ రోడ్డు).. ఇదీ హైదరాబాద్ మహానగర ముఖచిత్రం! అంకెల్లో ఓఆర్‌ఆర్ గురించి చెప్పాలంటే.. నగరం చుట్టూ 158 కి.మీ. దూరం.. 150 మీటర్ల వెడల్పు, 8 లైన్ల ప్రధాన మార్గం.. 20 ఇంటర్ చేంజ్‌లు!!
నగరంపై ఒత్తిడిని తగ్గించాలంటే ప్రజలను సిటీ నుంచి బయటికి పంపించాల్సిందే. అంటే దానర్థం శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని! ప్రధాన నగరంలో ఖాళీ స్థలాలు పెద్దగా లేకపోవడంతో శివారు ప్రాంతాలైన హయత్‌నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, షాద్‌నగర్, కాప్రా వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు వెలుస్తున్నాయి. నగరంలో ఏటా సుమారు 6,500-7,000 నిర్మాణాలకు మహా నగర పాలక సంస్థ అధికారికంగా అనుమతి ఇస్తుంది. వీటిలో 30-40 శాతం అనుమతులు శివారు ప్రాంతాల నుంచి వస్తున్నవే. గతంలో శివారు ప్రాంతాల్లో అధిక శాతం లే-అవుట్లు వెలిసేవి. కానీ ఇప్పుడక్కడ అపార్ట్‌మెంట్లు, విల్లాల, షాపింగ్ మాళ్ల నిర్మాణాలూ జోరుగా సాగుతున్నాయి. మురుగు నీరు, మంచి నీటి వ్యవస్థ, విద్యుత్, రవాణా వంటి మౌలిక వసతులతో పాటు ప్రధాన నగరం ట్రాఫిక్ చట్రానికి తోడు కాలుష్య కోరల్లో చిక్కుకోవటంతో ప్రజలు శివార్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు శివారు ప్రాంతాలకూ మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓఆర్‌ఆర్‌తో నగరంలో ఎక్కడి నుంచైనా సులభంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే వీలుంది. అంటే అభివృద్ధికి ఓఆర్‌ఆర్ కేంద్ర బిందువుగా మారిందన్నమాట.
ఐటీఐఆర్, టీ-పాస్ రెండూ..
శివారు ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో భారీ సంఖ్యలో పెట్టుబడులతో ముందుకొస్తున్న కంపెనీలు.. ఇవన్నీ శివారు ప్రాంతాల కేంద్రంగా జరుగుతున్నవే. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆస్కారముంటుంది. ఆతిథ్య, రవాణా రంగాలకు కూడా అవకాశం ఉంటుంది. ఐటీ కేంద్రంగా హైదరాబాద్ పశ్చిమం వైపు స్థిరాస్తి సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇవి ఓఆర్‌ఆర్ వరకూ విస్తరించాయి కూడా. గచ్చిబౌలి నుంచి 13 కి.మీ. దూరంలో ఉండే అప్పా జంక్షన్, నార్సింగి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీ తరహా నిర్మాణాలకు ఆదరణ పెరిగింది. శంషాబాద్ విమానాశ్రయం, శ్రీశైలం రహదారి, ఆదిభట్ల ప్రాంతాల్లో ఓఆర్‌ఆర్ కేంద్రంగా విల్లాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.
♦ ఉప్పల్, నాగోల్ మార్గంలో మెట్రో రైలు కనెక్టివిటీ ఆధారంగా స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే 10 కి.మీ. దాటి వెళ్లింది. యాదాద్రి అభివృద్ధికి సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఇప్పుడు వరంగల్ హైవే స్థిరాస్తికి హాట్‌కేక్‌లా మారింది. ఇప్పటికే ఈ మార్గంలో ఐటీ సంస్థలుండటంతో అభివృద్ధికి సానుకూలంగా కనిపిస్తోంది.
♦ శామీర్‌పేట మార్గంలో బడా సంస్థలు పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. రిటైర్మెంట్ హోమ్స్‌కు ఈ ప్రాంతం అనుకూలం. ఎందుకంటే కాలుష్యానికి దూరంగా పచ్చదనం నడుమ ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని కోరుకుంటున్నారు.
♦ జాతీయ రహదారి వెంట రవాణా ఆధారిత అభివృద్ధి జరుగుతోంది. హయత్‌నగర్ నుంచి పటాన్ చెరు వరకు రహదారికి ఇరువైపులా కి.మీ. పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు స్థల యజమానులతో 40:60 ఒప్పందాలతో గృహ, వాణిజ్య సముదాయాలను కడుతున్నారు.
♦ నార్సింగి, నానక్‌రామ్ గూడ, పటాన్‌చెరు ముత్తంగి జంక్షన్ నుంచి పోచారం ఇన్ఫోసిస్ వెళ్లే దారిలోనూ బడా ప్రాజెక్ట్‌లు కనిపిస్తున్నాయి. బెంగళూరు రహదారిపై ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు, ఆధునిక టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడానికి పలు కార్పొరేట్ సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. మరో ఆరునెలల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశముంది. రానున్న రోజుల్లో ఇక్కడి స్థిరాస్తి కార్యకలాపాలన్నీ ఓఆర్‌ఆర్ చుట్టూనే జరుగుతాయి.
♦ రూఫ్ గార్డెన్‌తో భవనంపై బరువు పెరుగుతుంది. అందువల్ల ఫిల్లర్స్‌ను రూఫ్ గార్డెన్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మించాలి. ఫిల్లర్లు మోయగలిగిన బరువు కంటే ఎక్కువ బరువు పెరిగితే భవనానికి ముప్పే.
♦ అలాగే అంతస్తు పైకప్పుని చాలా పటిష్టంగా నిర్మించాలి. ఇది పటిష్టంగా లేకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
♦ మొక్కల పెంపకానికి అవసరమైన మీడియం (మృత్తిక)ను రాళ్లులేని మట్టితో ఏర్పాటు చేస్తే మంచిది. కొంత ఒండ్రు మన్ను కలిపితే ఇంకా బాగుంటుంది.
ఓఆర్‌ఆర్ చుట్టూ అభివృద్ధి..
నగరం నాలుగు వైపులను కలుపుతున్న ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తుతం చివరి దశలో ఉంది. 23 కి.మీ. ఘట్‌కేసర్-శామీర్‌పేట్ రోడ్డు నిర్మాణం ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేసి మొత్తం 158 కి.మీ. పొడవున నాలుగు లైన్ల ఓఆర్‌ఆర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని గ్రేటర్ మెనిఫెస్టోలో తెరాస ప్రకటించింది. దీని చుట్టూ హరిత టౌన్‌షిప్‌లు, అంతర్జాతీయ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, గేమింగ్ జోన్లూ నిర్మించాలని ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు నిర్ణయించాయి. నగరం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఓర్‌ఆర్‌కు చేరుకోవడానికి 33 రేడియల్ రోడ్లనూ రూపొందించారు. దీని చుట్టూ ఆర్టీసీ 22 టెర్మినల్ కమ్ డిపోలనూ ఏర్పాటు చేస్తోంది. ఓఆర్‌ఆర్ చుట్టూ ఇంటర్ చేంజ్‌లకు సమీపంలో 13 రవాణా ఆధారిత ప్రాంతాలను (ట్రాన్సిట్ ఓరియెంటెడ్ గ్రోత్ సెంటర్స్) అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి పెద్ద అంబర్‌పేట, నానక్‌రాంగూడ, బొంగులూరు, ఘట్‌కేసర్, కీసర, శామీర్‌పేట, మేడ్చల్, పటాన్ చెరు, దుండిగల్, కోకాపేట ప్రాంతాల్లో రానున్నాయి.