డిజిటల్ మీడియాతో సమాచార బదిలీ: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రజలతో విస్తృత స్థాయిలో సంభాషించడానికి, సమాచార బదిలీకి డిజిటల్ మీడియా సమర్థవంతమైన వేదిక అని కేంద్ర సమాచార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఆయన ‘హార్నెసింగ్ రోల్ ఆఫ్ సోషల్ మీడియా’ అనే అంశంపై సమాచార మంత్రిత్వశాఖకు సంబంధించిన కన్సల్టివ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. డిజిటల్ మీడియాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. వివిధ సోషల్ మీడియా వేదికల అనుసంధానం కోసం, ప్రజలతో ముఖాముఖి సంభాషణల కోసం ‘టాకథాన్’ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.
పలు సోషల్ మీడియా వేదికల అనుసంధానమే టాకథాన్ అని, దీనిలో ఫేస్‌బుక్, ట్విటర్‌ల నుంచి వచ్చిన ప్రశ్నలకు యూట్యూబ్‌లో ప్రత్యక్ష సమాధానాలు ఉంటాయన్నారు. ప్రజా అవసరాలను తీర్చడానికే దూరదర్శన్ యాప్‌ను రూపొందించామని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా దాదాపు వంద మహాత్మా గాంధీ సంకలనాలను డిజిటలైజ్ చేయడానికి పబ్లికేషన్ డివిజన్ డెరైక్టరేట్ చర్యలను తీసుకోనునుందని తెలిపారు. ముఖ్యమైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన చర్యలను, సోషల్ మీడియా పాత్రను సమాచార శాఖ కార్యదర్శి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.